*తెలంగాణ ఇంజనీర్ల దినోత్సవం*
తెలంగాణ ఇంజనీర్ల దినోత్సవం ప్రతి సంవత్సరం జూలై 11న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. హైదరాబాదుకు చెందిన ఇంజనీరు అలీ నవాజ్ జంగ్ బహదూర్ జన్మదినమైన జూలై 11ను తెలంగాణ ప్రభుత్వం 2014లో తెలంగాణ ఇంజనీర్ల దినోత్సవంగా ప్రకటించి, ఆయన జయంత్యుత్సవాలను ఎర్రమంజిల్‌లోని జలసౌధలో ఘనంగా జరిపింది.
నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ హైదరాబాదుకు చెందిన ఇంజనీరు. ఈయన 1877, జూలై 11న హైదరాబాదులోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తెలంగాణ నీటిపారుదల పితామహుడిగానూ, తెలంగాణ ఆర్థర్ కాటన్‌గా అభివర్ణించబడిన నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్, అప్పటి హైదరాబాద్ రాజ్యంలో అనేక నీటిపారుదల ప్రాజెక్టులకు రూపకల్పన చేసి, నిర్మించాడు.
ప్రభుత్వాలపై భారం పడకుండా దీర్ఘకాలం రైతులకు ప్రజలకు ఉపయోగకరంగా తక్కువ ఖర్చు, నాణ్యతతో కూడిన సాగునీటి ప్రాజెక్టులు నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ నిర్మించాడు. తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ గౌరవార్థం తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా 2014, జూలై 10న జి.ఓ. నంబరు 18 జారీచేసి అలీ నవాజ్ జంగ్ బహాదూర్ ఆయన జన్మదినాన్ని తెలంగాణ ఇంజనీర్ల దినోత్సవంగా ప్రకటించి ప్రతి సంవత్సరం అధికారికంగా ఈ దినోత్సవాన్ని నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ దినోత్సవం సందర్భంగా వివిధ శాఖల్లో విశిష్ట సేవలు అందించిన విశ్రాంత ఇంజనీర్లకు 2015 నుండి నవాజ్ జంగ్ స్మారక జీవిత సాఫల్య పురస్కారాలను అందజేస్తున్నారు. 2018లో ఖైరతాబాదులోని విశ్వేశ్వరయ్య భవన్లో ఇంజనీర్ల దినోత్సవం సందర్భంగా నలుగురు విశ్రాంత ఇంజనీర్లు ప్రభాకర్ (సాగునీటి రంగం), జంబుల్‌రెడ్డి (జలమండలి), గౌసుద్దీన్ (రహదారులు-భవనాల శాఖ), ఉమాకర్రావు (ఇంధన శాఖ) లకు మంత్రి కేటీఆర్ చేతులమీదుగా నవాజ్ జంగ్ స్మారక జీవిత సాఫల్య పురస్కారాలను అందజేశారు.
*మాధవి కాళ్ల*
*సేకరణ*
