విభ్రాంతి

విభ్రాంతి

ఏమండోయి శ్రీ వారు లేవండి నాధా, ఇంత పొద్దెక్కినా ఇలా పడుకుంటే ఎలా? అదీ పండగ రోజు మరి ఇంత సేపా….!? మాములు రోజుల్లో అనుకుంటే సరే అనుకుందును గాని లేవండి బాబు అంది విజయ దుప్పటి లాగుతూ.

శేఖర్ అబ్బా విజ్జూ కాసేపు ఆగు అని అంటూనే తనని దుప్పట్లోకి లాగాడు. ఛి ఛి ఏమిటీ చిలిపి పనులు, పిల్లలకు పెళ్ళిళ్ళు అయ్యి, అంతా స్థిరపడ్డాక, ఈ వయసులో ఇదేంటి సిగ్గు లేకుండా అంది విజయ, దుప్పటి తొలగించి, లేచి నిలబడింది.

ఏమోయ్ అన్నీ అయిపోయాయా? ఏంటి అయిపోయింది, మహా అయితే పిల్లలు స్థిర పడ్డారు అంతే గానీ మనకు ఇంకా వయసేం అయిపోలేదు, నువ్వు ఊ అంటే ఇప్పటికీ పిల్లలను కనడానికి నేను సిద్దమే అన్నాడు లేచి కూర్చుంటూ…

ఆ, ఆ మీరు అన్నిటికీ సిద్దమే, కాని మాకుండోద్దు ఓపిక, అయినా ఇప్పుడు కంటే లోకం నవ్వుతుంది, కోడై కూస్తుంది, హవ్వ అని నోరు నొక్కుకుంటారు, బంధువుల్లో పరువు పోతుంది అంది విజయ.

అయితే ఎవరో ఎదో అనుకుంటారు అని ఆలోచిస్తున్నావు కానీ నీకూ ఇష్టమే అన్నమాట అన్నాడు బుగ్గ గిల్లుతూ, ఛి ఛి రామా రామా నన్ను మీరు తప్పుదోవ పట్టిస్తున్నారు అంది విజయ. నేనా నేనేమన్నాను ఉన్నదే అన్నాను అందరికీ తీర్పులు చెప్పే జడ్జ్ గారికి కోరిక ఉన్నా సమాజం గురించి అలోచించి నీ కోరికను నువ్వే అణిచివేసుకుంటున్నావు అన్నాడు శేఖర్.

అబ్బో పబ్లిక్ లాయర్ గారూ బాగానే పాయింట్ పట్టారు గానీ ఇవ్వన్నీ తర్వాత ముందు తయారవ్వండి ఈరోజు ఉగాది పండగ అన్నీ సిద్దం చేసాను మీరోస్తే హారతి ఇచ్చేస్తా అంది విజయ, సరే ఇంతకి ఎక్కడికి ప్రోగం ఏంటి అన్నాడు. ఏమి లేదు. ఇంట్లోనే హయిగా భోజనం చేసి పాత సినిమా చూస్తూ గడపడమే అంది విజయ.

అబ్బా పండగ నాడూ పాత మొగుడేనా అన్నట్టు ఇంట్లోనే ఉండాలా అలా సరదాగా బయటకు వెళ్దాం జయ అన్నారు శేఖర్ గారు. ఆ, ముందు బయట ఎండను చూసి అప్పుడు చెప్పండి వెళ్దామా వద్దా అనేది అంది విజయ. హ నా కోరికకు తోడూ ఈ ఎండ ఒకటి సరే సాయంత్రం చల్ల గాలికి అలా అలా బైక్ పై వేల్లోద్దామా అన్నారు ఆశగా…. 

అబ్బా చూద్దాం లెండి ముందు లేవండి అంది విజయ, ఆహా నువ్వు సరే అనేవరకు లేవను అన్నారు శేఖర్ గారు, దాంతో ఇక ఏమి అనలేక సరే మహానుభావా సరే, అయినా బైక్ ఎందుకు కారు ఉండగా అంది విజయ. దానికి శేఖర్ బైక్ ఎందుకు అంటే అలా ప్రియురాలిని బైక్ పై కూర్చోబెట్టుకుని వెళ్ళడం ఈరోజుల్లో సరదానోయి అన్నాడు శేఖర్.

