విధి లిఖితం!

విధి లిఖితం!

మనమొకటి తలిస్తే.. భగవంతుడు మరొకటి తలుస్తాడట.. దానినే విధి లిఖితం అంటారు.. సరిగ్గా అలాంటి సంఘటనే ఓ ఊరిలో జరిగింది..

కాలుష్యానికి దూరంగా.. ప్రకృతి అందాలకు నిలయంగా.. చుట్టూ పచ్చని పంటచేలు.. కమ్మని మట్టివాసనతో.. ఆ ఊరు నిజంగా పేరుకు తగ్గట్టుగానే చిన్నపాటి ‘రామ’రాజ్యం. ఎన్నికలప్పుడు తప్ప ఇక్కడ రాజకీయ పార్టీలు కనపడవు.. కులాలు.. మతాల ప్రసక్తే రాదు. ఉన్నంతలో కలిసిమెలసి, ఒకరికొకరంటూ ఊరంతా ఒకే కుటుంబంగా బతుకుతుంటారు.

అలాంటి మంచి మనుషులున్న ఆ ఊరిలో ఓ భూ స్వామి ఉన్నాడు. రాముడిలా ఆ పల్లె ప్రజలకు అండగా ఉండేవాడు.. తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి ఉన్నా.. ఇసుమంతైనా ఆ దర్పాన్ని ప్రదర్శించడు.. ఊరంతా అతని వెంట ఉన్నా అ పొగరును నెత్తికెక్కించుకోలేదు.

పూరి గుడిసె నుంచి డాబా ఇల్లు వరకూ అందులో ఉన్నవారెవరైనా ఆయనకు ఆయన భార్యకు సమానమే.. ఎవరు ఏ శుభకార్యానికి పిలిచినా ఇద్దరూ వెళ్లి ఆశీర్వదించి వస్తారు. కష్టం అంటే పిలవకపోయినా వెళ్లి సాయం అందిస్తుంటారు.

శివ పార్వతుల్లా కనిపించే ఆ దంపతులకు ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువే.. తెలుగు వారి సంప్రదాయాలను పాటిస్తూ, దైవ సేవకులను ప్రోత్సహిస్తూ.. హిందుత్వాన్ని పరిరక్షిస్తుంటారు. అన్యమతాలను కూడా అంతే గౌరవిస్తుంటారు.

ఊరిలో శివాలయ నిర్మాణాన్ని తమ చేతుల మీదుగా పూర్తి చేసి, మరో శివాలయాన్ని అత్తవారి ఊరిలోనూ నిర్మించాలని తలంచి, స్వయంగా భూదానం చేశారాయన.. అలా రెండూళ్లకూ పెద్దగా మారారు. ప్రజల మన్ననలు పొందారు. ప్రెసిడెంట్ గానూ సేవలందించారు.

అంతా బాగుంటే ఎలా.. ఇద్దరు కొడుకులతో, ప్రజల్లో పలుకుబడితో.. ఆనందంగా సాగుతున్న ఆ కుటుంబాన్ని చూసి విధికి ఈర్ష్య పుట్టిందో.. రెండు ఆలయాలను సమకూర్చిన భక్తుడిని తనలో ఐక్యం చేసుకోవాలని శివయ్యకు మనసుకలిగిందో ఏమో..

ఒక రోజు తన పొలం నుంచి వస్తూ రోడ్డుపై పడిపోయాడు. అటుగా వెళుతున్నవారు గమనించి ఊళ్లోవాళ్లకి సమాచారం ఇచ్చారు. అంతా వచ్చి ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ..

ఆ గుండె అప్పటికే ఆగిపోయింది.. మంచి మనిషి ప్రాణం శివసన్నిధికి చేరిపోయింది. విషయం తెలిసి ఊరంతా గొల్లుమంది.. పసి వాళ్ల నుంచి ముసలివాళ్ళ వరకూ.. ప్రతి ఒక్కరి హృదయంలో విషాదం అలుముకుంది..

ఆఖరి చూపుకోసం వెల్లువెత్తిన జన ప్రవాహం వెంటరాగా.. తన చేతులమీదుగా కొలువైన శివయ్య సాక్షిగా.. ఊరిపెద్ద కైలాసపురికేగిపోయాడు. సాగనంపిన జనం ఆయన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ.. “అలాంటి మనిషి జీవితం ఇలా ముగియాలని రాసుందేమో”.. అనుకుంటూ అశ్రునివాళులర్పించారు.

డబ్బూ, పదవి, హోదా, ఆస్తి, అంతస్తు, ఇవేవీ ఆయనను కాపాడలేకపోయాయి.. వెంటబడి వెళ్లలేకపోయాయి.. విధి లిఖితాన్ని ఎవరూ మార్చలేరుకదా.. కానీ ఆయన ప్రజల్లో సంపాదించుకున్న పేరు.. చేసిన మంచి శాశ్వతంగా నిలిచిపోతుందనేది‌ మాత్రం నిజం.!

– ది పెన్

Related Posts