vyasanamu pathanamu

వ్యసనము – పతనము

వ్యసనము – పతనము


*పల్లవి *
తాగకురన్నా ….. తాగి ఊగకురన్నా “2 వ”
తాగి ఊగినావంటె తాగుబోతువంటారు
పని చేయక తాగుతుంటె పనికి రాడంటారు
తాగకురన్నా….. తాగి ఊగకురన్నా “2 “
చరణం
పిల్లలంత నిన్నుజూచి పిచ్చోడని అంటారు
పెద్దలెన్ని చెప్పినా లెక్క చేయకుంటావు
బ్రతిమిలాడిన భార్యను విదిలించుకుంటావు
ఆకలేసి అడిగినా పిల్లల బెదిరించుతావు
తాగకురన్నా తాగి ఊగకురన్నా
చరణం
పనులు చేయకుండానె పైసలెట్ల వస్తాయి
ఇంట వంట గిన్నెలమ్మి మందు తాగుతుంటావు
పెండ్లామును బెదిరించి కూలిడబ్బు లాక్కుంటవు
బారుకెళ్ళి మందుతాగి నేలబడి పొర్లుతావు
తాగకురన్నా తాగి ఊగకురన్నా
చరణం
పనికెళ్ళక పడుకుంటవు పస్తులుంచి ఏడ్పిస్తవు
బడికంపక పిల్లలను వీధి బాలలను జేస్తవు
ఆలి,పిల్ల లాకలేసి అల్లాడుతు ఉంటారు
ఎంగిలిస్తరాకు లన్ని ఏరుకొని తింటారు
తాగకురన్నా తాగి తాగి ఊగకురన్నా
చరణం
ఆకలి భరించలేక దొంగలుగా మారుతారు
పోలీసులు పట్టుకొని నేరస్తులుగా కట్టి
ఇంటినుండి ఈడ్చుకెళ్ళి జైలునందు వేస్తారు
బాధ్యత లేని తండ్రి వల్ల బాధలు పడుతుంటారు
తాగకురన్నా తాగి ఊగకురన్నా
చరణం
పరువుబోయె పైసబోయె ఆరోగ్యామంత బోయె
బాధ్యతెరుగని భర్త చెడు అలవాట్ల ఫలితము
కష్టపడే భార్యబతుకు భంగ పాటాయెను
ఆత్మహత్య చేసుకొని అంతమాయెను తుదకు
తాగకురన్నా తాగి ఊగకురన్నా
చరణం
వ్యసనాలకు బానిసైతె వ్యర్థులై పోతారు
పరిమితమ్ము లేకుంటే పతనమై పోతారు
మంచివారి మాటలకు మర్యాదల నిస్తారు
వ్యసనపరుల మాటలకు ఎవ్వరు విలువివ్వరు
తాగకురన్నా తాగి ఊగకురన్నా
చరణం
శృతి లేని సంసారము చిందవందరాయెను
భార్యకన్న కలలన్ని కల్లలుగా మారెను
ధైర్యమిచ్చు ఇంటిపెద్ద దారితప్పి నడవగా
కన్నసంతు సమాజాన చీడపురుగు లాయెను
తాగకురన్నా తాగి ఊగకురన్నా
తాగకురన్నా తాగి ఊగకురన్నా
తాగకురన్నా తాగి ఊగకురన్నా

– కోట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *