అక్షరలిపి కవి కళా పీఠం
సాహితీ కవితలు
పేరు : కాకర్ల రమణయ్య
ఊరు : గుడిపాటిపల్లి
తేదీ: 23 -07-2025
చరవాణి : 9989134834
అంశం : చిత్రకవిత
శీర్షిక : పుస్తక మకరందం
కవిత:23
ఆలోచనలు అక్షరాలై
విహంగాల రెక్కలై
విహరిస్తాయి..
పుస్తకాలు పేజీలై
విజ్ఞాన భాండాగారాలై
నిశిరాత్రి చీకటిలో
వెలుగుపూలు పూస్తాయి..
ఆకాశంలో తేలియాడే
విజ్ఞానపు సుగంధాలు
అక్షరాలుగా మొలకెత్తి
అభ్యుదయాలుగా పుష్పించి
విస్తారంగా విస్తరిస్తాయి.
మోహోన్నత మానవత్వపు
మూర్తులు అక్కడ అక్షరాలతో
ఆడుకుని అనుభవాల
పటిష్టమైన మేడలు కడతారు..
ఆ మేడలో ప్రవేశిస్తే
పచ్చి గాయాల వాసన
గుప్పున సోకుతుంది..
అవమానాల భారంతో
గరుకు తేలిన హృదయపు
స్పర్శ గట్టిగా తగులుతుంది.
పారాణి ఆరని నవవధువు
కన్నీళ్ల కథలు ఉంటాయి..
అత్త ఆరళ్లు,అడపచుల
మాటల తూటాలు
గుదిగుచ్చి ఉంటాయి..
మేధావుల మేధోసంపద
నిక్షిప్తమై ఉంటుంది.
సకల చరిత్రలను గుది
గుచ్చిన దొంతరలే పుస్తకాలు
అమూల్య సంపదకు
వారసులమే మనం
రక్షణ కవచాలమై
భావి పౌరులకు
వారసత్వ సంపదను
సగౌరవంగా అందిద్దాము..
హామీ పత్రం : ఇది నా స్వీయ రచన అని హామీ
అక్షరలిపి కవి కళా పీఠం
సాహితీ కవితలు
పేరు : కాకర్ల రమణయ్య
ఊరు : గుడిపాటిపల్లి
తేదీ: 18 -07-2025
చరవాణి : 9989134834
అంశం : మైనర్ కిల్లర్
శీర్షిక : సోషల్ మీడియా మత్తు
కవిత:22
పూచే పువ్వు
కాచే కాయ
విరిసే హరివిల్లు
ధారగా కారే వాన చినుకు
మంచు పైట కప్పుకున్న
ప్రకృతి కన్య
హృదయ కలల ప్రపంచంలో
పుష్పక విమానాలు ..
రంగవల్లులు,
స్వేచ్ఛగా ఎగిరే
సీతాకోక చిలుకలు
పట్టు పరికిణీలు
మూతి విరుపులు
చెలుల ముచ్చట్లు
బుడ్డీల ఆటలు
ఎర్రగా పండిన గోరింట
కాటుకతో కలబడిన కళ్ళు
నాగుపాములాంటి రెండు జడలు
అందులో తురుమిన మల్లెలు..
మితృరాళ్ల పలకరింపుల పదనిసలో
తుళ్ళింతల ఉత్సాహలతో
నడవాలిసిన చిరు ప్రాయం.
కొత్త పుస్తకాల సువాసనలు
సైన్సు టీచర్ చెప్పే
యౌవ్వనం లోని మార్పులు
లేసిగ్గుతొ వినాల్సిన
పదిహేనేళ్ల పడుచు ప్రాయంలో
సంఘటనల అనుభవాలను
అనుభూతుల పరిమళాన్ని
మూట కట్టుకుని ముందు జీవితానికి
దాచుకోవాలిసిన వయసులో..
అర్ధం లేని ఆకర్షణల వలలో చిక్కుకుని
సోషల్ మీడియా చితిమంటలో శలభంలా
చితికి పోయిన వనితా..
నవమాసాలు మోసి
ముద్దుల పందిర్లు వేసి
ప్రేమాభి మానాల పొదరిల్లులో
ఆత్మీయలతలను పెనవేసుకున్న
అనుబంధాలకు ఏది నీ సమాధానం..?
అమ్మ ప్రేమకు ఏది నీ కొలమానం..?
ప్రాణాలు తీయడమేనా
నీ బహుమానం..?
ఏమై పోతుంది ఈ లోకం..?
మృత్యు కళేబరాలను
రాబందులు ప్రేమగా సృజిస్తాయేమో..!
కరడు గట్టిన తీవ్రవాదిలో
మానవత్వం మొలకెత్త వచ్చేమో..
మనుషులే సోషల్ మీడియా ఊబిలో
చిక్కుకుని మనిషి తనాన్ని హత్య చేసి
మానవత్వాన్ని సమాధి చేస్తున్నారు..!
నా దేశాన్ని రక్షించే నాదుడేవరు..?
