ఆనందాల సంవేదనలు!

బంగారంతో పోతబోసిన చందం
ఏ గాయం లేని నీ కాయం!
నిలువెల్లా వలువలు కప్పుకున్న దేహం
మనసు కౌగిటిలో మునిగిన వెన్నెల సొగసులు
కన్నీరు పన్నీరై నిరాశల నుండి ఆశావాదంలోకి
ఆకాంక్షలు వెన్నెలలో పూసిన జాజిమల్లెలు!
దీనుల ఆర్తనాదాలు పగిలి పొగిలిన వీణానాదం
అరవిరిసిన బంగరు రంగుల కమలం కాంతులు
మనసును చంపే తీతువు పలికే నీతులు
వేగి వేగిన మంటల దేహం వెన్నెలలోసేదదీరిన చందం!
ముసుగు దొంగ మీదపడ్డట్లు వడగండ్ల వాన
తామరపూల చందం తనువెల్లా పూసిన పలవరింత
అర్ధనారీశ్వరుని నర్తనం ఓ వెండిపూల శోభ
ఇచ్ఛ ఈశ్వరుడై జీవితమంతా మధురిమల పూదోట
దొంగాటలాడే వెన్నదొంగకే చెల్లు మాయదారి మోసాలు
రోదించే మదిని పూల పరిమళాల వెలుగులు నింపాలి!
ఆకలిగొన్న అనాధునికి ఇవేవీ పట్టవు పట్టెడన్నం చాలు
కాయకస్టం చేసే రైతు మదిలో ఏపుగా ఎదిగిన చేలు
విసుగన్నది లేక రచనలు చేసే కవి హృదయంలా!
వేయి పున్నమల్లా వేణుగానం వీణుల విందు
నిరుద్యోగి కన్న కలలు కన్నీటి ఏరులై పారగా
చదువుల సరస్వతి తెల్లచీర పయిట
కొంగుపై లిఖించిన సిందూర అక్షర కణికలు
వెలుగుల బావుటాయైన సూరీడు!



-అపరాజిత్
సూర్యాపేట