పూర్తిగా చదవండి

Comments · 171 Views

పూర్తిగా చదవండి

పూర్తిగా చదవండి

మార్వాడ దేశం లో ఒకప్పుడు ఉన్న కర్మాబాయి అనే మహిళ పూరీ జగన్నాథ స్వామి కి మహాభక్తురాలు. 

ఆమె తన ఐహికమైన బరువుబాధ్యతలు అన్నీ తీరిన తర్వాత పూరీ జగన్నాథ స్వామి క్షేత్రానికి వచ్చి అక్కడే స్థిరనివాసం ఏర్పరుచుకుని ఉండిపోయింది.

నిత్యం స్వామివారి సేవలో నిమగ్నమయిపోయేది. 

ప్రతిరోజూ ఆమె నిద్రలేచి కాలకృత్యాలు అన్నీ తీర్చుకోవడమే ఆలస్యం, అల్లం, ఇంగువ, మరికొన్ని దినుసులతో నెయ్యి, కలిపి చేసే కిచిడీ అనే వంటకాన్ని చేసి స్వామికి నివేదించి దానిని యధాతథంగా ఆలయానికి పంపేది. అక్కడకూడా నివేదనమయ్యాక అర్చకులిచ్చిన ప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకుని తినేది.

క్రమక్రంగా ఆ జగన్నాథుడికి ఆ కిచిడి ఇష్టభోగమయిపోయింది. ముందస్తుగా కర్మాబాయి పంపిన కిచిడీ పూర్తికానిదే మిగిలిన భోగాలేవీ సక్రమంగా అమరేవి కావు.. మెల్లమెల్లగా ఆ రహస్యాన్ని గమనించిన ఆచార్యులు, అర్చకులు స్వామి ఇష్టప్రకారమే నివేదనను కొనసాగించేవారు.

అనతికాలంలోనే ఈ కర్మాబాయి భక్తి గురించి అందరూ గుర్తించసాగారు. ఆ రోజుల్లో జగన్నాథుడికి ఒక బైరాగి గొప్ప భక్తికలవాడు ఉండేవాడు. ఈ బైరాగి పిలిచిన వెంటనే స్వామి పలుకుతాడు అని ప్రతీతి. అటువంటి భక్తుడైన ఆ బైరాగి కర్మాబాయి గురించి విని, ఆమెను కలవాలని తన పూరీ యాత్ర సందర్భముగా అనుకున్నాడు. ఆమెను దర్శించడానికి వెళ్ళాడు.

ఆమె కిచిడీ చేసే పద్ధతి ఆ బైరాగి కి నచ్చలేదు. ఒక మడీ, ఆచారం ఏమీ లేకుండా వండేస్తున్న పద్ధతి నచ్చలేదు. ఆ ఇంట్లోనే వండి, అక్కడే స్వామికి నివేదన చేసి, అదే పదార్థాన్ని జగన్నాథ స్వామి ఆలయానికి పంపడం అతనికి నచ్చలేదు.

ఆ బైరాగి కర్మాబాయి కి ఆచారవ్యవహారాలు బోధించాడు. ఇంట్లో నివేదించిన పదార్థాన్ని అలా గుడికి పంపొద్దు అని చెప్పాడు. మడి కట్టుకుని వంట చేయాలని చెప్పాడు.

అమాయకురాలైన కర్మాబాయి అవన్నీ విని కలవరపడింది. తాను ఇన్నాళ్లూ తప్పు చేసాను అని అనుకుంది. ఆ బైరాగి చెప్పినట్టే పాటిస్తాను అని అనుకుంది.

మరునాడు నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకుని, శుచిగా స్నానం చేసి కొంచెం కిచిడీ చేసి ఇంట్లో స్వామికి నివేదన చేసింది. గుడికి పంపడానికి మడి కట్టుకుని వేరేగా ప్రత్యేక వంటకం చేయడానికి సిద్ధపడుతుంది. సరిగ్గా అప్పుడే ఒక సాధువు ఆమె ఇంటి ముందర నిలబడి , ఆకలికి తాళలేకపోతున్నాను అని, ఏముంటే అది, ఇంత ఆహారం పెట్టమని వేడుకుంటున్నాడు. ఏదో ఒకటి తినకపోతే అక్కడే ప్రాణాలు వదిలేస్తాడేమో అన్నంత దీనంగా ఉన్నాడు ఆ సాధువు.

