ఓట్ల రాజకీయాలు  - కోట

Comments · 223 Views

ఓట్ల రాజకీయాలు  - కోట


ఓట్ల రాజకీయాలు 

1 .ఆ.వె.
నాయకులకు పెక్కు నాలుక లుంటాయి 
ఎప్పుడేమి పలుకు టెవరికెరుక?
పేదవారి కలిమి పెంచుతానని చెప్పు 
ఓటు వేసినాక పోటు పొడుచు 
2 .ఆ.వె.
పదవి లేనినాడు పస్తులున్న చరిత 
కొద్దికాల పదవి కోటి ఆస్తి 
ఆక్రమించి భూమి హత్యలు దాడులు 
మేక వన్నె పులులు మేధయందు 
3 .ఆ.వె.
పదవి దక్కువరకు పార్టీల వారిగా 
ఉచిత మాటలెన్నొ ఉగ్గడించు 
కలరు టీవి,రైసు, కరెంటు ఉచితమే 
అట్టి దాతలిపుడు అవని లేరు 
4 .ఆ.వె.
నక్సలైట్లమంటు నాయకులను చంపి 
కోట్లధనము నంత కొల్లగొట్టి 
పేదల కొరకు తమ పోరుసాగుననెడి 
రాజకీయ మెంత రాక్షసంబు?
5.ఆ.వె.
కాసుయందలి తిరకాసెట్టిదోగాని 
నీతి నియమములను నీటగలుపు 
బంధు మిత్రులంత బద్ధశత్రువులాయె 
కాలమహిమ గాదు కాసుమహిమ 
6 .ఆ.వె.
పార్టి వేరనగనె పగలు పెంచుకొనును 
ఇల్లు తగులబెట్టు ఈర్శతోడ 
రాళ్ళదాడి చేసి రాజ్యాంగ హక్కను 
మనిషికేల వచ్చె మాయజబ్బు? 
7 .ఆ.వె.
పశువు గుణము నయము "పగలు"పెంచుకొనవు 
పంచుకొనుచు తినును పచ్చిగడ్డి 
మనిషి మనిషిని గన మాయరోగము వచ్చు 
చేతిలోని ముద్ద చెదరగొట్టు 
8 .ఆ.వె.
ఒక్క ఓటు కూడ ఓటిపోవగ రాదు 
"నోట"మీట కూడ వాట మార్చు 
ఓటువిలువ పెక్కు కోట్లతో సమమౌను 
అట్టి ఓటు నెవరి కమ్ముకోకు 
9 .ఆ.వె.
రాజకీయ మంత రాక్షసంగా మారె 
ఎవరి మాట నిజము ఎంచలేము 
ఓట్ల కొరకు తిట్లనోర్చుకుందురుగాని 
ప్రజల మంచికొరకు పాటుపడరు 
10 .ఆ.వె.
కోడిగుడ్డుపైన గుచ్చి ఈకలు చూపు 
ఉన్నవీకలనుచు ఊడ్చివేయు 
తిమ్మి బమ్మిజేసి తికమక పెట్టును 
నమ్మరాదెపుడును నాయకులను 

