*కన్నీటి చినుకు*

మనసులోని ఆవేదన
విశ్వమంత విస్తరించినా
కన్నీటి బొట్టుగా రాలిపడితేనే
గుండె బరువు తగ్గేది!
ఒక్కో బొట్టూ
వెచ్చని అడుగులేస్తూ
ఓదార్పు తీరం చేరి
మౌనంగా ఇంకిపోవును!
మౌనం మొలకెత్తుతుంటే
శూన్యపుతీగలు
దేహమంతా అల్లుకుపోతాయి!
జీవితం చీకటిఖైదీ కాకముందే
వెలుతురుహస్తం తోడై
స్వేచ్ఛాగీతిక పలికించాలి!

గులాబికేం తెలుసు
గుచ్చుకునే ముల్లు బాధ,
ముల్లుకేం తెలుసు
వాడిపోయే గులాబీ బాధ!
అందమైనవన్నీ తాత్కాలికమే
పొందలేనివన్నీ విషాదమే!
వికసించేది ఒక్కరోజైనా
పరిమళం జీవితాంతం,
కుమిలిపోయేది క్షణమైనా
అంతమయ్యేది జీవనం!
చినుకులుగా రాలే కన్నీళ్ళు
సముద్రమంత లోతును చూపిస్తాయి!
మిణుగురులుగా వెలిగే ఆనందాలు
వెన్నెలలాంటి జీవితాన్ని చూపిస్తాయి!
*✍️ గంధం గురువర్ధన్ రెడ్డి*