"C_PLJ4CZpdxQ0": { "on": "visible", "vars": { "event_name": "conversion", "send_to": ["AW-10942541090/v-d1CN7kpM4DEKLa5-Eo"] } }

యోధ ఎపిసోడ్ 1

యోధ ఎపిసోడ్ 1

నగరంలో రోజు రోజుకు పెరిగిపోతున్న నేరాలు..

ఇంకా మిస్టరీ వీడని మర్డర్ కేసులు..

ఆరు నెలలుగా తెలియని ఆ అన్నా చెల్లెళ్ళ ఆచూకీ..

ఇది పోలీసుల మరియు ప్రభుత్వ వైఫల్యమేనా?”

న్యూస్ ఛానల్ లో వస్తున్న ఆ న్యూస్ ని, హాల్లో కూర్చొని పెద్ద వాల్యూంతో తీరిగ్గా వింటున్నాడు శ్రీనివాసరావు పొద్దు పొద్దునే..

“అబ్బబ్బా.. పొద్దునే ఆ న్యూస్ లు కాకుండా ఏదైనా మనసుకు కొంచెం ప్రశాంతత కలిగిన భక్తి గీతాలు ఏమైనా పెట్టరాదూ” అంటూ వంటింట్లో వంట చేసుకుంటూ అదంతా వింటూన్న అతని భార్య సులోచన విసుక్కుంది.

సరిగ్గా తను అలా అందో లేదో ఈ లోపే పవర్ పోయింది.

“అదిగో నీ మొర ఆ భగవంతుడు కూడా ఆలకించినట్టున్నాడోయ్!” అంటూ ఆ పక్కనే ఉన్న న్యూస్ పేపర్ ని తన చేతుల్లోకి తీసుకున్నాడు అది చదవడానికి.

ఈ లోపే

“ఇదిగోండి కాఫీ..!” అంటూ తన చేతికి ఆ కాఫీ కప్పు తెచ్చి ఇవ్వబోతున్న సులోచనను చూస్తూ…

“ఇదిగోనోయ్..! ఈ న్యూస్ పేపర్ నిండా కూడా అవే న్యూస్ లు, న్యూసెన్స్లు.”  

అంటూ తన చేతిలో ఉన్న పేపర్ ను కాస్తా పక్కనే ఉన్న బల్ల పై కొంచెం అసహనంగా విసిరి కొట్టాడు శ్రీనివాసరావు.

“హా..! నేరాలు, ఆ నేరాలు చేస్తున్నవారు రోజుకు రోజుకి పెరిగిపోతున్నప్పుడు, పాపం ఈ పత్రికా వాళ్ళు మాత్రం ఏం చేయగలరు. మనలాంటి వారికి ఆ సమాచారాన్ని అందించడం తప్ప!” అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది సులోచన.

“అమ్మా..! లంచ్ బాక్స్ రెఢీ అయ్యిందా..!! అసలే కాలేజ్ కి లేట్ అవుతుంది.” అంటూ లోపలి గదిలో నుండి ఒక వాయిస్ వినిపించింది.

(ఆ వాయిస్ ఎవరిదో కాదు పార్ధుది…. పార్థ సారథి. శ్రీనివాసరావు, సులోచన దంపతులకు ఒక్కగానొక్క కొడుకు. అతనంటే తల్లికి బాగా గారం.)

“హా… అయ్యింది నాన్న..! టిఫిన్ కూడా అయిపోయింది రా.. చేసేసి వెళ్ళు! అయినా నువ్వు లేచేదేమో లేటు… పైగా కంగారు పెట్టేది నన్నా!!” అంటూ బదులిచ్చింది సులోచన.

అప్పటికే బ్యాగ్ సర్దుకుని గబ..! గబా..!! బాక్స్ తీసుకోవడానికి వంటిట్లోకి వచ్చిన పార్ధు…

“ఇప్పుడేం వద్దమ్మ! టైం అవుతుంది, అసలే దగ్గర్లో ప్రాజెక్ట్ వర్క్ ఉంది, దాని గురించి మా టీమ్ తో కొంచెం డిస్కస్ చెయ్యాలి. మిస్ అయితే టీమ్ లీడర్ గా మళ్లీ నేనే ఇబ్బంది పడాలి” అంటూ ఆ లంచ్ బాక్స్ తీసుకుని అక్కడి నుండి హడావుడిగా బయలుదేరిపోయాడు పార్ధు.

