ఎడారియే పూదోటని నమ్మలేము ఎన్నటికీ
బజారులో అంతరాత్మ అమ్మలేము ఎన్నటికీ
మంటనైన ముట్టుకునే పసిపాపల ధైర్యాన్నీ
బుద్దొచ్చిన పెద్దల్లో వెదకలేము ఎన్నటికీ
సంకెళ్ళే స్వాతంత్ర్యం తలుపు తీయ వచ్చూ
వలలువేసి వాగుగొంతు నులమలేము ఎన్నటికీ
ఆగ్రహం ఆవేదన అదుపులేని పదమైతే
ముక్కలైన వాక్యాన్ని అతకలేము ఎన్నటికి
కత్తి పదును తెగిన తలల లెక్కకేమి తెలుస్తుందీ
ప్రశ్నించే మెడల తెగువ కొలవలేము ఎన్నటికీ
జ్ఞాపకాల చిరుగాలై సౌందర్యం వీస్తుంటే
గుండెల్లో తుఫానులను ఆపలేము ఎన్నటికీ
పరిమళాల చిరుస్పర్శలు అలవోకగ వాలితే
అలుముకునే దియ రూపం చెరపలేము ఎన్నటికీ..
*✍️ గంధం గురువర్ధన్ రెడ్డి*