ఎవరు పార్ట్ 13
వేసిన ముసుగు తీసేసరికి గూడెంలో ఉన్నాను. గుడెసె లోనుండి బయటకి రానివ్వలేదు. లక్ష్మి గారి గురించి అడిగినా సమాధానం లేదు. ప్రశ్న అర్థం కాలేదో లేక మౌనం వహిస్తున్నారో తెలియలేదు కానీ సమాధానం మాత్రం రాలేదు. అడిగి అడిగి అలిసిపోయాను తప్ప వారిలో ఉలుకు పలుకు లేదు. రాత్రి ఏదో తింటానికి తెచ్చి పడేసారు, కాల్చిన మాంసంలా ఉంది, తినబుద్ధి కాలేదు. పదే పదే లక్ష్మి గారిని ఆఖరి సారిగా కన్నీటితో చూసిన మోమే గుర్తుకు వస్తూ నిద్ర కూడా పట్టలేదు.
తెల్లారగానే ఇద్దరు వచ్చి నన్ను రమ్మని సైగ చేసారు, వారి వెనుక వెళ్తుండగా గూడెం అంచున ఊరి జనం కనిపించారు. చాల మంది రైతులు, వారి చేతిలో కర్రలు, అందరూ ఆందోళనగా గూడెం మధ్య ఉన్న నాయకుడు గృహము వైపు చూస్తున్నారు. మేము ఆ గృహము దగ్గరికి వెళ్ళే కొద్దీ పెద్ద పెద్ద అరుపులు వినిపిస్తునాయి. లోపలకి వెళ్ళాము, లోపల వాతావరణం చాలా వేడిగా ఉంది. లక్ష్మి, ఆ నాయకుడుతో పాటు లోపల దర్శన్ చిత్రపాటి గారు, కృప గారు, కనుమూరి గారు, గుడెం భాష తెల్సిన ఒక మధ్యవర్తి ఉన్నారు.
కనుమూరి గట్టిగ మాట్లాడుతూ, చట్టంలో నియమ నిబంధనలూ గురించి, ఆ గూడెం వారు ఎంత పెద్ద తప్పు చేసారో, ఆ తప్పుకి ఏ శిక్షో చెబుతూ ఆ నాయకుడిని భయపెడ్తున్నాడు. పక్క నుండి కృప గారు “నెమ్మది.. నెమ్మది’ అని కనుమూరి గారిని హెచ్చరిస్తున్నారు. దర్శన్ గారు, ఆ మధ్యవర్తి కనుమూరి గారు మాట్లాడ్తున్న విధానానికి కంగారు పడ్తున్నారు. లక్ష్మి గారు మౌనంగా కూర్చుని ఉన్నారు.
అంతలో ఆమాంతం ఒక కత్తి వచ్చి కనుమూరి పక్క నుండి వెళ్లి గుడిసె దడికి గుచ్చుకుంది. బుస కొడుతున్న త్రాచులా పైకి లేచి కోపంగా “ఆపు ఇంక నీ పురాణం”
వేగంగా కనుమూరి దగ్గరికి వచ్చి “చట్టం మాకు యెరుకే, కాని అడివిలో చట్టం ఒల్లదు.” కనుమూరి గొంతులో నుండి మాట రాలేదు. ఆయనికి బాష రావటం నాకు ఆశ్చర్యం అనిపించింది.
నాయకుడు “ఒక గుడానికి దొరను, నాకే బెదరింపా!! మా జాతికి భయం ఎక్కదు. యెరుక పెట్టుకో, అడివి జంతువుకి భయం వేసినా ఆకలి వేసినా తెలిసింది, చేసేది ఒక్కటే, వేట. అమ్మి అప్పగించి భూపతిని నిష్క్రమత్.”
మధ్యవర్తి “విగ్రహం ఇచ్చి లక్ష్మి గారిని తీస్కుని వెళ్లమంటున్నారు.”
కృప గారు “అది మా దగ్గరే ఉండి ఉంటె ఇంత గొడవ ఎందుకు, మేము ఎప్పుడో ఇచ్చేసే వాళ్ళము. ప్రాణం కన్నా ఏది విలువైనది కాదు కదా!”
