ఒక్కసారి ఆలోచించుకో...!!!
కాలమనే జారుడు బండపై
పుట్టుకతో మొదలు మరణించే దాక
క్షణాలతో జారుడు గుణమే ఈ జీవితం
నిలిచిన నీటి మడుగుగా ఆవిరికాకు...
అన్వేషించు చివరి వరకు...
నీతికి నీరుండదని ఇంకేదో
ఆశకు పుడుతు ఆశయాలను ప్రక్కన
దోసి పులిసిన పూటను దోచుకొంటు...
వాంచల వెల్లువతో రోజులను ఖైదుచేస్తు
భయమెరుగని బతుకుకు మనిషివై
విషనాగుల కోనకు దారి కడుతున్నావు
ఒక్కసారి ఆలోచించుకో...
మరణం మంచిదే ఏ జీవికి తప్పదు
సమీపించిన సమయానికి రూపకర్తవై
ఆచరణ యోగ్యతను ప్రగతిశీల
పుస్తకంగా పది మందితో కలిసి చదువుకో
నీ ఆత్మగౌరవం సంఘమై నిలుస్తుంది...
కళ్ళులేని చీకటి చిత్రానికి
రంగులద్దక మార్పుతో నాగరికతవై...
పొంగిననాడు పాలబువ్వలను కలుపక
లేనినాడు నిస్సాహయతను తాగక...
సమానత్వపు సమీకరణాలతో చరిత్రలు
రాయని ప్రశ్నలకు సమాదానమై నిలుచు
-దేరంగుల భైరవ (కర్నూలు)