అనుభవాల సారం

లతలు లతలుగా పెనవేసుకుపోయే బంధాలు
ప్రాణం పోసుకుని నర్తనమాడే శిల్పాలు
హృదయ లయల్లో ఏదో తెలియని సృజన స్వరూపం
జీవితం సంధ్యాకాంతుల సహజ స్వరూపం
చెలియ కన్నుల్లో వింత వింత వెలుగుల ఆలంబణలు
జీవితంలో అన్నీ ఉన్నా ఏదో తెలియని వెలితి
పదగతులు సుస్వరాలై గంధర్వ గానం మేల్కొలుపు
ఎటు చూసినా ఆనందాల హరివిల్లు సోయగాలు
వికసించిన పూవుల సుగంధాలు హృదయం నిండా
జనజీవనంలో మమేకం కాకున్నా మూర్తీభవించిన వ్యక్తిత్వం
సాఫీగా సాగిపోతున్న సంసారంలో అకస్మాత్తుగా ఏదో అలజడి
అయినా సర్దుకుపోయే నైజం జీవితం నేర్పిన గుణపాఠం
ఎన్నెన్ని ఇబ్బందులు ఉన్నా గుండెల్లో దాచుకుని మార్గదర్శనం చేసుకుంటూ వెళ్ళడమే
మనస్సు లోయల్లో ఎన్ని గాయాలు ఉన్నా సౌందర్య శిఖరాలు దర్శించడమే
చెలిమికి చెలియ లేకున్నా బాధ దిగమింగుకుని హృదయంలో ఆనందం పోసుకోవడమే
విధాత జీవితం ఎలా ఇచ్చినా మనకనుగుణంగా మలచుకోవడమే
జన జీవనంలో వాస్తవం తెలుసుకుని సాగిపోవడమే
పరిస్థితులను అర్థం చేసుకుని సాఫీగా జీవితం కొనసాగించడమే
నిన్ను నిన్నుగా చూడలేని లోకం ఎన్నటికీ మారదు నీవే మారాలి
ధనం ఉన్నా లేకున్నా పొదుపుగా కుదురుగా జీవనం సాగించడమే
నీకున్నంతలో జీవితం వెళ్ళతీసుకో ఏదో తెలియని వెలితి అనవసరం
సమాజంలో రాజీపడి జీవించాలి తప్ప దిగులుపడకు
మనమేం స్వర్గం నుంచి ఊడిపడలే జీవితం స్వర్గతుల్యం కావడానికి
ఓటములెన్ని చవిచూసినా తోసుకుంటూ సాగడమే
అలవోకగా రక్తసిక్త గాయాలకు కుట్లేసుకోవాలి తప్ప రోధిస్తే ఏమొస్తుంది
ఎవరికి ఎవరూ సహాయం చేయరు నీకు నీవే చేసుకో
లిఖించిన అక్షరాలు ఏరుకోవడానికి ఎంత కష్టపడ్డావో గుర్తుందా
నీకోసం నీవు జీవిస్తున్నావు తప్ప ఎవరికోసం కాదు
నిత్యం గతం జ్ఞాపకాలను తోడుకునే బదులు పనుల్లో మునిగిపో
జీవించు స్పందించేది జనంలో నీ ఉనికి కోసమే మరువకు

అపరాజిత్
సూర్యాపేట