ఎవరు పార్ట్ 15
నేను గుర్రం మీద, అలీ, కనుమూరి జట్కా బండిలో, లక్ష్మి గారు దర్శన్ ని కలిసే చోటుకు బయలుదేరాము. ఎంత వేగంగా వెళ్ళాలి అనుకున్నా పొగమంచు వల్ల వెళ్ళలేకపోతున్నాము. ఎదుట ఉన్న దారి కనిపించక గుర్రాలు కుడా సహకరించట్లేదు. మేము చేరుకోవలసిన ప్రాంతానికి వెళ్లేసరికి దూరంగా ఎవరో ముసుగు వేస్కుని లక్ష్మిగారికి తుపాకీ గురి పెట్టి ఉన్నాడు.
మమ్మల్ని చూసి దర్శన్ చిత్రపాటి మనుషులు దాడికి దిగారు. వచ్చిన వారు జట్కా బండి చుట్టూ చేరారు. కనుమూరి తుపాకీ తీశారు, కానీ అంతలోనే ఒక అతను కర్రతో కనుమూరి తుపాకీ పట్టుకున్న చేతిని కొట్టాడు. నేను ఉన్న గుర్రం అడివి గుర్రం కావటంతో, వచ్చిన వారి మీద రంకెలు వేస్తూ తన్నుతూ, పోరాడుతుంది. అంత మందిని దాటి లక్ష్మిగారి దగ్గరికి వెళ్ళటం సాధ్యపడేలా అనిపించలేదు. అంతలో నన్ను గుర్రం మీద నుండి కిందకి లాగేసారు. అమాంతం ముగ్గురు వచ్చి మీద పడి ఊపిరి సల్పకుండా చేశారు.
దూరముగా ముసుగు వేసుకున్న అతను లక్ష్మిగారి జుట్టు పట్టుకుని లాక్కుని వెళ్తున్నాడు. అది చూసి ప్రాణం పోతున్నట్టు అనిపించింది. ఏమి చేయాలో తెలియని స్థితిలో అక్కడ ఒక రాయి కనిపించింది. తోసుకుంటూ దాని దగ్గరికి వెళ్లి, నన్ను పట్టుకున్న వారిలో ఒకడి తలని గట్టిగా పట్టుకుని, వాడి తలకి రాయితో గురిపెట్టాను.
“ఎవడన్నా పట్టుకుంటే వీడి తల పగిలిపోతుంది.” మిగతా ఇద్దరు లేచి దూరంగా వెళ్లారు.
ఒక చేతితో వాడి తలని సంకలో బిగించి, రెండో చేతితో రాయి వాడి తలకి గురిపెట్టి, వాళ్ళని బెదిరిస్తూ లక్ష్మి గారి వైపు చూసాను. లక్ష్మిని, అతను చుట్టూ ఉన్న గుబురు చెట్లలోకి తీస్కుని వెళ్ళాడు. కాస్త దూరం నేను పట్టుకున్న అతన్ని లాక్కుని వెళ్ళాక, అతన్ని వదిలేసి, నా చేతిలో ఉన్న రాయిని ఆ ఇద్దరి మీదకు విసిరి నేను లక్ష్మిగారి వైపు పరిగెత్తాను. ఆ గుబురులోకి వెళ్ళాక, నేను తన వైపు రావటం చూసి తుపాకీతో పేల్చాడు.
లక్ష్మిగారు ఆపదలో ఉన్నారు అనే కంగారు తప్ప మదిలో ఏ ఆలోచన లేదు. అందుకేనేమో అతను తుపాకీ పేలుస్తున్నా నేను వెంబడించటం మానలేదు. కానీ పొగమంచులో అతను ఆమెను ఎటు లాకెళ్తున్నాడో కనిపించలేదు. గుడ్డిగా లక్ష్మిగారి అరుపులు, వాడి తుపాకీ పేలిస్తే వస్తున్న శబ్దాన్ని విని పరిగెడుతున్నాను. అలా పరిగెడుతున్న నాకు ఎదురుగా పది అడుగుల దూరంలో ఆ ముసుగు మనిషి లక్ష్మిగారికి తుపాకీ గురి పెట్టి నిలబడ్డాడు.
