చెప్పలేని మాటలు - కోటేశ్వరరావు

Comments · 185 Views

చెప్పలేని మాటలు - కోటేశ్వరరావు

చెప్పలేని మాటలు

ప్రియాతి ప్రియమైన 'సరళ కుమారి' గారికి

నేను చెప్పాలి అనుకున్న చెప్పలేని మాటలు, కనీసం కాగితం పైన అయినా సరే రాసి ఇవ్వాలి అనుకున్న విషయాలు, ఈ లేఖలో రాస్తున్నా.

అది 2010 వ సంవత్సరం మొదటిసారి మా ఊరిని వదిలి కాలేజీ చదువుల కోసం దూరంగా వెళ్లాల్సి వచ్చింది.కాలేజీలో చేరటం, బయటి బ్యాచిలర్ రూమ్ తీసుకోవడం, ఇలా అంత సిద్ధం అయిపోయా,

ఆరోజు మొదటిరోజు కాలేజీకి వెళ్లడం,అంతవరకు ఊర్లోనే చదవడం వల్ల నా స్నేహితులందరినీ వదిలేసి రావాల్సి వచ్చింది, ఇక్కడ ఒక్కరు కూడా పరిచయం లేదు.

భయం భయంగా లోపలికి వెళ్లి గ్రౌండ్ ఫ్లోర్ రిసెప్షన్లో నా తెలుగు మీడియం సెక్షన్ ఎక్కడ అని అడిగా, మూడవ అంతస్తు అని చెప్పారు, పైకి వెళ్లడానికి మెట్లు ఎక్కుతున్నప్పుడు మొట్టమొదటిసారిగా నిన్ను చూశా,ఈరోజుకి నాకు గుర్తుంది.

నీలిరంగు చుడిదార్ వేసుకుని తలలో కొన్నికనకాంబరాలు పెట్టుకుని పైకి వెళుతున్నావ్,నాకు ఉండే భయం వల్ల ముందుకు వచ్చి మొహం చూడలేక వెనకాల నడుచుకుంటూ వస్తూ,,, అరే ఈ అమ్మాయి మన సెక్షన్ అయితే బాగుండు అని మనసులో అనుకుంటూ నీ అడుగుల్లో అడుగులు వేసుకుంటూ వస్తున్నా.

మూడవ ఫ్లోర్ రాగానే మొత్తం నాలుగు రూములు ఉన్నాయి,నువ్వు అలా నడుచుకుంటూ ఇంగ్లీష్ మీడియం రూమ్ లోకి వెళ్ళిపోయావు, అప్పటికి ఇంకా నీ మొఖం కూడా నేను చూడలేదు, చేసేదేమీ లేక ఎదురుగా ఉండే నా తెలుగు మీడియం రూమ్ లోకి వెళ్ళిపోయా.

కానీ ఒకటే ఆలోచన ఎలా అయినా నిన్ను చూడాలి అని ఎదురుచూస్తున్నా,క్లాస్ రూమ్ లోకి ఒక సార్ వచ్చి పరిచయాలు మొదలుపెట్టారు, కానీ నా ఆలోచనలు అన్ని నీ చుట్టూనే తిరుగుతున్నాయి. కొంత సమయం తర్వాత విరామం గంట మ్రోగింది, చాలా ఆత్రుతగా బయటకు వచ్చి ఎదురు చూస్తున్నా ఎప్పుడు బయటకు వస్తావా అని,,

కొద్ది నిమిషాల్లో కొంతమంది అమ్మాయిలు నడుచుకుంటూ వస్తున్న పట్టీల శబ్దం వినపడి వెంటనే చూసేసరికి, చుట్టూ ఎంత మంది ఉన్నా నీలి రంగు డ్రెస్ వేసుకున్న నువ్వే కనిపించావు, ఆ క్షణం నన్ను నేనే మైమరిచిపోయా.

అంత అందంగా ఉన్నావ్,ఆ కాటుకు పూసిన కళ్ళు, చిన్ని చిన్ని పెదవులు, ముట్టుకుంటే ఎరుపు రంగు అయిపోతాయేమో అనే బుగ్గలు,అలా చూస్తూ కాసేపు ప్రపంచాన్నే మరచిపోయి అలా నీతో పాటు వెనకాల వచ్చేస్తున్నా,నిన్ను ఫాలో అవటం అదే మొదలు.

ప్రతిరోజు కాలేజీకి ముందుగానే వచ్చి,పైనుంచి నీ రాక కోసం ఎదురుచూసేవాడిని,నువ్వు కొంచెం దూరంలో కనబడగానే పరిగెత్తుకుంటూ కిందకు వచ్చి,ఏమీ తెలియనట్లు,నువ్వు పైకి వెళ్తుంటే నీ వెనకాలే వచ్చేవాడిని,

ఒకరోజు మీ క్లాస్ రూమ్ లో ఎక్కడ కూర్చున్నావో అని వెతుకుతూ, కొంచెం ముందుకు వెళ్లి చూస్తే కిటికీ పక్కనే ఉన్నావ్ ,ఇంకా అంతే ఆ రోజు నుంచి ప్రతి పీరియడ్ మధ్య విరామంలో ఆ కిటికీ దగ్గరే ఉండి చూసేవాడిని, ఆ విషయం నీకు కూడా తెలుసు.

నువ్వు నా కళ్ళలోకి అలా కోపంగా చూసేసరికి నా హృదయ స్పందన రెట్టింపు అయిపోయేది,భయంతో వెంటనే తలకు క్రిందకు దించేసేవాడిని, ఇలా ఒక సంవత్సర కాలం గడిచిపోయింది.

నిన్ను చూడడం కోసం ఒక్క రోజు కూడా సెలవు పెట్టే వాడిని కాదు,ప్రతిరోజు కాలేజీకి వచ్చేసేవాడిని,ఒకవేళ నువ్వు రాకపోతే మధ్యాహ్నం వెళ్లిపోయేవాడిని.

ఈ క్రమంలో నా యొక్క కాలేజీ హాజరు శాతం 90% కంటే ఎక్కువే ఉంది, నీ దృష్టిలో ఎక్కడ తక్కువైపోతానేమో అని రెట్టింపు ఉత్సాహంతో చదివేవాడిని, ఈ క్రమంలో మా క్లాస్లో టాప్ 5 లో ఉత్తీర్ణత సాధించగలిగా.

మొదటి సంవత్సరం పరీక్షలు అయిపోవడం వల్ల సెలవులు ఇచ్చారని ఇంటికి వెళ్ళిపోయా. ఎప్పుడు సెలవులు అయిపోతాయా,కాలేజీకి ఎప్పుడు వెళ్తానా, ఎప్పుడు నిన్ను చూస్తానా అని రోజులు లెక్కపెట్టుకుంటూ ఉన్నా ?

ఇది మొదట సంవత్సరం కధ మాత్రమే

- కోటేశ్వరరావు

Comments