                  
********

1 .ఆ.వె.
ప్రజలు దేవులంటు పలకరించెడివారు 
చట్టసభలలోన చవటలగుచు 
నీవు శుంఠ యంటె నీవు శుంఠ యనెడి 
సంప్రదాయమెట్లు  సంభవించె?
2. ఆ.వె.
మామగార్లవంటి మంత్రి వర్యుల అండ 
టెండరేసి పనుల నెండజేసి 
కోట్లకొలది ధనము కొల్లగొట్టుటె నీతి 
అండపోయినంక గుండు సున్న 
3.ఆ.వె.
పెద్ద నేరగాళ్ళు పేదోళ్ళ నిరికించి 
నీతి మంతులమని నిక్కి తిరుగు 
చట్టమందు లొసుగు చుట్టాలు వారికి 
రాజకీయ పదవి రాజసంబు 
4 .ఆ.వె.
మంత్రులంత భూమి వంతుల వారిగా 
పందికొక్కులవలె పంచుకొనిరి 
పదవు లూడినపుడు పనితనము తెలిసె 
వేల ఎకర భూము లేల వచ్చె? 
5.ఆ.వె.
పిల్లి కళ్ళుమూసి పాలు దాగినయట్లు 
పట్టుబడిన సొమ్ము పరువు దీసె 
సిగ్గులేని బతుకు సీట్లకోసమె గదా 
పరువు పోయినంక బతుకు టేల?
6 .ఆ.వె.
ఉచిత పథకములని ఊరించి వంచించి 
మాయమాట లాడి మభ్యపెట్టి 
వేలకోట్లు మెక్కి వేలను విదిలించ 
మందబుద్ధులాయె మనుషులంత 
7 .ఆ.వె.
పదవి పలుకుబడికి బంజరుభూములు 
అందినంత వరకు ఆక్రమించి 
ధరణి పేరుజెప్పి దస్త్రాలు మార్చగా 
అసలు రైతులంత ఆగమయిరి 
8 .ఆ.వె.
ప్రతినిధులుగ గెల్చి ప్రజలను వంచించి 
చెరువు కుంట హద్దుచెరిపి వేసి 
కంచెవేయ చుట్టు కాపేమి చేయును 
కంత్రి మంత్రి చేయు కబ్జ పనికి 
9 .ఆ.వె.
దోపిడీ దొరలను దొంగరౌడీలను 
పాముపుట్టలోని స్కాములన్ని 
వెలికి తీయు కథలు వెతలన్నివెలుగున 
కర్రుగాల్చి తొడలు గూల్చదగును 
10 .ఆ.వె.
ఓట్లదొంగలంత పోట్లాడుచుండిరి 
గద్దెకొరకు పాట్లు పెద్దలంత 
మనిషి తెలుసుకోక మత్తులో బడుచుండె
మనిషి ఓటుకెంత మహిమ వచ్చె 

    

*********
1 .ఆ.వె.
ప్రజల సొమ్ము తినగ పదవి కాంక్ష పెరిగె
పదవి వచ్చినాక పాపమంటె 
గట్టిగా నుడివిన గురివింద నీతులు 
పుట్ట వెడలి పాకె పుడమి యంత 
2. ఆ.వె.
    పదవి గర్వమందు పనులు పెక్కులు జేసి 
అడ్డమెవ్వడనుచు అణచిపెట్టి 
బడుగు జీవుల కిది బాగైన దారంటు 
అడ్డదారులెంట గడ్డి తినిరి 
3 .ఆ.వె.
కుంభకోణములను గుట్టుగా చేసిన 
పెద్దమనుషుల కడు ముద్దు చేసి 
హద్దు మీరుదనుక సద్దు చేయక యుండి 
ఎసరు వచ్చనాక ఏడ్చుటేల? 
4. ఆ.వె.
  బ్రతుకు ముందు నీవు బ్రతికించు నీతోటి 
సాటివారి గూడి సాగిపొమ్ము 
మనిషి ఒంటిగాదు మనుగడ సాగించ 
సాటి జనుల కింత సాయపడుము 
5 .ఆ.వె.
ఒకడిమించి ఒకడు ఓటుకై వస్తాడు 
అర్థమిత్తునంటు ఆశపెట్టు 
పబ్బము గడిచాక పాతిపెట్టును నిన్ను 
ఆశకు తమ ఓటు నమ్ముకోకు 
6 .ఆ.వె.
ఎన్నికలనగానె హేవగింపు గలిగె 
న్యాయమింత లేదు నాయకులకు 
ఎలుక పిల్లిముందు ఏడ్చినా ఫలమేమి?
ధనము లేనివాడు తగడు యిచట 
7 .ఆ.వె.
డబ్బు పంచుతున్న గబ్బు నాయకులకు 
సిగ్గు శరము లేదు చిన్నమంత 
మంచి చేయలేని మనిషిని నిలబెట్టి 
ఓట్లు వేయుమనుచు కోట్లు పంచె 
8 .ఆ.వె.
ప్రజల నేడిపించి పబ్బము గడుపుట 
రాజకీయ నీతి రాటుదేలె 
నంగనాచి పనులు నాయకుల్జేయించి 
ఏమి ఎరగనట్లు ఏడ్చుచుంద్రు 
9 .ఆ.వె.
డబలు బెడ్డు రూము డాబాలు గట్టిస్త 
అప్పులన్ని దీర్చి ఆదుకుంట 
ఫ్రీగ అన్ని యిస్త బాండు రాసిస్తాను 
ఆశకు తమ ఓటు నమ్ముకోకు 
10 .ఆ.వె.
ఎదుటి వారి మీద ఎన్ని అవాకులో 
గురివి గింజ మచ్చ గుర్తుతెచ్చె 
తప్పులన్నిజేసి తగుదునమ్మా యను 
గొంతు గోయువాన్ని గొర్రె నమ్ము 

