అక్షర లిపి
అంశం : చిత్రానికి కథ
తేదీ : 3/7/25
శీర్షిక : అనుభవించు రాజా
రచన: విత్తనాల విజయకుమార్
హైదరాబాద్
ఈ రచన నా సొంత రచనని హామీ ఇస్తున్నాను.
•••••••••••••••
అనుభవించు రాజా
"ఏమిటి డార్లింగ్! ఎలాగుండే దానివి? ఇలా తయారయ్యావ్! అసలు నిన్ను విడిచి వెళ్లడం నాదే తప్పు." అన్నాడు జాన్ తన భార్య సారాతో.
"నో జాన్. అలా అనకు. నేను పంపితేనే కదా నువ్వు వెళ్ళావ్! ఇందులో నీ తప్పేముంది. నో వర్రీస్. కమాన్ చీర్ అప్." అంది సారా గ్లాసు అందిస్తూ.
జాన్ సారాలది చాలా అన్యోన్యమైన దాంపత్యం. జాన్ కు 85 ఏళ్లు. సారాకు 83 ఏళ్లు. జాన్ సంపాదించిన ఆస్తి చాలా ఎక్కువగానే ఉంది. పిల్లలు విదేశాల్లో స్థిరపడ్డారు. స్వదేశానికి రమ్మని ఎంత కోరినా రావడం లేదు. అప్పుడప్పుడూ వీడియో కాల్ చేస్తుంటుంటారు. అక్కడినుండి ఇక్కడకు వచ్చి చూడటం లేదు. ఈ దంపతులు కూడా వాళ్లను ఇక్కడకు రమ్మని అడిగి అడిగి విసుగెత్తిపోయారు.
అందుకే భార్య భర్తలు ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారు. వాళ్లకున్న ఆస్తులను ఒక్కొక్కటిగా అమ్మేస్తున్నారు. పిల్లల కోసం ఉంచవలసిన అవసరం లేదనే నిర్ణయానికి వచ్చారు.
ఒక సైట్ ను అమ్మే పనిమీద జాన్ ఊరెళ్ళి డబ్బులతో తిరిగివచ్చాడు. సారాను ఈ వయసులో ఇబ్బంది పెట్టకూడదని తీసుకొని వెళ్లలేదు.
డబ్బు మొత్తం బ్యాంకులో వేశాడు జాన్. ఈ వ్యవహారం చూసి వచ్చేలోపు భార్య సారా బెంగపెట్టుకుంది.
అందుకే భార్యను ఓదార్చి ఆమెతో సరదాగా గడపాలని నిర్ణయించుకున్నాడు.
వాళ్లకు ఆనందంగా ఉండటానికి కావలసినవన్నీ కొన్నాడు. వాళ్లకు అన్ని పనులను చేసి పెట్టే ఖరీదైన పనిమనిషి ఉన్నది.
బతికినంత కాలం ఆనందంగా ఎవరికీ ఇబ్బంది కలగచేయకుండా బతకాలని వాళ్లు నిర్ణయించుకున్నారు.
భార్య భర్తలు ఇద్దరికీ సంగీతం అన్నా డాన్స్ అన్నా చాలా ఇష్టం. ఆ సమయంలో కొద్ది పాటి మద్యాన్ని కూడా ఒకరికొకరు చీర్స్ చెప్పుకుని సేవిస్తుంటుంటారు.
"సారా డార్లింగ్ మనం బ్రతికినంత కాలం ఈ డబ్బు సరిపోతుంది. నేను ముందు పోయినా నువ్వు బాధపడకు. సంతోషంగా ఉండు. ఖర్చు పెట్టుకున్నంత ఖర్చు పెట్టుకుని మిగిలింది నీకు ఇష్టం వచ్చిన వారికి ఇచ్చేయ్." అన్నాడు ఆమె నడుం చుట్టూ చేతులేస్తూ.
"అలాగే డార్లింగ్. నేను పోయినా నువ్వు కూడా అలాగే ఉండాలి. నా లెవెల్లో డాన్స్ చేసే అమ్మాయి దొరకకపోయినా, బాధపడకు. దొరికిన అమ్మాయితో ఆనందంగా డాన్స్ చేసుకో." అన్నది సారా నవ్వుతూ.
కథ సమాప్తం