మధ్య వర్తి వాళ్ళ బాషలో అనువదించాడు. నాయకుడి కోపం తగ్గలేదు.
దర్శన్ గారు “మేము విగ్రహం వెతికే పనిలో ఉన్నాము, రేపే లోయలోనుండి కారు బయటకు తీయటానికి అన్ని ఏర్పాట్లు చేసాము. అందులో విగ్రహం ఉంటే వెంటనే మీకు వచ్చేస్తుంది.”
మధ్యవర్తి మాట్లాడుతుంటే... నాయకుడు ఆపమని “కథ బాగుంది. దిన దినానికి ఒక కొత్త సాకు. ముందు ఆ నారాయణ భూపతి అమ్మిని అపహరించుట, దాని వెనుక ఆ ముక్తానంద భూపతి మాట. అన్ని కథలే”
“ముక్తానంద భూపతి, నా మాటకి కంట తడి నటించి, మాట ఇచ్చాడు అమ్మిని తెస్తానని. కానీ తీస్కుని రాలేదు. అందుకే దిక్కులేని చావు.” “మాట తప్పిన ఆ కుక్క”
“అదుపు... మాట అదుపు” అని కరుకైన కంఠ స్వరంతో లక్ష్మి గారు కూర్చులో నుండి లేచారు. నాయకుడి పక్కన ఉన్న అతను లక్ష్మి గారి మీద కత్తి ఎత్తాడు. ఆ నాయకుడి కుర్చీ పక్కన ఉన్న విల్లును టక్కున తీసి శరవేగంగా లక్ష్మి గారు బాణం వదిలారు. వెంటనే కనుమూరి తన తుపాకిని తీసి లక్ష్మిగారి వెనక్కి వెళ్లి నిలబడ్డారు. అంతా నిశ్శబ్దం.
లక్ష్మి గారు “తాత గారు తప్పు చేసారు కాబట్టి తగ్గి, తిలకిస్తున్నాను.” లక్ష్మి గారు కనుమూరి గారి చేతిలో నుండి తుపాకీ తీస్కుని “ఎవరితో ఎవరు గురించి మాట్లాడుతున్నారు. మర్చిపోయారా, లక్ష్మి భూపతి. ఈ ప్రాంతానికి మేమే ఆది, అంతం. ఎంత మదం ఎక్కిన మృగం అయినా, వేటగాడికి ఎదురు వెళ్ళితే వాడి వేటకి బలి అవ్వాల్సిందే. యెరుక పెట్టుకో!" ఎరుపు ఎక్కిన లక్ష్మి గారి కళ్ళు ఆ నాయకుడిని సూటిగా చూస్తున్నాయి. ఆరున్నర అడుగుల మనిషికి దీటుగా నిలబడిన ఆమెను చూసి నా ఒళ్ళు జలజరించింది.
అంతలో మధ్యవర్తి “శాంతించండి, ఈ గొడవ వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. బయట ఎవరికీ విషయం తెలియదు. అది బయటకి పొక్కితే విగ్రహం కనిపించినా దాన్ని ఎవరు కాపాడుకోలేరు.”
లక్ష్మి గారు కాస్త సౌమ్యంగా, నాయకుడిని చూసి “మేమె తీస్కుని వెళ్ళాము కాబ్బటి దాన్ని తిరిగి ఇచ్చే బాధ్యతే మాది.. నాది. నాలుగు రోజుల్లో పూజ, పూజకి మీకు ఆ విగ్రహం చేరుతుంది లేదా ఆ ఆమ్మకి బలి గా నేనే వస్తాను.” అని లక్ష్మి గారు బయటకు బయల్దేరారు. ఆమె వెనకే మేము కూడా బయలుదేరాము.