గురి పెట్టిన తుపాకిని మెల్లగా నా వైపుకి తిప్పాడు. సూటిగా నా తలకి గురి పెట్టి, పేల్చబోయాడు. నేను కళ్ళు మూసుకున్నా. తుపాకీ పేలిన శబ్దం వినిపించింది. కాస్త నిశ్శబ్దం తర్వాత కళ్ళు తెరిచి చూస్తే లక్ష్మిగారు కిందకి చూస్తున్నారు. ఆ ముసుగు మనిషి కింద పడి ఉన్నాడు. మెల్లగా అతని శరీరం లోనుండి రక్తం బయటకు వస్తుంది. వెనక్కి చూసాను. కనుమూరి తుపాకీ పట్టుకుని పరిగెత్తుకుంటూ వస్తున్నారు. తుపాకీ గొట్టం అంచు నుండి పొగ వస్తుంది.
నేను లక్ష్మిగారి దగ్గరికి వెళ్ళాను. కనుమూరి, అలీ వెల్లకిలా పడి ఉన్న ఆ ముసుగు మనిషిని తిప్పి, ముసుగు తీశారు. కనుమూరి చెప్పినట్టుగానే అతను ఎవరో కాదు, దర్శన్ చిత్రపాటి. లక్ష్మిగారు చలిలో వణికిపోతూ నిలబడ్డారు. ఆమె చుట్టూ నా చేతులు చుట్టి ఆమెను కారు దగ్గరికి తీస్కుని వెళ్తుండగా, అది చూసి అలీ పరిగెత్తుకుంటూ వెళ్లి లక్ష్మిగారు వచ్చిన కారును తీస్కుని వచ్చాడు. లక్ష్మిగారు, నేను కారు ఎక్కాము.
ఆమె నా భుజం మీద వాలారు. ఆమె కళ్ళలో నుండి కన్నీరు నా భూజాన్ని తాకాయి. ఆ కన్నీరు నేను తుడవలేదు. ఆమె పడిన ఒత్తిడిని అవి చల్లారుస్తున్నాయి అనిపించి, నేను మౌనంగా ఉండిపోయాను. మేము భవంతిలోకి వెళ్ళగానే లక్ష్మి గారిని పనివారు లోపలికి తీస్కుని వెళ్లారు. ఆమె వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి చూసారు. నేను చిన్నగా నవ్వాను. ఆమె అలా చూస్తూనే లోపలికి వెళ్లిపోయారు.
మర్నాడు ఉదయం కనుమూరి గారు వచ్చారు. నేను వారిని లక్ష్మిగారి దగ్గరికి తీస్కుని వెళ్ళాను. లక్ష్మిగారితో కనుమూరి “మేడం, ఎలా ఉన్నారు?”
లక్ష్మి “బాగున్నాను.”
కనుమూరి “ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేశాను, కేసు సాల్వ్ అయ్యింది కాబట్టి నాకు ఇంకా సెలవు ఇప్పించండి. ”
“కానీ ఇంకా విగ్రహం కనిపించలేదు కదా?” అన్నాను.
కనుమూరి “అది ఎక్కడికి పోతుంది, ఆ దర్శన్ ఇంట్లోనే ఉంటుంది.”
లక్ష్మి గారు “దాని గురించి దిగులు లేదు, ఆ విగ్రహం కారు పడిన లోయలో దొరికింది అని ఈ రోజు ఉదయం ఆ నాయకుడు కబురు పంపాడు.”
కనుమూరి “అలా అయితే మరి నాకు సెలవు.”
లక్ష్మి గారు నవ్వుతూ “ వారిని సాగనంపి రండి.”