అబ్బో రోజు రోజుకు మీరు నవ యువకుడు అవుతున్నారు… కానివ్వండి కానివ్వండీ అంది ముసి ముసిగా నవ్వుతూ…. తనకూ కూడా అలా వెళ్ళాలనే ఉంది. కాబట్టి వెంటనే ఒప్పుకుంది, తమది ప్రేమ పెళ్ళి అప్పట్లో సైకిల్ పై వెళ్ళేందుకు సిగ్గుపడి వెళ్ళలేదు కానీ ఇప్పుడు బైక్ పై అనేసరికి అదొక థ్రిల్ గా అనిపించింది విజయకు. ఇక వాళ్ళు తమ పనుల్లో పడ్డారు.

********

రాజు కాలుగాలిన పిల్లిలా ఊరంతా తిరుగుతున్నాడు, అతనికి చిన్నప్పుడే కుటుంబం దూరమయ్యింది. తానొక అనాధ లాగా పెరిగాడు. మొదట్లో ఎలా బతకాలో తెలియలేదు, తర్వాత ఎవరో ఒకాయన తానూ పని నేర్పిస్తాను, తిండి పెడతాను అంటే వెంట వెళ్ళాడు.

అతను తీసుకు వెళ్ళిన దగ్గర తనలాంటి పిల్లలు చాలా మంది ఉన్నారు, వాళ్ళు అంతా పొద్దున్నే సిగ్నల్స్ దగ్గరికి వెళ్లి అడుక్కునే వాళ్ళు, అలా అందులో తానూ చేరాడు, తానూ కూడా కొంత పెద్దయ్యేదాకా అలాగే అడుక్కుని వచ్చి ఆ డబ్బంతా అతనికి ఇస్తే తలా కొంచం అన్నం, సాంబార్ పెట్టేవాడు, అదే భాగ్యంగా తినేవారు అందరూ.

తర్వాత్తర్వాత అడుక్కోవడం కంటే దొంగతనం చేయడం తేలిక అని తోటి వాళ్ళ ద్వారా తెలుసుకుని మెల్లిగా దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు. అలా ఇప్పటి వరకు చాలా చేసాడు, కానీ ఒక్కసారి కూడా దొరకలేదు. అదే రాజు గొప్పదనం, దొంగతనం చేసినట్టు వాళ్ళకు కూడా తెలియదు. అలా తర్ఫీదు తనకు తానే తీసుకున్నాడు రాజు.

అలాంటి రాజుకు ఈ రోజు ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. అన్ని అపశకునాలే ఎదురవుతున్నాయి, ఇక మధ్యానం ఉన్న డబ్బుతో ఎదో తిన్నాను అనిపించాడు, కానీ వాడి మనసంతా అయ్యో ఈ రోజు ఒక్క జేబు కొట్టలేక పోయాను అనే చింతలో ఉన్నాడు.

********

విజయ, శేఖర్ లు ఉగాది పండగ జరుపుకుని, పిల్లలతో మాట్లాడి, అనుకున్నట్టే పాత సినిమా చూసి, ఆనందించారు, ఆపై ఇద్దరూ కాసేపు నిద్ర పోయారు, సాయంత్రం అవ్వడంతో శేఖర్ హడావుడి చేస్తూ, విజయ తొందరగా పదా, నువ్వు రెడీ అయ్యేసరికి గుడి తలుపులు మూసి వేస్తారు కాబోలు అంటూ తానే జోక్ వేసి తానే నవ్వుకున్నారు.

ఈలోపు విజయ కంచిపట్టు చీరలో మేడలో పచ్చల హారం, నక్లెస్, తాళిబొట్టు, నుదుటున కుంకుమ బొట్టు, జడలో మల్లెలు, కనకాంబరాలు పెట్టుకుని ఆ గుళ్ళో దేవత ఎలా ఉంటుందో అంత కాకపోయినా అతని కళ్ళకు అలా దేవతలా కనిపించింది. జయా అంటూ ప్రేమగా దగ్గరికి తీసుకోబోయాడు.