కర్మాబాయి కి ఏమీ తోచలేదు. గుడికి పంపే వంటకం ఇంకా తయారు కాలేదు. అది గుడికి పంపి అర్చకులు నివేదన చేసి తనకు ప్రసాదంగా పంపితే తప్ప తన ఇంట్లో వంటకూడా చేసుకోని అలవాటున్న ఆ తల్లికి ఏమీ తోచలేదు. ఆలోచిస్తే ఒకటి తట్టింది.

తాను ఇంట్లో చేసిన కిచిడీ, ఇంట్లో స్వామికి నివేదన చేసి అలాగే ఉంచింది. అదెలాగూ గుడికి పంపొద్దు. తాను గుడికి నివేదన పంపి అర్చకులు నివేదన చేసిన తర్వాత వచ్చే ప్రసాదం తప్ప ఏమీ ఇప్పుడు తినదు. కనుక, ఆ కిచిడీ ఆ సాధువు కి పెట్టేస్తే అని అనుకుంది. అలా చేస్తే అతని ఆకలీ తీరుతుంది, ఆ ప్రాణాలూ నిలబడతాయి అని అనుకుంది.

ఆ సాధువు కి ఇంట్లో స్వామికి నివేదన చేసిన కిచిడీ వడ్డించింది. అతనెంతో ఆత్రంగా, ఆప్యాయంగా ఆ కిచిడీ తిని, ఆమెకు కృతజ్ఞతలు చెప్పి, ఆశీర్వదించి వెళ్ళిపోయాడు.

ఆ తరువాత మడి కట్టుకుని, గబగబా జగన్నాథస్వామి ఆలయంలో ఇవ్వాల్సిన వంటను చేసి తానె తీసుకుని ఆలయానికి వెళ్ళింది. అర్చకులు, నిన్న తనకు ఆచారవ్యవహారాలు చెప్పిన బైరాగి తన గురించే ఎదురుచూస్తున్నారు.

ఇంత ఆలస్యం ఏమిటమ్మా అని కించిత్ విసుక్కుని ఆ వంటను తీసుకుని స్వామి కి అడ్డంగా ఉన్న తెర ముందర పెట్టి, తెర తొలిగించారు. ఒక్కసారి అందరూ ఉలిక్కిపడ్డారు.

స్వామి నోటికంతా కిచిడీ అంటుకుని ఉంది. మూతి సరిగ్గా కడుక్కోని చిన్ని పిల్లవాడి ముఖం ఎంత అందంగా ఉంటుందో స్వామి మొఖం అంత అందంగా ఉంది.

ఆ మహిమ కు అందరూ ఆశ్చర్యపోయినా, అలా స్వామి నోటికి ఆహారపదార్థం అలా అంటుకుని ఉండడం అరిష్టం అని భావించారు అర్చకులు. ఆ బైరాగి ని అడిగారు. స్వామి నీవు అడిగితె పలుకుతారు కదా, అసలేమయ్యిందో కనుక్కోండి అని అడిగారు.

సరే అని ఆ బైరాగి స్వామిని అడిగారు. అప్పుడు స్వామి వైపునుండి అదృశ్యవాణి వినిపించసాగింది.

బైరాగీ, నీకు ఒక్కడికే కాదు, ఇక్కడ ఉన్న వారందరికీ చెప్తున్నాను, శ్రద్దగా వినండి. కేవలం భక్తిశ్రద్దలతో పరిశుద్దంతరంగయైన కర్మాబాయి ప్రేమగా పంపే కిచిడీ భోగమంటే నాకు ఇష్టమని మీకు అందరికీ తెలుసు. కానీ, నిన్న నా ఇంకో భక్తుడైన ఈ బైరాగి ఆమె దగ్గరకు వెళ్లి భక్తిశ్రద్దలతో బాటు ఆచారాలు, వ్యవహారాలూ ఇవీ అంటూ నూరిపోశాడు. అంతటితో ఆమె ఇంతవరకు తాను పాటించనవన్నీ అపచారాలు అని అభిప్రాయపడ్డది. భయపడ్డది. దుఃఖించింది. 