“అది కాదు రా నాన్న..! రోజు ఇలానే చేస్తున్నావ్… ఇలా అయితే నీ ఆరోగ్యం ఏమవుతుంది చెప్పు..!” అంటూ ఒక పక్కన సులోచన ఎంత వారిస్తూ అరుస్తున్నా పట్టించుకోకుండా…

అలా తను హాల్లో నుండి వెళ్తుంటే, జరిగిన సంభాషణంతా వింటున్న తండ్రి శ్రీనివాసరావు, పార్ధు వంక కోపంగా ఓ లుక్ వేస్తూ తనని అలానే చూస్తున్నాడు. తండ్రి అలా చూడడం గమినించిన పార్ధు, తన చేతిలోనున్న బ్యాగ్ నీ తన మొహానికి అడ్డు పెట్టుకుని మెల్లగా అక్కడి నుండి జారుకోసాగాడు.

(అదేలేండి ప్రతి ఇంట్లో ఉండే తంతే, తండ్రంటే భక్తి తో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవం, ప్రతీ కొడుక్కి)

ఇంతలో అలా బయట పడబోతూ… ఇంటి గుమ్మం దాటబోతున్న పార్ధు కి ఒక నల్ల పిల్లి ఎదురొచ్చింది. దాన్ని పార్ధు పెద్దగా పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నప్పటికీ, అప్పటికే ఇంట్లో నుండి వచ్చి, అది గమనించిన పార్ధు తల్లి సులోచనా…

“ఒరేయ్..నాన్న..! ఒకసారి ఆగు…!! ఏంట్రా ఆ ఉరుకులు పరుగులు…? వెళ్ళేటప్పుడు ఎదురెం వస్తుందో కూడా చూసుకోవా..? ఆ నల్ల పిల్లని దాటుకుంటూ అలా వెళ్ళిపోతావేం ?” అంటూ మందలించి.

“ఆగాగు.. దిష్టి తీస్తాను!” అంటూ కంగారుగా ఆవిడ లోపలికి వెళ్లబోతుంటే,

“అబ్బబ్బా… ఈ కంప్యూటర్ యుగంలో కూడా మీకీ మూఢ నమ్మకాలు ఏంటమ్మా…? నీకు తెలుసు కదా నాకు ఇవన్నీ నచ్చవని… నల్ల పిల్లి, దిష్టి అంటూ మీకున్న చేదస్తంతో ఓ… నస పెడతావు.”

అంటూ తన తల్లి మాట లెక్కచేయకుండా పార్ధు అక్కడి నుండి బయటకి వెళ్లబోతుంటే,

“ఆగండి …! ఆగండి…!! సైన్స్ స్టూడెంట్ గారు..!!! ఎంత తమరు సైన్స్ స్టూడెంట్ అయితే మాత్రం, మాకున్న ఈ కొద్ది పాటి నమ్మకాలను చేదస్తమంటూ కొట్టి పారేయకండి! మమ్మల్ని, మా విధి విధానాలను, కట్టుబాట్లను చులకన చేయకండి! కొన్ని, కొన్ని పద్ధతులు, ఆచారాలు పాటించాలండొయ్! మీకోసం కాకపోయినా, కనీసం వయసు మళ్ళిన మాకొసమైనా తప్పదుగా…! ఎంతైనా మిమ్మల్ని ఇంతటివాడిని చేసింది మాకున్న ఆ నమ్మకాలే గా…”

అంటూ పార్ధుని ఆపే ప్రయత్నం చేశాడు తన తండ్రి శ్రీనివాసరావు. తల్లి మాటను పెడ చెవిన పెట్టిన పార్ధు… తండ్రి అన్న మాటకు మాత్రం అడ్డు చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు. ఇక తన తల్లి సులోచన అనుకున్నట్టుగానే పార్ధుకి దిష్టి తీసి, ఆ పై తనని కాలేజ్ కి సాగనంపింది.

**********

పార్థ సారథి… (పార్ధు) ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్. సిటీలోనే ఓ పెద్ద పేరున్న కాలేజిలో బయో టెక్నాలజీలో చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఈ మూఢ నమ్మకాలు, ఆచారాలు అంటే పార్ధుకి పడవు.. దైవం, దయ్యం అంటే అసలే లెక్క చెయ్యడు. ఎంతైనా సైన్స్ స్టూడెంట్ కదా.! కాలేజ్ అంటేనే చిన్న చిన్న గ్యాంగులు, కొన్ని కొన్ని కొట్లాటలు, వార్ లు సహజం.. మన పార్ధు కూడా ఒక గ్యాంగ్ ఉంది మరి!

