విప్లవం ప్రేమా మార్పు
విప్లవమే ప్రేమా
అదెలా
నేను ప్రేమించిందే
నీలో విప్లవాన్ని కనుక
అవునా
ఐనా నిన్ను నమ్మడమెలా
బౌద్ధం కన్నా
ముందే నీ మీద ప్రేమ కనుకా
అప్పుడు పుట్టుంటామా..?
పుట్టాం కదా..!
అగ్ని శిఖనై నేను
ఊపిరి దీపమై నీవూ
ఇంతకీ విప్లవం లేవదీసిన ప్రేమ
ప్రేమ తెర తీసిన విప్లవం.. ఉన్నాయా
లేకేం.. సహపంక్తి భోజనాలూ
సామూహిక సైద్ధాంతిక వివాహాలూ అవేగా
వలపుకీ విప్లవానికీ ముడిపడ్డాకేగా
భోగిమంటలు రాజుకుందీ
రావణ కాష్టాలన్నీ నీరు గారిందీ
అద్సరే.. మనిద్దరమెలా కలుస్తాం
దానికేం.. నేను
అగ్ని కణాలు పరుచుకుంటూ పోతా
పక్కనే.. నువ్వు
పూల మొక్కలు నాటుకుంటూ రా
నాదో దారీ నీదో దారైనా గమ్యమొకటేగా
విప్లవం ప్రేమా.. జంటగా మారితే
వాటికి పుట్టే బిడ్డ పేరే ‘మార్పు’ కదా
-గురువర్థన్ రెడ్డి