*సృష్టి రహస్యం*
మూడు రోజుల్లో ముల్లోకాలు కనపడతాయి
కనిపించని హార్మోన్లు సతమతమవుతాయి
లోపల పేగులన్నీ చుట్టుకుని
రక్తమంతా ముక్కలవుతుంటే
పసిపాప అమ్మా అంటూ పొట్ట చేతపట్టి
మెలికలు తిరుగుతుంటే
వరమనుకోవాలో శాపమనుకోవాలో
తెలియని జీవితాలు మావి
విధించిన సుంకాలకు
రక్తపుటేరులై ప్రవహిస్తున్న
ఆత్మాభిమానానికి
ఏ అడ్డుకట్ట వేస్తారు..?
సృష్టి రహస్యాన్ని ఏ రికార్డుల్లో
పొందు పరుస్తారు..?
మగువ సురక్షిత జీవితానికెప్పుడు
నాంది పలుకుతారు..?
నిన్నటి పొద్దులో కుంగిన సూర్యుడు
నేటి దినకరుడు కాడా..?
పొగిలి పొగిలి ఏడ్చినా తీరని ఆవేదన మాది
రుతురాగాలకు జతకలిసే తొలిపొద్దులం
గమ్యమెరుగని నిరంతర శ్రామికులం
ఇన్నాళ్ళు హక్కులన్నీ కొల్లగొట్టి
మూలన కూర్చోబెట్టింది చాలు
మాసంలో మూడు రోజులు
సెలవు దినాలు లేని మమ్ము
ప్రకటనల పేర బూతు బొమ్మను చేశారెప్పుడో
బాత్రూముల్లో ప్రవహించే రక్తపుటేరులను
చూడగలిగే దమ్ముందా...!?
సృష్టి రహస్యమే దాగుంది అందులో
వ్యాపార ప్రకటనలకు వాడుకుంది చాలిక..!
సృష్టి రహస్యానికి రేటు కట్టి
గర్భకోశాలకు చిల్లులు పెట్టకండి
చరిత్ర హీనులుగా మిగిలిపోకండి...
*✍️ గంధం గురువర్ధన్ రెడ్డి