విధ్వంసం

విధ్వంసం

నిన్నటిదాకా ఆ చెట్టు
నిత్యచైతన్యపు ప్రతీక
భూపాలరాగాన్ని భువికి
వినిపించే పక్షుల ఆవాసం

ఆ నివాసమిప్పుడు నేలరాలింది
విలవిలలాడే ఆకుల సందుల్లోంచి
గొల్లుమంటున్న గూళ్ళను
ఓదార్చలేక నేల కన్నీటిని కుక్కుకుంది

బలవంతులు తప్పించుకుంటారు
బలహీనులకే లోకంలో కష్టాలు
దేక్కుంటు పాక్కుంటూ
పక్షులు కూడా కాందిశీకులై ఆశ్రయాన్ని అర్ధిస్తుంటాయి

అభివృద్ధి శకటమంతే
అడ్డనిపిస్తే ఎవరి రెక్కలైనా
విరిచేస్తుంది
బహుళ అంతస్తు భవనమో
బడా బాబుల విల్లాయో వెలుస్తుందక్కడ

పగబట్టిన ప్రకృతి ఊరుకుంటుందా
ఎప్పుడో ఒకప్పుడు దెబ్బ రుచి చూపిస్తుంది
విలయమై ప్రళయమై చుట్టేస్తుంది
నీటిమడుగులో జీవితం తేలుతూ ఉంటుంటే
దిక్కులేని స్థితిలో సాయంకోసం దిక్కులు చూసేలా చేస్తుంది

విధ్వంసం ఊరికే ఉండదు
అందరిని కబళించక
ఊరుకోదు
నాగరికత ముసుగులో
నాట్యమాడే మనిషీ
నిజాలు తెలుసుకోక తప్పదు

– సి. యస్.రాంబాబు

Related Posts