హామీ పత్రం : ఇది నా స్వీయ రచన అని హామీ
అక్షరలిపి కవి కళా పీఠం
సాహితీ కవితలు
పేరు : కాకర్ల రమణయ్య
ఊరు : గుడిపాటిపల్లి
తేదీ: 09 -07-2025
చరవాణి : 9989134834
అంశం : చిత్ర కవిత
శీర్షిక : జీవన చిత్రం
కవిత:21
నవ్వుల మోము వెనుక ఇంటి చూరుకు వేలాడుతున్న విషాదాలెన్నో..
విచ్చుకున్న కనులలో
కనిపించని కన్నీటి జాడలెన్నో
ముక్కును ముద్దిడిన
ఎరుపు రంగులో
నలుపు రంగు చీకటిలెన్నో..
హృదయంలో ఉప్పొంగే భావాలను
లావాలా పెల్లుబికే ఆలోచనలు ఇనుపపాదంతో తొక్కి పెట్టి బ్రతుకు చిరుగులను గుర్తు చేసే చిత్రాలెన్నో
ప్రేక్షకుల నవ్వులలో జీవితాన్ని ఏరుకునే పేకలో జోకర్
మొహానికి వేసుకున్న రంగులల్లో
లోకం తీరును కాంచే మేకర్
నాటక రంగంలో సాటిలేని మేటి
బ్రతుకు సమరంలో నిస్సహాయ మావటి...
నవ్వుల పువ్వులు పూయించిన
రోజే నాలుగు వ్రేళ్ళు నోటినిముద్దాడుతాయి..
రంగు వంటిని తాకిన రోజే
ఏక్ దిన్ కా సుల్తాన్ ..
అర్ధ ఆకలుల అరణ్య రోదనలెన్నో
ఒంటికి గుడ్డకు అవస్థలెన్నో
పిల్లల చదువుల ప్రాణాళికలెన్నో
వెక్కిరిస్తాయి సమస్యలెన్నో
ఆత్మస్థైర్యంతో సాగిపోవాలి
పొదుపు మంత్రంతో నెగ్గుకు రావాలి...
హామీ పత్రం : ఇది నా స్వీయ రచన అని హామీ
అక్షరలిపి కవి కళా పీఠం
సాహితీ కవితలు
పేరు : కాకర్ల రమణయ్య
ఊరు : గుడిపాటిపల్లి
తేదీ: 03 -07-2025
చరవాణి : 9989134834
అంశం : చిత్ర కథ
శీర్షిక : సరదా బుల్లోడు
కథ : 1
చాలా సంతోషంగా ఉన్నాడు పరశురామయ్య.
అతని మొహం లో వింత కాంతి కనిపిస్తుంది.
70 ఏళ్ల వయసులో తన కోరిక నెరవేరపోతున్నందుకు ఊహాలోకంలో తేలిపోతున్నాడు.
కుర్రాడికిమల్లె బ్రేక్ డాన్స్ చేయలనిపించింది. కానీ ఏదయినా జరగరానిది జరిగితే మంచం లో ఉండలిసి వస్తుందని వివేకం హెచ్చరించడంతో తగ్గాడు.
చనిపోయేంత వరకు తన కోరిక నెరవేరద
ని ఈ జన్మకు ఇంతేనని మనసును సరిపెట్టుకున్నాడు .
తన మనసులో ఉన్న కోరికని అదిమి పెట్టుకుని రోజులు కాదు సంవత్సరాలే గడిపిన విషయం జ్ఞాపకం వచ్చి అతని మనసు తడిబారింది.
ఇప్పటికైనా తీరుతున్నందుకు మనసు గాల్లో తెలియాడుతుంది.
భార్యను ఒప్పించడానికి తలప్రాణం తోకకు వచ్చింది.
"మీకెమి అయింది.?.కాటికి కాళ్ళు చాపుకున్న ఈ వయసులో ఇదేమి కోరిక.?" అని తన చప్పిడి బుగ్గలు నొక్కుకుంది.
తన ప్రాణం పోయేలోపు ఆ కోరిక తీర్చు కోవాలని పట్టు పట్టాడు పరశురామయ్య..
బ్రతిమి లాడగా ,బ్రతిమి లాడగా చివరకు సిగ్గు పడుతూనే ఒప్పుకుంది సావిత్రమ్మ.
సావిత్రమ్మను ఒప్పించడానికి నెల పైన పట్టింది.
&&&&
సంప్రదాయ కుటుంభంలో జన్మించాడు పరశురామయ్య. ఎనిమిదిమంది సంతానంలో నాలుగవ సంతానం ఆయన.
ఉమ్మడి కుటుంభంలో సంవత్సరాలు గడిచిపోయాయి.
పిల్లలకి పెళ్లిళ్ల నాటికి ఉమ్మడి కుటుంబమే ఉన్నది. పిల్లల పెళ్ళిళ్ళు అయ్యాక బాగపంపకాలు చేసుకుని విడిపోయారు.