తన ఇంట్లో ఉన్న నా మూర్తికి ఎప్పటిలాగే నివేదన చేసి, ఆలయ నిమిత్తం మడి కట్టుకుని మరోసారి వంటకు ఉపక్రమించింది.

దానివల్ల నిత్యం నాకు జరిపే భోగానికి అయిదు ఘడియలు ఆలస్యం అయ్యింది. నేనా ఆలస్యం తో ఆకలికి తాళలేకపోయాను. ఆమె పంపలేదు కనుక మీరు నివేదన జరపలేదు. నాకు భోగం అందలేదు. ఆమె తన ఇంట్లో నా గురించి చేసుకున్న కిచిడీ భోగం ఉండడం వల్ల, అది అంటే నాకు ఎంతో ఇష్టం కావడం వల్ల, ఆమె ఇంటికే వెళ్లి నాకు నివేదించిన భోగాన్నే తిని వచ్చేసాను. మళ్ళీ ఇక్కడ ఆమె తెచ్చే వంటకం నివేదన ఉన్నందువల్ల తొందరలో నా నోరు కడుక్కోవడం మరిచిపోయాను. ఇక మీ ఆచారాల ప్రకారం భోగ నివేదన కానివ్వండి అని వినిపించింది.

ఆ విధంగా వినిపించిన స్వామి వారి అదృశ్యవాణి విని అందరూ ఆశ్చర్యపోయారు. అర్చకులు స్వామి ఆదేశాలప్రకారం మంత్రపూర్వకంగా భోగ నివేదన జరిపించారు.

కర్మాబాయి మాత్రం స్వామి వారు తన పై చూపిన కరుణకు ఆనందంతో సుడులు తిరిగిపోయింది. అంతటి పరిశుద్దాత్మురాలికి ఆచారవ్యవహారాలు నేర్పబోయిన తన అవివేకానికి ఆ బైరాగి సిగ్గుపడిపోయాడు. అయితే, తాను పాటిస్తున్న అచారాలన్నీ వృధానా అని అనుకున్నాడు. 

వెంటనే జగన్నాథుడు జవాబు ఇచ్చాడు ఆ బైరాగికి. అమాయకుడా, మనసు నాయందు లగ్నం కావడం కోసమే ఆ అచారాలన్నీ అవసరమే. కానీ, ఎవరి మనసు సర్వం జగన్నాథం అని నాకే అర్పితమయ్యిందో, వాళ్లకు ఆచారవ్యవహారాలతో నిమిత్తం లేదు. నాకామె జరిపే భోగాన్ని నేను అమృతపాయంగా స్వీకరిస్తుంటే మా ఇద్దరి మధ్యలో మడి బట్టలు ఎందుకయ్యా అని. అంతే కాదు, ఆచారవ్యవహారాలు తెలిసిన వారు, ఆ ప్రకారమే చేయాలి, అప్పుడు కూడా భక్తి శ్రద్ధ విశ్వాసాలే ముఖ్యం. నాకు నివేదించేవి నేను ఆరగించాలనే కోరిక కలిగి ఉండాలి. ఆచారవ్యవహారాలు తెలియని వారైనా సరే భక్తి శ్రద్ధ విశ్వాసాలతో నేను ఆరగించాలనే కోరికతో నివేదించే వాటిని నేను తప్పక స్వీకరిస్తాను.

బైరాగి సిగ్గుపడ్డాడు. కర్మాబాయి కి క్షమాపణ చెప్పుకున్నాడు. స్వామి అతనిని క్షమించాడు. భగవంతుని ఆజ్ఞ ప్రకారం కర్మాబాయి తన జీవితాంతం స్వామి నివేదనకు భోగం పంపించేది. 

ఆ నాడే కాదు, ఈ నాడు కూడా, ఇప్పటికీ కూడా, కర్మాబాయి జ్ఞాపకార్థం జగన్నాథుని గుడిలో స్వామి భోగాలలో కిచిడీ భోగం బంగారు పళ్లెంలో ఉంచి భోగం జరుపుతారు. 

ఎంత పావనమైన విషయం కదా...

మనం త్రికరణశుద్ధిగా భగవంతుడిని మనసులో నిలుపుకొని స్వామికి రోజూ ఇంత వంటకాన్ని నివేదన చేస్తే, స్వామి స్వీకరిస్తాడు.

జై జగన్నాథ

(సేకరణ)

Comments