యుద్ధం మాకు కొత్తేమీ కాదు

యుద్ధం మాకు కొత్తేమీ కాదు

యుద్ధం మాకు కొత్తేమీ కాదు

ఇప్పుడు జరిగే వైమానిక యుద్ధాలు
మాకు కొత్తవి కావచ్చు
మా తాతలు,ముత్తాతలు
చెప్పిన కథలు, చేసిన యుద్ధాలు
మా మస్తిష్కంలో ఇంకా భద్రంగానే ఉన్నాయి

మీరు చేసిన అన్యాయాల, అక్రమాల
తడి ఆరనేలేదు
నివురు కప్పిన నిప్పులా
మాకు తెలిసిన యుద్ధాన్ని దాచుకొని
మా హక్కుల కోసం
అందరి సహజ సంపద కోసం
రాజ్యాంగ బద్దంగా పోరాటం చేయడమే
మా నేరం అయితే
యుద్ధం మాకు కొత్తేమీ కాదు

మీరు న్యాయ వ్యవస్థని కొనుక్కున్నా
మా మీద అత్యాచారాలు జరిగినా
కోర్టు తీర్పులు మాకు వ్యతిరేకంగా వచ్చినా
సహించాం… సహిస్తున్నాం
భరించాం.. భరిస్తున్నాం

కానీ
ఇప్పుడు నీ పాడు కండ్లు
మా జాతుల మీద
అడవి తల్లి మీద పడుతుంటే
సహించడానికి…భరించడానికి
మేము సిద్ధంగా లేము

ఇది వైమానిక యుద్ధమా
రాజకీయ యుద్ధమా
ఇది ఏ యుద్ధమైనా కావచ్చు
మీ బాంబులకు
తుపాకీ గుండ్లకు
భయపడేవారు ఎవరూ లేరు
ఎందుకంటే
యుద్ధం మాకు కొత్తేమీ కాదు

ఓ ప్రజాస్వామ్య దేశమా!
ఎర్రని నెత్తుటితో ఈ భూమిని అలికి
అడవి తల్లి ఒడిని కాపాడానీకి
ఎప్పుడు మేము సిద్ధమే
నెత్తురు కక్కుతూ నేల రాలుతున్న
మా అన్నలు,మా అక్కలే స్ఫూర్తి
చావు ఒడిలో చేరే వరకు మా గుండెలో
రగిలే ఏకైక నినాదం పోరాటం
తరాల వారిగా ఇదే మా జీవన ప్రమాణం!

 

-విశ్వనరుడు

నిద్రలేమి Previous post నిద్రలేమి
మౌనపు అంగీకారాలతో Next post మౌనపు అంగీకారాలతో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close