హ హ గుడికి వెళ్తున్నాం, అదంతా తర్వాత అంటూ శేఖర్ ని తోసేసింది, అయితే పద మరి తొందరగా వెళ్లి దర్శనం, పంచాంగ శ్రవణం విని వచ్చేద్దాం అంటూ బైక్ తీసాడు, వాచ్ మెన్ కి చెప్పి, ఇద్దరూ బయలు దేరారు. బైక్ పై అలా వెళ్తూ శేఖర్ పాటలు పాడుతూ ఉంటె విజయ సిగ్గుపడుతూ వింటుంది, పక్కన నుండి వెళ్తున్న వారు వీరిని చూసి నవ్వుకుంటున్నారు, అంటే శేఖర్ అంత పెద్దగా పాడుతున్నాడు. అలా వారిద్దరూ గుడికి చేరుకున్నారు.

అక్కడే తచ్చాడుతున్న రాజుకి వీరిని చూడగానే కళ్ళు మెరిసాయి, అబ్బా పంట పండినట్టే అనుకున్నాడు, వారి వెనకాలే గుళ్ళోకి వెళ్ళాడు. పూజారి గారు జడ్జ్ అయిన విజయను గుర్తు పట్టి అమ్మా బాగున్నారా అంటూ కుశల ప్రశ్నలు వేసి, అర్చన చేయిస్తూ ఉండగా మెల్లిగా రాజు తన పనితనం తానూ చుపించబోతున్నాడు.

సరిగ్గా గొలుసు తీసి జేబులో వేసుకుని వెనక్కి తిరిగే సమయానికి పూజారి గారు అది చూసి అయ్యయ్యో దొంగ దొంగ అంటూ అరిచారు, కానీ రాజు పరుగెత్తకుండా అలాగే నిల్చున్నాడు, అనుమానం రాకుండా, విజయ, శేఖర్, మిగిలిన వాళ్ళు ఎక్కడ పూజారి గారు ఎక్కడ దొంగ అన్నారు చుట్టూ చూస్తూ, ఎందుకంటే వారికీ అసలు అనుమానం రాలేదు.

అదేంటమ్మ మీ మధ్యలోనే ఉన్నాడు అదిగో వాడే దొంగ అమ్మ విజయ గారు మీ మెళ్ళో పచ్చల హారం లేదు దాన్ని వాడు జేబులో వేసుకున్నాడు నేను చూసాను అన్నారు పూజారి గారు, వెంటనే విజయ మెళ్ళో చూసుకుంటూ అవును నిజమే అని అనగానే అందరూ రాజు వైపు రావడంతో వాడు పరుగెత్తాడు.

అది చూసి అందరూ వాడిని పట్టుకుని చాలా కొట్టారు. పాపం రాజు ఆ దెబ్బలు తట్టుకోలేక అమ్మా, అబ్బా, అని అరుస్తుండగా విజయ, శేఖర్ వచ్చి ఆగండి, ఆగండి కొట్టకండి అంటూ ఆపారు అందరూ. ఇంకొందరు అమ్మో ఇలాంటి దొంగలు జడ్జ్ గారినే వదల లేదు అంటే ఇంకా మనకెక్కడ రక్షణ, అమ్మో దొంగలు బాగా చెలరేగిపోయారు.

ఇలా పెద్దవాళ్ళనే వదలక పోతే మనలాంటి వారికి ఎలాంటి రక్షణ ఇస్తారు పోలీసులు అయినా, జడ్జ్ అయినా దొంగలు మరి రెచ్చిపోతున్నారు అంటూ గుసగుసలు పోతున్నారు. అవన్నీ వింటూనే ఉన్న జడ్జ్ విజయ రాజు ని లేపి, దెబ్బలు తగిలాయా బాబు అంటూ అడిగేసరికి వాడు భయంతో హారాన్ని ఇచ్చేసాడు. విజయ అతనికి తగిలిన దెబ్బలు చూస్తుంటే శేఖర్ తన ఖర్చిపు తీసి ఇవ్వగానే గాయాలు అయిన దగ్గర కట్టింది, నీళ్ళు తాగించింది. ఎంటమ్మా మీరు చేస్తున్న పని వెంటనే ఫోన్ చేసి పోలీసులకు అప్పగించకుండా వాడికి సపర్యలు చేస్తున్నారు అన్నారు అక్కడున్నవారు.