*******
కారు లోయలో నుండి ఏనుగుల సహాయంతో లాగే ప్రయ్నతం చేస్తున్నారు. రెండు పెద్ద పెద్ద ఏనుగులకు పగ్గాలు కట్టి, పగ్గాల్ని అడ్డంగా నిలబెట్టిన దుంగలకు ఉన్న చక్రాల మీదగా లోయలోకి దింపి, వాటి చివర ఉన్న హుక్కులను కారుకి తగిలించారు. అందరూ అతృతతో ఎదురు చుస్తున్నారు. లక్ష్మిగారి వేరుగా నిలబడి అంతా గమనిస్తున్నారు. ఆమె దగ్గరికి వెళ్లి క్షమాపణ అడగాలి అనుకున్న దగ్గరకు వెళ్ళాను.
“లక్ష్మి గారు” నా పిలుపు ఆమెకు వినబడలేదు. మళ్ళి పిలిచాను. మొహం చాటేశారు. ఆ క్షణం ఎవరో లోపలి చెయ్యి పెట్టి గుండెను లాగేస్తునట్టు అనిపించింది. ఎంత లేదు అనుకున్నా, దూరం చేసుకోవాలి అనుకున్నా, ప్రేమ పుట్టాక అది పోదు అని అర్ధం అయ్యింది. భూపతిని కోరుకునే అంత స్వార్ధపరుడిని కాను, కానీ ప్రేమించిన అమ్మాయి అసహ్యించుకుంటే తట్టుకోలేకపోయాను. కష్టం అయినా విగ్రహం దొరికిన వెంటనే వెళ్లి పోవాలి అని నిశ్చయించుకుని, ఆ కారు కోసం ఎదురుచూశాను.
కష్టపడి పైకి లాగారు. కానీ తట్టుకోలేని దుర్వాసన, అందరూ వెనక్కి జరిగారు. కొందరు పోలీస్లులు కారు దగ్గరికి వెళ్లి అంతా వెతుకుతున్నారు. కానీ ఏమీ కనిపించినట్టు లేదు. కనుమూరి గారు, అలీ కలిసి నిలబడిన చోటుకి వెళ్లి “ఏమి దొరికినట్టు కనిపించట్లేదు”
అక్కడ చూస్తున్న ఒక పోలీసు కనుమూరి గారిని చూసి దొరకలేదు అన్నట్టు తల అడ్డంగా ఊపి సైగ చేసాడు. కనుమూరి కోపంతో లక్ష్మి గారి కారుని కొట్టాడు.
“శాంతిచండి, కోపంలో ఏదీ సాధించలేము.”
కనుమూరి “కోపమే, చేతకానితనం వల్ల వచ్చిన కోపం. ఒక పక్క లక్ష్మి గారి ప్రాణం ప్రమాదంలో ఉంది. ఇక్కడ కేసులో పురోగతి లేదు. కానీ ఇప్పటి వరకు ఏదో ఒక మూల ఈ హత్యలకి కారణం దైవ శక్తి అనుకున్నాను. కానీ అది నిజం కాదు”
“అది ఎలా?”
“ప్రతి చోటా ఒక ఆచూకీ కూడా లేదు అంటే, ఇది ఖచ్చితంగా ఎవరో కావాలనే చేస్తున్నారు. కానీ అది ఎవరు. ఎవరు?”
కనుమూరి “అలీ, మొన్న నేను ఒక విషయం కనుక్కోమన్నాను. కనుక్కున్నావా?”
అలీ “ఆ.. కనుక్కున్నా, లక్ష్మి గారు కనుక చనిపోతే ఆ తర్వాత ఈ ఆస్థి లక్ష్మి గారికి దూరపు చుట్టం అయిన కృప గారికి వెళ్తుంది.”
కనుమూరి “సరే అలీ, నీకు కారు నడపటం వచ్చు కదా! మీరు లక్ష్మి గారితో వెళ్ళండి. నాకు కొంచెం పని ఉంది.”
నేను లక్ష్మి గారి దగ్గరకు వెళ్ళాను. అలీ కారు తీసుకుని వచ్చాడు, లక్ష్మి గారు కారు ఎక్కారు, నేను ఎక్కబోతుంటే లక్ష్మీ గారు “ఇది పనివారికి కాదు!”