కనుమూరి గారికి కానుకలను ఇచ్చి, వర్షం పడే సూచనలు కనిపించటం వల్ల వారికి బండి పురమాయించాను. ఆ వీడుకోలు నా ప్రయాణాన్ని గుర్తు చేసింది. నేను అతిథిగృహానికి వెళ్లి నా సంచి తీసుకుని బయలుదేరాను. ఎవరికీ చెప్పాలి అని గాని, కలవాలి అని గాని అనిపించలేదు, అలా చల్లటి వాతావరణంలో నడుస్తూ ఉండగా దారిలో లక్ష్మిగారు వంటరిగా దారి పక్కన నిలబడి కనిపించారు.
“మీరు? ఇక్కడ?”
లక్ష్మి “వెళిపోతున్నావా? లేక విడిచి వెళిపోతున్నావా?”
నేను మౌనంగా నిలబడ్డాను.
లక్ష్మిగారు “నీతో ఒకటి చెప్పాలి”
“నువ్వు అంటే నాకు చాలా ఇష్టం లక్ష్మి.”
నేను ఆ మాట చెప్పగానే తొలకరి జల్లులు మొదలయ్యాయి. ఆమె నా చెయ్యి పట్టుకుని వర్షంలో తడవకుండా రమ్మని లాగారు. ఇద్దరమూ చెట్టు కిందకి పరిగెత్తాము.
ఆమె నా మీద పడిన చినుకులను తుడుస్తూ “ఎందుకు ఇష్టము?” అని అడిగి సూటిగా కళ్ళలోకి చూసారు. అంతలో కారు హార్న్ వినిపించింధి. అలీ కారులో వచ్చాడు, వర్షము పడుతుందని లోపలికి పిలిచాడు.
నేను, లక్ష్మి కారు ఎక్కాము. లక్ష్మి “నేను నీతో ఒకటి చెప్పాలి అని అన్నా కదా! అది ఏంటో అడగవా?”
నాకు అర్ధం కాలేదు. “ఏంటది?”
“నన్ను ఒక రోజు అడిగావు గుర్తుందా, అన్నయ పుట్టిన రోజు నాడు నేను ఇక్కడే ఉన్నానా అని”.
“అంటే అది” అని నేను చెప్పటానికి సంకోచిస్తుండగా
లక్ష్మి “పర్వాలేదు చెప్పు, ఎందుకు అడిగావు?”
“ఆ రోజు మద్యం మత్తులో ఎవరో అమ్మాయి మహేష్ గారి గదిలోకి వెళ్ళటం చూసాను. అది నేను మీరే అనుకున్నాను. కానీ మీరు ఇక్కడ లేరు అనేసరికి నాకు మీరు అబద్దం చెబుతున్నారు ఏమో అనిపించింది.”
“అవును అది అబద్దమే”
నా ఆలోచనలలో మళ్ళీ అనుమానాలు మొదలయ్యాయి “అంటే మహేష్ గారిని చంపింది?”
లక్ష్మిగారు బలంగా ఉపిరి పీల్చుకుని, చిన్నగా “నేనే” అని సమాధానం ఇచ్చారు.
నాకు ఏమి అర్ధం కాలేదు. అలీ వైపు చూసాను, అలీ నవ్వుతూ కనిపించాడు. “అంటే అది చేసింది దర్శన్ గారు కాదా?”
అలీ “కత్తి కొన్నది వారే, కానీ వాడింది మేము.”
“మరి కనుమూరి గారు చెప్పింది? ”
అలీ “ఆయన చెప్పలేదు, చెప్పేలా చేసాము ”
“అర్థం కాలేదు”
అలీ “అసలు ముక్తానంద భూపతి ఎలా చనిపోయారు? ఎక్కడా దొరకని ఆ వింత రసాయనం(డ్రగ్) దర్శన్ గారికి ఎక్కడిది? విగ్రహం భూపతి రాజు గారి దగ్గర ఉంది అని దర్శన్ చిత్రపాటికి ఎలా తెలుసు? ఇవన్ని కనుమూరి కేసు ఫైల్ లో ప్రశ్నలుగానే మిగిలిపోయిన అనుమానాలు.”
*
- భరద్వాజ్ (Bj Writings)