పాత ఇంటికి దగ్గర్లో స్థలం కొని మంచి ఇల్లు కట్టుకున్నాడు. ప్రభుత్వ రంగంలో గజిటెడ్ హోదాలో పదవీ విరమణ చేసాడు.
అన్నీ బాగున్నాయి కానీ ఆ కోరిక మనసులో చీమల పుట్టలా పెరిగి పోతూనే ఉన్నది.
మొన్నటివరకు ఉమ్మడి కుటుంభం. ఇప్పుడేమో కొడుకు కోడలు వారి పిల్లలు ఇంటినిండా ఉన్నారు.
కనీసం భార్యకు కూడా చెప్పలేదు. ఇంట్లో సోదరులతో చెప్తే ఎగతాళి చేస్తారని ఎప్పుడూ బయట పడలేదు.
అలా అలా సంవత్సరాలు గడిచి పోయాయి.
కోరిక రోజు రోజుకు పెరిగి పోతుందే గాని తగ్గలేదు. తీరే అవకాశం కనిపించలేదు.
అందుకే మనసు పొరలలో అణచివేతకు గురిచేశాడు.
కుమారుడికి ఉన్న గ్రామం నుంచి దూరంగా బదిలీ కావడంతో , ఇంట్లో సావిత్రమ్మ ,పరశు రామయ్య మిగిలి పోయారు.
సరిగ్గా అప్పటినుంచి అణచి పెట్టుకున్న కోరిక త్రాచు పాములా బుసకొట్టింది.
ఒకరోజు సాహసం చేసి సావిత్రమ్మకు చెప్పాడు.
సావిత్రమ్మ ఆశ్చర్యంగా వింటూ ఉండి పోయింది.
విస్మయం చెందింది. సిగ్గుపడిపోయింది. "ఈ వయసులో ఇదేమి పాడు బుద్ధి "అని విస్తుపోయింది.
నోట మాట రాక మౌనం గా ఉండి పోయింది.
@@@
"ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే,.." పాట అక్కడ హోమ్ దియేటర్ లోంచి పెద్ద గా వినిపిస్తుంది. పాటకు తగ్గట్టు పరశురామయ్య ,సావిత్రమ్మ హుషారుగా స్టెప్ళులు కలుపు తున్నారు.
పరశురామయ్య జీన్స్ ప్యాంట్ పై షర్ట్ టక్ చేశాడు.ఆయనకు ఆ సందర్భములో తన వయసు పదహారు లాగానే అనిపిస్తుంది.జోరుగా హుషారుగా డాన్స్ చేస్తున్నాడు.
సావిత్రమ్మ పొట్టి గౌన్ వేసుకుని గ్లాస్ లో శీతల పానీయం తాగుతూ మత్తుపానియాలు తాగుతున్న భావనతో భర్తతో కలిసి డాన్స్ చేస్తుంది.
పరశురామయ్య..భార్య ఒప్పుకోవడంతో అన్ని ఏర్పాట్లు చక చక చేసాడు.తాను దేని కోసమైతే తపించాడో దాన్ని తీర్చుకోవడానికి సర్వం సిద్ధం చేసాడు. బయటకు వెళ్లడం ఇబ్బంది అని అన్ని ఇంట్లోనే ఏర్పాటు చేశాడు.
సనాతన కుటుంభం లో పుట్టడం వలన పంచ కట్టుడు అలవాటు అయింది పరశురామయ్యకు . చిన్నప్పుడు తన తోటి పిల్లలను చూసి "ప్యాంట్ వేసుకుంటాను" అని తండ్రితో అంటే పెద్ద రచ్ఛే చేశారు ఆయన.దాంతో ప్యాంట్ గురించి అడగడానికి
ఎప్పుడూ సహసించలేదు.
అలా ఉద్యొగ జీవితం మొత్తం పంచతోనే చేసాడు.
తాను ప్యాంట్ వేసుకోవాలని,జీన్స్ అయితే బాగుంటుందని ఎప్పటి నుంచో కోర్కె దహించుకు పోతూ వచ్చింది.
అలాగే సావిత్రమ్మని మోడ్రన్ డ్రెస్ లో చూడాలనే కోర్కె బలపడింది.
ఇంత కాలం ఉమ్మడి కుటుంభంలో ఉండడం, ఆ తర్వాత పిల్లలు వారి పిల్లలు
వారి ముందు వేసుకోవడానికి సిగ్గుగా అనిపించింది. మొహమాటంతో మాట్లాడలేక పోయాడు.
సిగ్గు పడుతూనే సావిత్రమ్మ గౌన్ వేసుకుని
భర్త కోరికను తీర్చింది.
తన కోర్కె తీరినందుకు పరశురామయ్య ఉబ్బి తబ్బిబ్బై పోతున్నాడు.
అలా అలా అలసట వచ్చేంత వరకు ఆడుతూనే ఉన్నారు..
సమాప్తం
హామీ పత్రం : ఇది నా స్వీయ రచన అని హామీ