నేను డోర్ తీసి అలా నిలబడిపోవటం చూసి అలీ లక్ష్మి గారితో “బాగా దూరం, పైగా రాత్రి కావొస్తుంది, మీరు అనుమతిస్తే!!” లక్ష్మి గారు సరే అని చెప్పారు ప్రమాదం ఆమె చుట్టూ ఉంది, ఆమెను ఒంటరిగా వదిలి ఉండలేను. అందుకే ఆత్మాభిమానం చంపుకుని కారు ఎక్కాను.
దారి పొడువునా ఆమె మాట్లాడ్తారేమో అని చుసాను, కానీ లేదు. భవంతి చేరుకున్నాక కారు దిగి వెంటనే వెళ్లిపోయారు. రాత్రి కావచ్చింది, భవంతిలో ఆఫీస్ గదులు తాళాలు వేయటానికి నేను భవంతిలోకి వెళ్ళాను. కానీ మహేష్ గారి గదిలో ఎవరో ఉన్నట్టు కనిపించింది. దగ్గరికి వెళ్లి కిటికీ లోనుండి చూసాను. లోపల కృప గారు.
ఆయన మహేష్ గారి ఇనుప బీరువా లోనుండి కాస్త డబ్బు తీసుకున్నారు. వెంటనే నా తాళాల గుత్తి చూసుకున్నాను. అందులో ఆ ఇనుప బీరువా తాళం ఉంది. ఆయన బయటకు వెళ్లిపోతుంటే వెంబడించాను. తరువాత ఆలా వెళ్తూ వెళ్తూ ఆయన తన మొక్కల పరిశోధనశాలలోకి వెళ్లారు, నేను బయటే ఉండిపోయాను. ఆయన బయటకు వచ్చాక, దొంగతనంగా నేను లోపలకి వెళ్ళాను. ఆయన ఆఫీస్ గదిలా ఏదో కనిపించింది, అక్కడికి వెళ్లి దీపం వెలిగించాను.
ఆ గదిలో మహేష్ మరియు కృపగారు కలిసి ఉన్న చిత్రపటం ఒకటి కనిపించింది. దీపం దగ్గరికి పెట్టి చూసాను, పొరపాటున దీపంలోని నూనె దానికి అంటుకుంది. దీపం కింద పెట్టి చిత్ర పట్టని తుడిచాను. అది చిరిగి పోయి లోపల ఏవో పత్రాలు కనిపించాయి. పత్రాలు బయటకు తీసి చూస్తే అవి మహేష్ భూపతి సంతకం ఉన్న ఖాళీ దస్తావేజులు.
అవి చూసి నాకు భయం వేసింది. అవి పట్టుకుని బయటకు వచ్చేద్దాం అనే కంగారులో కింద పెట్టిన దీపాన్ని తన్నేశాను. అ మంట పాకి పరిశోధనశాల అంత వ్యాపించింది. కిటికీ లోనుండి బయట పడే ప్రయత్నం చేస్తుండగా కృప మనుషులతో అటు వైపే రావటం గమినించాను. వారి కంట పడకుండా ఉండాలని హడావిడిగా దూకేసాను. కానీ వారు నన్ను చూసేసారు.
పరిగెత్తాను, చాల వేగంగా.... నా వెనక చాలా మంది వెంబడిస్తునారు అని అర్థమైంది. వారి అరుపులు నాకు చేరువ అవుతున్నాయి. ఒక గుట్ట పైకి ఎక్కుతూ కింద పడిపోయాను. ఇంక నా చావు ఆ క్షణమే అనుకునే సమయంలో తుపాకీ పేలింది. తల పైకి ఎత్తాను, ఆ గుట్ట మీద ఎవరో తుపాకీ పేల్చారు. ఆ శబ్దానికి నా వెనుక పడ్డ జనం చెల్లా చెదురు అయ్యిపోయారు. నేను లేచి పైకి వెళ్లి చూస్తే అది ఎవరో కాదు అలీ.
అలీ నువ్వా, నీకు తూపాకి ఎక్కడిది.
“అదా, నా వృత్తి రీత్యా లైసెన్స్ ఇచ్చారు”
“అంటే నువ్వు నాటక రచయిత కాదా!! పోలీస్ ఆ?”
“కాదు, నేను డిటెక్టివ్ అలీ షా”
- భరద్వాజ్ (Bj Writings)