పార్ధు తో పాటు.. గోపాల్, విశాల్, అవేష్, గౌతమి, కృతి, ప్రియ వీరంతా ఒక గ్యాంగ్. కాలేజిలో చేరినప్పటి నుండి మంచి ఫ్రెండ్స్ కూడా… పార్ధు విషయానికి వస్తె, ఆ గ్యాంగ్ లీడర్ అన్న మాటే కానీ, చాలా సౌమ్యుడు. ఏదైనా గొడవైతే, కొట్లాటల వరకూ పోనివ్వకుండా మాటలతో సర్దిచెప్పి, అక్కడితో దాన్ని ముగించెలా చేస్తాడు.

తన పని తాను చూసుకుంటూ.. అనవసరమైన విషయాలలో తలదూర్చని తత్వం. అందుకే, పార్ధు అంటే ఆ గ్యాంగ్ లో మాత్రమే కాదు, కాలేజ్ అంతా ఒక మంచి అభిప్రాయం, గౌరవం కూడానూ.

కానీ… దెయ్యాలు , భూతాలు అంటూ ఎవరైనా తన దగ్గర తనకి నచ్చని ఆ మూఢనమ్మకాల గురించి మాట్లాడితే మాత్రం, తనకి ఎక్కడ లేని కోపం వస్తుంది. దాన్ని కంట్రోల్ చేసుకుంటూనే తనకున్న విజ్ఞానంతోనే వారికి సమాధానమిస్తాడు.

ఇక ఆ గ్యాంగ్ లో మిగిలిన వాళ్ళలో…

గోపాల్ – గౌతమి

విశాల్ – కృతి

అవేశ్ – ప్రియ

ప్రేమ పక్షులు.

పార్ధు మాత్రం సింగిల్..

తనని ప్రేమించే ఆడ పక్షి దొరక్క కాదు, అప్పటికే ఆ కాలేజ్ లో పార్ధు గుణ గణాలు నచ్చి, తనకి చాలామందే ప్రపోజ్ చేసినా, ఇలాంటి రిలేషన్స్ మీద తనకి పెద్దగా నమ్మకం లేక తను వాళ్లందరినీ రిజెక్ట్ చేశాడు. 

ప్రాజెక్ట్ వర్క్ దగ్గర పడుతుండడం, ఫైనల్ ఎగ్జామ్స్ కి ఇంకా ఆరు నెలలు టైం ఉండడంతో దానికి ముందు జరగబోయే ఫేర్వెల్ పార్టీ లీడ్ తీసుకునే వారికోసం చర్చలు జరుగుతున్నాయి కాలేజిలో… అవి పార్థుకి అప్పగిస్తే బాగుంటుందని స్టూడెంట్స్ అండ్ మేనేజిమెంట్ వారందరి ఆలోచన.

ప్రతి కథలో హీరో ఉన్నట్టే, విల్లన్ కూడా ఉంటాడు గా… 

తన పేరు విక్కీ… తనతో తిరిగే గ్యాంగ్ ఒక అల్లరిమూక. విక్కీ.. ఒక పేరు మోసిన ఎమ్మెల్యే కొడుకు కావడంతో కాలేజిలో తనేం చేసినా చెల్లుబాటే. ఆ కాలేజిలో తనకి అడ్డు చెప్పేవాళ్ళు లేరు, మేనేజ్మెంట్ తో సహా… పొరపాటున ఎవరైనా అడ్డు చెప్పారో వాళ్ల పని అయిపోయినట్టే! 

అప్పటివరకూ ఇలాంటి ఈవెంట్ లు వచ్చిన ప్రతిసారీ… పార్ధు లీడ్ చేయడం, వాటికి ఏదోలా అడ్డు తగులుతాడు విక్కీ. అలా విక్కీ అడ్డు తగులుకున్న ప్రతిసారీ, తనకున్న విజ్ఞానంతో… తెలివిగా వాటిని చాలా సున్నితంగానే తిప్పికొట్టేవాడు పార్ధు. ఈ సారి చివరిగా జరగబోయే ఈ ఈవెంట్ నీ కూడా తానే లీడ్ చెయ్యాలని విక్కీ కోరిక.