                 

  *********
1. ఆ.వె.
పాలకులు మనలను పాలింతురని కోరి 
ఏలికలను మనము ఎన్నుకుంటె 
మెలిక పెట్టి మనల మెడపట్టి గెంతురు 
రాజకీయ మెంత రాక్షసంబు?
2 .ఆ.వె.
ఒకరిమించి ఒకరు ఓట్లు సంపాదించి 
రాష్రమంత దోచి రాణకెక్క 
వోటిమాట జెప్పు వొట్టిచేయి జూపు 
రాజకీయ మెంత రాక్షసంబు? 
3 .ఆ.వె.
చెప్పు మాట యొకటి చేసేది వేరగు 
నాయకులను నమ్మి నాశమవకు 
గొర్రెమంద రీతి గోతిల పడబోకు 
మంచి వారికోటు మరచిపోకు 
4 .ఆ.వె.
ఎన్నిక సరిలేక ఏమి సాధింతుము 
మంచి చెడ్డ భేదమరయకున్న 
ఆశతోడ వారినందల మెక్కించు 
మంచివారి నెన్ను మనకు మేలు 
5.ఆ.వె.
"ఫ్రీ"అనేది కొంత ప్రియముగా వుండును 
తేరగా యెవడును తీసి యివడు 
జెండ చేతికిచ్చు జైకొట్టుమనిచెప్పు 
ఐదువందలిచ్చి అరువు మనును 
6 .ఆ.వె.
పెట్టుబడులనిచ్చు,పెట్రోలు పోయించు 
బైకుమీద ఎక్కి బయలుదేరు 
గొర్రెమందలాగ గోలపెట్టి తుదకు 
ఇష్టమున్న లేక ఇల్లు చేర్చు 
7 .ఆ.వె.
ఎత్తుకొను నొకడిని ఏమార్చునొకడిని 
ముక్కు తుడుచునొకని మురికి కడుగు 
నవ్వులాటకొకని నవ్వించు నొక్కని 
ఎన్నికైన పిదప ఏడిపించు 
8.ఆ.వె.
బట్టలుతుకు నొకడు పట్టి పిండునొకడు 
నీళ్ళరేవు రేపు నీకె యనును 
పట్టపగలు "చుక్క"పట్టించి చూపుచూ 
స్వర్గమునకు సీద సాగనంపు 
9 .ఆ.వె.
లాండ్రి వద్దకేగి లాగించు ఇస్తిరి 
బట్ట కాలబెట్టి బైట పడును 
కొత్తబిచ్చగాడు కొలువులో జేరితే 
పొద్దుమాపు పనుల పేరబెట్టు 
10 .ఆ.వె.
నీచ రాజకీయ నియమాలు పుట్టెను 
ఎదుటివారి ప్రజ్ఞనొప్పుకోరు 
ఎన్ని మాటలన్న ఏమి ఎరగనట్లు 
కౌగిలింత లిచ్చి కలుపుకొనును 

          -------------కోట

Comments