తుపాకిగొట్టంతోనా సోదరభావం!
కొన్ని బ్రతుకుల్ని చిదిమేసి
ఉరికంబం ఎక్కేవాన్ని క్షమిస్తే
సమసమాజంలో దుష్టులకు కొమ్ముకాయడమే!
మానవ బాంబులతో ఉగ్రవాదం పెట్రేగుతుంటే
మానవ సంస్కృతి సంప్రదాయాలకు కుంపటి రాజేస్తూ
విదేశీ శక్తులు మనుషులను పురుగుల్లా నలిపేస్తుంటే
దేశీయ మిలటరీ బలగాలు సమర్థంగా ఎదుర్కొంటున్న
నూటాముప్పై కోట్ల భారతావనిలో ఎదో ఒక పట్టణంలో
అమాయకులు,మహిళలు ఉగ్రవాదంకు బలియవుతూ
ఈ నీచ నికృష్ట సంస్కృతిని పెంచి పోషించే దేశాలు
తమ దేశాల్లో పేదలకు కూడు గుడ్డ ఇళ్లు సమకూరిస్తే
సుసంపన్న దేశాలుగా ఎదుగుతాయన్నది తెలియనిదా!?
ఎంతసేపు ఉగ్రవాదుల చొరబాట్లు కాల్పులు చంపుకొవడాలు
చదువు సంధ్యల్లేని అభాగ్యులను బలి చేసే దేశాల మూర్ఖత్వం!
మతం మతం అంటూ మంటగలుపుతున్న మానవతా విలువలు
హిందూ ముస్లిం క్రైస్తవం ఎవరికి వారు ఆలోచించుకోండి
మనమంతా విశ్వమానవులం విజ్ఞత గలిగిన మనుషులం
మనుషులను మనుషులే చంపుకుంటే ఏ దేవుడు దీవిస్తాడో ఆలోచించండి!
ధుఖపు కోరల్లో కుటుంబాలకు కుటుంబాలు బలి అవడం తగదు
ప్రపంచ మానవుల సౌభ్రాతృత్వం వెలుగులు పంచాలి
ధనస్వామ్యము సామాన్య జనుల శ్రమతోనే ఎదిగిందని మరవద్దు!
-అపరాజిత్
సూర్యాపేట