వారి వైపు తిరిగిన విజయ వారందర్నీ చూస్తూ మీకేం హక్కు ఉందని అతన్ని కొట్టారు అంది. హక్కా హక్కేంటి దొంగతనం చేసాడు కాబట్టి కొట్టాo అదేమ తప్పు కాదు కదా అన్నారు అందరూ. తప్పే ముమ్మాటికి తప్పే ఒకర్ని దండించే అధికారం మనకు లేదు. ఎందుకంటే ఎవరూ పుట్టుకతో దొంగలు అవ్వరు, వారి పరిస్థుతులు వారిని అలా మారుస్తాయి, అంతే తప్ప కావాలని ఎవరూ చేయరు, ఇతన్ని చూడండి మీరెంత కొట్టినా ఏమి అనకుండా పారిపోకుండా ఉన్నాడు, అంటే ఇతను పెద్ద దొంగ కాదు, అంటే ఆరితేరిన వాడు కాదు.

పాపం అతనొక అనాధ, చిన్నప్పుడే ఎవరైనా పూనుకుని ఉంటె మంచి శరణాలయంలో చేరి చదువుకునే పసివాడు, నా కొడుకు కన్నా పదేళ్ళు చిన్నవాడు వీడు. ఇప్పటికైనా మీరు మారండి దొంగతనాలు వృత్తిగా చేసేవారిని నేను చాలామందిని చూసాను, కానీ ఈ అబ్బాయి అలాంటి వాడు కాడు అనిపిస్తుంది. అందువల్లే పోలీసులకు చెప్పకుండా వీడిని మా ఇంటికి తీసుకు వెళ్ళి వాడిని మంచిగా చదివించాలని నిర్ణయించుకున్నా, మీకు కూడా ఇలాంటి వాళ్ళు తారస పడితే వెంటనే ఏదైనా శరణాలయానికి చెప్పి దాంట్లో చేర్చితే ఒక మంచి పని చేసిన వారు అవుతారు.

కాబట్టి నా మాటలు విని మీకు చేతనైన సాయాన్ని అందించండి, మనిషికి మనిషి సాయం చేయకపోతే మనం మనుషులం ఎలా అవుతాం? అందుకే అంటున్న విజయ మాటలకూ పూజారి అడ్డు వస్తూ అమ్మ ఇంట్లో పెట్టుకుంటా అంటున్నారు, మరి అక్కడ చేయడు అని నమ్మకం ఏముంది అన్నారు.

పూజారి గారూ వాడి మొహాన్ని చూడండి ఎంత సిగ్గు పడుతున్నాడో, భయపడుతున్నాడో, అతను మళ్ళి ఇలాంటివి చేయడు అనేదే నా నమ్మకం అందుకే తీసుకుని వెళ్తున్నా, ఇక మీరంతా అన్నమాటలు జడ్జ్ కే రక్షణ లేదని అంటున్నారు. కానీ జడ్జ్ కూడా ఒక మనిషే కదా, అందరం సమానమే, అలాగే పోలీసులు ఎప్పుడూ మనల్ని చూస్తూ ఉంటె మిగిలిన వారిని ఎవరూ చూస్తారు చెప్పండి.

మహా అయితే నాలుగు రోజులు జైల్లో పెట్టాక వీడు దొంగతనాల్లో ఆరితేరి బయటకు వచ్చి ఇంకేం చేస్తాడో తెలియదు. కాబట్టి మొక్కనే వంచాలి, మానైతే వంచలేం, ఇప్పుడు నేను చేస్తున్నది అదే అని చెప్పి అందరికి నమస్కారం చేసి పద బాబు అంటూ ఆటోలో ఇంటికి వెళ్తే, శేఖర్ బైక్ మీద వారిని వెంబడించాడు.

ఎవరైనా ఏదైనా కాని పని చేస్తున్నారు అంటే అప్పుడు వారికి ఉన్న పరిస్థితులే కారణం. అలాగే జడ్జ్ అయినా ఒకరి బరువు బాధ్యతలు తీసుకుంటూ సాయం చేస్తూ, మిగిలిన వారికి ఆదర్శంగా నిలిచింది జడ్జ్ విజయ. మీకు ఇలాంటి వారు తారస పడినా, కనిపించినా వెంటనే అనాధ శరణాలయంలో చేర్పించండి అదే మీరు వారికి చేసే గొప్ప సాయం. ఇలా కొందరైనా మారతారని ఆశిద్దాం. మనుషులం కాబట్టి మీకు తోచిన సాయం చేయండి అనేదే నా కథ సారాంశం.

– భవ్యచారు

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© 2023 Aksharalipi - Theme by WPEnjoy · Powered by WordPress