* నువ్వు కళ్ళు తెరువొద్దు *

రాత్రులన్నీ రాక్షసత్వాన్ని
ఒంటి మీద చల్లుతున్నవి
భరతమాతా నువ్వు కళ్ళు తెరువకు
ఈ భారతదేశంలో మనుషులు చచ్చిపోయి
మర్మాంగాలు నిలబడుతున్నవి.

ఇక్కడ మనుషులకంటే లేచి నిలబడిన మర్మాంగాలు మాత్రమే బ్రతుకుతున్నాయ్!
నువ్వెందుకు కళ్ళుతెరువలేకపోతున్నావో...
నువ్వెంత అవస్ధపడుతున్నావో...
ఇప్పుడర్ధమైంది!
స్వతంత్రం దేశానికి మాత్రమే ఒచ్చింది
నీకు మాకు కాదు!

నడివీధిలో అమ్మతనం
మర్మాంగాలలో చచ్చిపోతోంది!
న్యాయానికే కళ్ళుపోయినపుడు
స్వతంత్రం ఒచ్చిన భారతదేశం
నీ రొమ్ముల్లో చిక్కుకొని
ఎప్పుడో చచ్చిపోయింది!

ఈ కామాంధుల లోకం
కళ్ళ నిండా కామాల బీజాలు
మొలిపించ్చుకుంటున్నారు!
అమ్మ లక్ష్మి , పార్వతి
మిమల్ని నెత్తిమీదుంచుకొని
గుండెల్లో దాచుకున్న
మీ మగాళ్లను అడగండమ్మా
ఇక్కడ ఆడపిల్లలు ఎంత అవస్థపడుతున్నారో?

ఇక్కడ వీధులన్నీ...
సెక్స్ పరిమళాలే వెదజల్లుతున్నాయి!
మగాళ్ల చూపులన్నీ...
వయసుకు తేడాలేని
ఆడపిల్లల చున్నీల్లో చిక్కుకుంటున్నవి!

ఇక్కడ మగాళ్ల కళ్ళల్లో
మర్మాంగాలు మొలుస్తున్నాయ్!
నువ్వు అవస్థపడుతున్న
ఆ చూపులన్నీ నడిరోడ్డులో
మానభంగానికి గురవుతున్నాయి!

ఆడది ఎప్పుడైతే అర్ధరాత్రి బయిటికొస్తుందో... అప్పుడే స్వతంత్రం వస్తుందని చెప్పిన
మహానుభావుడి మాటలు నమ్మి
బయటికొస్తే ప్రాణాలు పోగొట్టుకుంటామని
ఆ పెద్దమనిషికి తెలియదేమో..?
అమ్మ నువ్వు ఎవరి మాటలునమ్మి
బయిటికి రావొద్దమ్మా...
ఇక్కడ మానవత్వం
శవాలు కాలిన వాసనలై గుప్పుమంటోంది!

ఇక్కడ హత్యలు చేయబడతాయి
పెట్రోలు , యాసిడ్ దాడులు జరుగుతాయి
మానభంగాలకు కొదువేలేదు
ఇవన్నీ జరిగిన అధికారాలన్నీ
నీ శీలానికి అమ్ముడుపోయనుకో...
అమ్మ ఎట్టి పరిస్థితిలో
"నువ్వు కళ్ళు తెరువొద్దు".!!
..*✍️ గంధం గురువర్ధన్ రెడ్డి*