జ్ఞాపకాల సిరులు - ఆదిత్య శివశంకర కలకొండ

Comments · 263 Views

జ్ఞాపకాల సిరులు - ఆదిత్య శివశంకర కలకొండ

జ్ఞాపకాల సిరులు

తొలకరి చినుకుల అలికిడిలో
తడిసిన మట్టిన మొలిచిన మొక్కకు
ఆయువునిచ్చిన వానజల్లుతో
కుదిరిన చెలిమొక జ్ఞాపకం..

పండు వెన్నెలను పిండి పోసిన
జాబిలి నక్కిన మబ్బుల మాటున
శరత్ చంద్రుని దాగుడు మూతలు
చీకటి మెచ్చిన జ్ఞాపకం...

మంచు తెరలలో కంచె దాటుకుని
జొన్న మేసెడి లేగ దూడని
ఉరకలెత్తుతూ ఊరుదాటించు
పసి ప్రాయమొక జ్ఞాపకం...

గొబ్బెమ్మలకు ముగ్గులు పెడుతూ
రథ చక్రాలకు రంగులద్దుతూ
చిమ్మ చీకటిని కమ్మిన చలిలో
మకర సంక్రాంతి మధుర జ్ఞాపకం...

భగభగ మండెడి భానుడి మంటకి
విలవిలలాడే మొక్కల ప్రాణపు
విలువలు తెలిపిన వర్షపు జల్లుకు
గ్రీష్మ ఋతువు ఒక చక్కటి జ్ఞాపకం...

మోడు బారిన చెట్టు కొమ్మన
చిగురించిన చిగురాకు సందున
పూల రెక్కపై వాలిన తుమ్మెద
వసంత గానమొక తీయటి జ్ఞాపకం..

- ఆదిత్య శివశంకర కలకొండ

Comments