ఇదిలా ఉండగా ఆ రోజు… లంచ్ బ్రేక్ లో విక్కి బ్యాచ్ అంతా ఒక చోట కూర్చుని మాట్లాడుకుంటున్నారు, 

“అరేయ్…! విక్కీ వాళ్ళ రిలేటివ్స్ కి సంబంధించిన ఒక గెస్ట్ హౌజ్ ఉందట, అందులో దెయ్యాలు, భూతాలు, ప్రేత పిశాచాలు ఉన్నాయంట… అక్కడికి వెళ్ళిన వాళ్ళలో భయంతో చచ్చిపోయిన వాళ్లు కొందరైతే, ఉండలేక పారిపోయిన వాళ్లు మరికొందరిని.. అది గెస్ట్ హౌజ్ కాదని, ఒక ఘోస్ట్ హౌజ్ అని, అక్కడికి వెళ్ళడమంటే ప్రాణాలతో చెలగాటమాడడమేనని నాకు విక్కి చెప్పాడు. వాళ్లందరినీ మరింతగా భయపెడుతూ… వాళ్ళందరికీ ఆ గెస్ట్ హౌజ్ గురించి వివరించి చెప్తుంటాడు విక్కి ఫ్రెండ్ ఒకడు. అదంతా పక్కనే ఉండి వింటున్న అవేష్…

“హా…! హాహ్హ..!! హ్హహ్హ…!!! ఇలాంటి మూఢనమ్మకాలు కలిగిన మూర్ఖులు కూడా ఉంటారా ఈ రోజుల్లో… పైగా ఇంత చదువు చదివి” అంటూ వాళ్ల మాటలకు పగలబడి నవ్వుతాడు గట్టిగా వాళ్ళకి వినిపించేట్టు. (మన అవెష్ కి కొంచెం నోటి దురద ఎక్కువ లెండి)

అప్పటికే పార్ధు బ్యాచ్ మీద పీకల్లోతు అసూయతో ఉన్న విక్కీ బ్యాచ్ కి ఆవేష్ మాటలు కోపాన్ని తెప్పించాయి. ఇంకేముంది విక్కికి విషయాన్ని తెలియ చేయడమే కాకుండా, తనని మూర్కుడు అని అన్నాడంటూ, ఇంకెన్నో అనరాని మాటలు అన్నాడంటూ మరింతగా తన మెదడుకి ఎక్కిస్తారు విక్కి ఫ్రెండ్స్. దాంతో విక్కి కి అవి కోపాన్ని తెప్పించి 

“నన్నే మూర్జడంటాడా..!” అంటూ ఆవేశంతో అవేశ్ ని వెతుకుతూ తనపై దాడి చేయడానికి కాలేజ్ అంతా తిరుగుతాడు. విషయం తెలిసిన అవేశ్.. భయంతో పార్ధు చెంతకు చేరి జరిగిన దాన్ని వివరిస్తాడు.

పార్ధు కూడా అలాంటి భావాలు కలిగిన వాడే కావడంతో అవేశ్ అన్న దాన్ని తప్పు పట్టడు. పైగా “జరిగిన దాంట్లో నీ తప్పేం లేదు, నేనున్నాగా… అంతా నేను చూసుకుంటాలే!” అంటూ తనకి దైర్యం చెప్తాడు.

ఇంతలో అక్కడికి వచ్చిన విక్కీ… అవేశ్ ని చూసి కోపంతో ఊగిపోతూ కాలేజిలో అందరూ గుమిగూడి చూస్తుండగానే,

“నన్నే మూర్కుడంటావా..? నీకెంత దైర్యం…! రా…రా..!! దైర్యముంటే, ఇప్పుడు నా ముందు కుయ్యి ఇందాక నువ్వు కూడిన కూతలు,” అంటూ తనపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంటే…

దానికి పార్ధు అడ్డు పడి “తనన్న దాంట్లో తప్పేం ఉంది, ఇంత చదువుకుని కూడా ఆ మూఢ నమ్మకాలను గుడ్డిగా నమ్మితే మూర్ఖులనే అంటారు గా” అంటూ అవేష్ ని వెనకేసుకొస్తాడు. కాలేజ్ అంతా చూస్తుండగానే…

