మంచి జ్ఞాపకాలు
ఈ రోజు చాలా మంచి రోజు. ఒక అమ్మాయికి సేవ చేసే అవకాశం నాకు లభించింది. కేంద్ర ప్రభుత్వం టీచర్ ఎంట్రెన్స్ టెస్టు పరీక్షలు నిర్వహించింది. మా స్కూలులో ఆ పరీక్షల సెంటర్ పడింది. అందులో
ఒక అమ్మాయికి కళ్ళు కనపడవు. అయినా చాలా పట్టుదలగా వచ్చింది. ఆమె పట్టుదల చూసి నాకు చాలా ముచ్చటగా అనిపించింది.
ఆమె ప్రశ్నాపత్రం చదవలేదు కనుక మా ప్రిన్సిపాల్ గారు పరీక్ష ప్రశ్నాపత్రం చదివి ఆమెకు వినిపించి ఆమె చెప్పే జవాబులు ఓ.ఎమ్. ఆర్ షీటులో వ్రాయమని చెప్పారు. ఉదయం రెండున్నర గంటలు. మధ్యాహ్నం కూడా రెండున్నర గంటలు పరీక్ష. కళ్ళు కనపడవు కాబట్టి ఆమెకు మరో నలభై నిమిషాలు అదనపు సమయం ఇస్తారు. మొత్తానికి ఉదయం, మధ్యాహ్నం ఆమెకు ప్రశ్నా పత్రం చదివి వినిపించి ఆమె చెప్పిన జవాబులను వ్రాసాను.
చాలా సమయం పట్టింది. చాలా శ్రమ పడ్డాను. అయినా ఏదో తృప్తి కలిగింది. మంచి పని చేసాననే ఆనందం నా మనసంతా నిండింది. ఆ సంఘటన మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుంది. సినిమాల్లో అలాంటి సన్నివేశాలు చూసాను. నిజ జీవితంలో నాకు అలాంటి అనుభవం ఎదురైంది.
- వెంకట భానుప్రసాద్ చలసాని