పార్ధు అన్న మాటలు విక్కికున్న ఆవేశాన్ని రెట్టింపు చేశాయి… పక్కనే ఉన్న విక్కి ఫ్రండ్ వచ్చి, ఈ టైంలో తనతో గొడవ పెట్టుకోవడం కరెక్ట్ కాదని, అలా చేస్తే పార్ధు మీది కాలేజ్ లో అంతా సింపతీ పెరిగి, ఈవెంట్ తమ చేతుల్లోంచి చేజారిపోతుందని విక్కికి నచ్చచెప్తాడు. దాంతో కొంచెం తగ్గిన విక్కి తనకున్న తెలివి ఉపయోగించి…

“సరే… పార్ధు! ఎలాగో ఇంకొన్ని రోజుల్లో మనం ఈ కాలేజ్ ని వదిలి పెట్టి వెల్లిపోబోతున్నం… విడిపోయేటప్పుడు మన మధ్య ఇంకా ఈ గొడవలు ఎందుకు చెప్పు! నువ్వసలు దెయ్యాలకి భూతాలకి భయపడనని, మూఢనమ్మకాలు.. మూర్కుడు… అంటూ నన్ను ఇంతమంది ముందు హేళన చేసావు కాబట్టి, నిజంగా నీకంత దైర్యమే ఉంటే, ఒక వారం రోజులు పాటు ఆ గెస్ట్ హౌజ్ లో నీతో తిరిగే నీ బ్యాచ్ తో ఉండి… అందులో ఏమీ లేదని, నేను చెప్పిందంతా ఒట్టి అపోహలేనని నిరూపించు..

అప్పుడు నేను కూడా వీళ్ళందరి ముందు అదంతా తప్పని ఒప్పుకుని, నిన్ను ఇక్కడే, ఇదే ప్లేస్ లో క్షమాపణలు అడుగుతా… దాంతో పాటు ఫేర్వెల్ ఈవెంట్ ఆర్గనైజ్ చేసే అవకాశం కూడా నీకే వదిలేస్తా… దాంట్లో నేనేమాత్రం కలుగజేసుకొను. ఈ వారంలో రోజుల్లో మీ బ్యాచ్ నుండి ఆ గెస్ట్ హౌజ్ నుండి ఏ ఒక్కరూ భయంతో బయటకి వచ్చినా… నువ్వు ఓడిపొయినట్టే లెక్క!

అలా నువ్వు ఓడిపోతే మాత్రం, ఈవెంట్ వదిలేయడం తో పాటు, వీళ్ళందరి సమక్షంలో నువ్వు నన్నిలా కించపరిచిన దానికి నాకు క్షమాపణలు చెప్పాలి. మరి నా ఈ ఛాలెంజ్ నీ యాక్సెప్ట్ చేస్తావా..?”

అంటూ విక్కి పార్ధు కి సవాలు విసురుతాడు… పార్ధు మాత్రం తన స్నేహితుల వంక, చుట్టూ ఉన్న స్టూడెంట్స్ వంకా చూస్తాడు. అందరి మొహాల్లో ఆ ఛాలెంజ్ ని ఆక్సెప్ట్ చెయ్యొద్దని భావం కనపడుతుంది. కానీ, పార్ధు మనసు మాత్రం వేరొకటి తలుస్తుంది.

ఇప్పుడీ ఛాలెంజ్ తీసుకోకపోతే అందరి దృష్టిలో తను ఓడిపొయినట్టే మాత్రమే కాదు, వాళ్ళల్లో దైర్యం నింపడంలో కూడా విఫలమైనట్టు భావిస్తాడు పార్ధు. అది వీళ్ళ గుడ్డి నమ్మకాలకు ఆయువు పోసినట్టే. అందుకే, ఎలాగైనా వీళ్లకున్న ఈ మూఢనమ్మకాలను పోగొట్టలనే ఉద్దేశ్యంతో విక్కి ఛాలెంజ్ ని అక్సెప్ట్ చేస్తాడు పార్ధు.

ఆ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసిన పార్ధు అండ్ అతని స్నేహితులు ఆ గెస్ట్ హౌస్ లో దెయ్యాలు భూతాలు లేవని నిరుపించగలిగారా?

లేక విక్కి చెప్పినట్టు గానే అక్కడ వాటికి భయపడి మధ్యలోనే వచ్చేసారా?

అసలు ఆ గెస్ట్ హౌజ్ లో వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కున్నారు?

మంకుపట్టుదలతో ఉన్న పార్ధు కి అతని స్నేహితులు సహకరించారా?”

తర్వాత పార్ట్ “యోధ (ఓ ఆత్మ ఘోష) – 2” లో చూద్దాం ఏం జరగబోతుందో?

– భరద్వాజ్

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *