యోధ ఎపిసోడ్ 10 - భరద్వాజ్

Comments · 212 Views

యోధ ఎపిసోడ్ 10 - భరద్వాజ్

యోధ ఎపిసోడ్ 10

శుక్రవారం.. ఎప్పటిలానే ఆ రోజు కూడా తెల్లారింది. ప్రతిరోజూలా ఈ సారి, బయట గడియారం శబ్ధం కాకుండా... బయట నుండి తన రూం డోర్ ఎవరో కొడుతున్నట్టు "డబా.. డబా.." మంటూ ఒకటే శబ్ధం. ఆ శబ్ధం దాటికి లేచి, డోర్ తీశాడు పార్ధు. ఎదురుగా విశాల్, కృతి కొంచెం కంగారుగా, మరింత భయంగా ఉన్నారు. ఒకరకమైన ఆందోళన వాళ్ల మొహాల్లో కనిపించింది పార్ధుకు కృతి

"గ... గ.... గౌతం కూడా... పార్ధు వైపు చూస్తూ, చెమటలు పడుతున్న మొహంతో, తన వేలిని గౌతం రూం వైపు చూపిస్తూ తడబడుతున్న స్వరంతో అంటుంది.

వెంటనే పార్ధు... విశాల్ వంక చూడగా, తను కూడా నిరాశగా, మరింత బాధగా తన తలని కిందికి దించుకుని, నేల చూపులు చూస్తున్నాడు. పార్ధుకి సీన్ అర్థమైంది. వాళ్ళని లోపలికి పిలిచి, ఆ రూం డోర్ నీ క్లోజ్ చేసేస్తాడు.

"అసలు నిన్న ఏమైంది? మేము (పార్ధు, విశాల్) మా రూమ్స్ లో కి వెళ్ళిన తర్వాత మీరు కింద ఏం చేశారు?  నిన్ను, గౌతం నీ ఎంతగా పిలిచినా... మా రూం డోర్స్ లాక్ అయ్యాయి, తియ్యమని ఎంత అరిచినా మీ ఇద్దరి దగ్గర కనీస స్పందన లేదు!" అంటూ అంతకుముందు రోజు జరిగిన పరిణామాలు గురించి వివరించి, కింద అసలేం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు పార్ధు.

దానికి బదులుగా...

"మీరు వెళ్ళిన కాసేపటికే, నేను స్పృహ కోల్పోయి పడిపోయాను. తర్వాత కళ్ళు తెరిచి చూస్తే నా రూంలో... కొద్దిసేపటి క్రితమే మెలుకవ వచ్చి, భయంతో డోర్ తీసుకుని బయటకి వస్తె, ఇదిగో విశాల్ కనిపించాడు. ఇద్దరం వెళ్లి గౌతం రూంలో తన గురించి చూసాం, తనెక్కడా కనిపించలేదు. మిగిలిన వారి రూమ్స్ క్లోజ్ చేసి ఉన్నాయి. అందుకే, నీ రూం డోర్ తట్టి, నిన్ను లేపాం" అంటూ కృతి వివరిస్తుంది.

(తనలో ఆత్మ ప్రవేశించి, అది గౌతమ్ ని ముప్పు తిప్పలు పెట్టిందన్న విషయం ఏ మాత్రం తెలీదు కృతికి)

ఆ రూంలోనే వాళ్ళు చాలా సేపు అలా డోర్ క్లోజ్ చేసి, ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు. అప్పటీకే గడిచిన నాలుగు రోజుల్లో నలుగురు స్నేహితులను పోగొట్టుకున్న వాళ్ల హృదయాలు బాధతో నిండి, వారి నోటి నుండి కనీసం మాటలు కూడా రావడం లేదు. "ఈ రోజు ఎవరు బలి కాబోతున్నారన్న ఆందోళనా ఉంది వారిలో..."

అలా చాలా సమయం గడిచిన తర్వాత, బయట నుండి ఏవేవో వింత వింత శబ్దాలు వినిపిస్తున్నాయి వాళ్ళకి. అవేం పట్టించుకోకుండా ధైర్యంగా ఉండమని పార్ధు చెప్తున్నా... అప్పటికే భయపడుతున్న కృతి, ఆ శబ్దాల దాటికి మరింత భయంతో వణికిపోతుంది. ఆ భయం, బాధ రూపంలో తనకి తెలియకుండానే బయటపడుతుంది. ఇక లాభం లేదనుకున్న విశాల్..

"ఒకసారి నేను కిందకి వెళ్లి చూసి వస్తా!" అంటూ అక్కడి నుండి కిందకి వెళ్లబోతుంటే, మరింత భయంతో విశాల్ చేతిని పట్టుకుని వెళ్లొద్దు అన్నట్టు తనని ఆపే ప్రయత్నం చేసింది కృతి. అదంతా గమనిస్తున్న పార్ధు...

"నువ్విక్కడే కృతికి తోడుగా ఉండు, నేను వెళ్ళొస్తా?" అంటూ తను కూడా ఒకింత భయంతోనే కిందకి వెళ్ళాడు. అలా కిందికి వెళ్ళిన పార్ధు... ఎంతసేపైనా రావడం లేదు. వీరిద్దరిలో ఆందోళన మొదలయింది. ఆ రూం నుండే

"పార్ధు... పార్ధు..." అంటూ పార్ధుని గట్టిగా పిలుస్తున్నాడు విశాల్...

కానీ, పార్ధు నుండి నో రెస్పాన్స్... అలా పిలుచుకుంటూ వాళ్ళిద్దరూ ఆ రూం మెయిన్ డోర్ దగ్గరికి చేరుకునే లోపు...

"విశాల్... విశాల్... నన్ను రక్షించు... ఈ పిశాచి నన్ను చంపేస్తుంది...!" అంటూ పెద్ద పెద్ద అరుపులు, ఆర్తనాదాలు చేస్తూ కింద హల్ లోనుండి పార్ధు వాయిస్ వినిపించింది వాళ్ళకి. ఆ పార్ధు అరుపులతో కంగారు పడ్డ విశాల్, కృతి ఒక్కసారిగా పరుగు పరుగున కిందకి వెళ్ళారు. కింద హాల్లో పార్ధుని చూసి, తన దగ్గరికి వెళ్ళి...

"నీకేం కాలేదు కదా! ఏది ఎక్కడది? ఆ పిశాచి ఎక్కడ..!" అంటూ గర్జిస్తూ తనని ప్రశ్నించసాగాడు విశాల్. వాళ్లిద్దరి వంక వింతగా చూస్తూ...

"అసలు నాకేమైంది? మీరిద్దరూ కిందకి ఎందుకు వచ్చారు? మొహం నిండా ఆ చెమటలు ఏంటి?" అంటూ వాళ్ళని తిరిగి ప్రశ్నించాడు పార్ధు... దీంతో ఆశ్చర్యపోయిన విశాల్, కృతి...

"అదేంటి, నువ్వేగా రక్షించండి..! రక్షించండి..!! అని అరిచావ్... అందుకే, ఇంత కంగారుగా మేము కిందకి వచ్చాము" అంటూ బదులిచ్చాడు విశాల్...

కృతి కూడా అవునన్నట్టే తలాడించింది.

"సరిగ్గా నేను కూడా ఇలానే ఏవేవో వింత శబ్దాలు వినిపిస్తున్నాయని కిందికి వచ్చానా, తీరా ఇక్కడికి వచ్చాకా అవి వినిపించడం మానేశాయి... " అంటూ పార్ధు అంటుంటే, విశాల్, కృతి మొహాల్లో భయం తారాస్థాయికి చేరింది. వాళ్ళతో పాటు పార్ధుకి కూడా ... ఇక అక్కడ ఎక్కువ సేపు ఉండకుండా అక్కడి నుండి పైకి, అదే పార్ధు రూంకి వచ్చేశారు వారంతా..!

రాగానే, ఎప్పటిలానే ఆ మధ్యాహ్నం కూడా ఆ రూం అంతా ఎవరో వండి పెట్టినట్టుగా అనేక రకాలతో కూడిన పరమాన్నాలు వాళ్ళకి దర్శనమిచ్చాయి. ఈ సారి ముగ్గురికి కలిపి తయారు చేసినట్లుగా ఉంది ఆ రూంలోనే... అది చూసి ఎప్పటిలానే ఆశ్చర్యపోయారు వారంతా...

"ఇదంతా ఏంటి అసలు...? అసలు ఇవన్నీ ఎవరు తెచ్చిపెడుతున్నారు...? పైగా ఇప్పుడే ప్రిపేర్ చేసినట్టుగా చాలా ఫ్రెష్ గా ఉన్నాయి అంతా " అంటూ గట్టిగా విశాల్ అంటుంటే, విశాల్, కృతిల వైపు ఆశ్చర్యంగా చూస్తూ...

"మీరు ఇక్కడ మరొక్క విషయం గమనించారా?" అంటూ వాళ్ళని ప్రశ్నిస్తాడు పార్ధు..

"ఏంటి ..?" అన్నట్టు వాళ్ళు కూడా పార్ధు వంక మరింత ఆతృతగా చూస్తారు, ఆ విషయం ఏమైయుంటుందాని

"మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతిరోజూ మన మన రూమ్స్ లలో అనేక రకాల వంటకాలతో ఆహారం మనకి అందుబాటులో ఉంటున్నా, మనం ఏ రోజు కూడా దాన్ని తీసుకోకపోవడం... ఇక్కడికి వచ్చి, ఇన్ని రోజులవుతున్నా... ఒక్కసారి కూడా మనం అసలు ఆహారం తీసుకోకపోయినా... ఏమాత్రం వీక్ అవ్వకుండా ఇంకా ఇంత స్టెబుల్ గా ఉండడం. ఇది సాధ్యమంటారా?" అంటూ తనకు కలిగిన సందేహాన్ని బయటపెడతాడు పార్ధు.

అప్పటివరకూ... అక్కడ జరుగుతున్న పరిణామాలలో మాత్రమే నిమగ్నమై, తమ ఆకలి గురించి మైమర్చిపోయిన వారు.. పార్ధు ఒక్కసారిగా అది గుర్తుచేయగానే, అక్కడ జరుగుతున్న ఆ మాయలకు షాక్ తిన్నారు. విశాల్ అయితే, ఇప్పటివరకూ అసలేం తీసుకోకుండానే తన కడుపు ఎలా నిండిందంటూ తన పొట్ట తడిమిచూసుకుంటున్నాడు...

అప్పటికే భయంతో కొట్టుమిట్టాడుతున్న కృతి ఆ దెబ్బతో స్పృహతప్పి పడిపోయింది. విశాల్, పార్ధు... ఈ సారి అంటే ఈ రోజు ఆ పిశాచి టార్గెట్ కృతి అని నిశ్చించుకొన్నారు. (ఎందుకంటే, గత ముందు రోజులుగా మాయమైన వాళ్ళందరూ... ముందు అలా స్పృహ తప్పి పడిపోయిన వాళ్ళే కావడం!) దాంతో చిన్న గాలి కూడా లోపలికి రాకుండా వాళ్ల రూం డోర్ క్లోజ్ చేసేసి, కృతిని బెడ్ పై పడుకోబెట్టి, వాళ్ళిద్దరూ (పార్ధు, విశాల్) తనకి కాపలా... అక్కడే సపర్యలు చేస్తూ తన వద్దే ఉన్నారు.

దాదాపు చీకటి పడుతుంది. ఎంతసేపైనా కృతికి ఇంకా మెలుకువ రావడం లేదు. కింద హల్ నుండి మళ్ళీ వింత వింత శబ్దాలు రావడం మొదలయ్యాయి. వాళ్ళిద్దరికీ అవి వినిపిస్తున్నా, వాళ్ళు మాత్రం కదలకుండా ఒకరికి ఒకరు తోడుగా అక్కడే ఉన్నారు. ఆ అరుపులు వారిని ఎంత రెచ్చగొడుతున్నా, వాళ్ళు మాత్రం మొక్కవోని పట్టుదలతో కదలకుండా అక్కడే ఉండిపోయారు.

ఇంతలో... గౌతం వాయిస్ తో వాళ్ళని పిలవడం మొదలుపెట్టింది ఆ వాయిస్.

"విశాల్... పార్ధు... ఎక్కడున్నారు..? నన్ను రక్షించండి..? ప్లీజ్...ప్లీజ్ .." అంటూ వేడుకుంటుంది

ఒక పక్క పార్ధు... అదంతా ఆ పిశాచి ఆడుతున్న నాటకమంటూ విశాల్ కి నచ్చ చెప్తున్నాడు. ఇంకా గౌతం వాయిస్ తోనే

"విశాల్... పార్ధు... ఎక్కడున్నారు..? నన్ను రక్షించండి..? ప్లీజ్...ప్లీజ్ .." అంటూ మళ్ళీ మళ్ళీ పిలుస్తుంది వాళ్ళని... దీంతో చిర్రెత్తిన విశాల్..

"నువ్విక్కడే ఉండు పార్ధు..! నేనెల్లి దాని సంగతి చూస్తా!" అంటూ ఆవేశంగా బయలుదేరాడు అక్కడి నుండి, మరొకపక్క "అదంతా ఆ పిశాచి వేస్తున్న ప్లాన్!" అంటూ పార్ధు ఎంత నచ్చ చెప్పినా వినకుండా... అలా వెళ్లిన విశాల్ ఎంత సేపటికీ రావడం లేదు...

బయట నుండి శబ్దాలు కూడా ఏం వినపించడం లేదు... పార్థుకి కంగారు పుట్టుకొస్తుంది. విశాల్ కి ఏమైందోననే ఆందోళన తనలో మొదలైంది. పోనీ వెళ్లి చూద్దాం అంటే, ఇక్కడ కృతి ఒక్కత్తే ఉంది. ఆ పిశాచి ఈ వంకతో తనని ఏమైనా చేస్తుందనే భయం తనకి. తన పరిస్థితి ఎలా మారిదంటే,

"ముందు నుయ్యి... వెనక గొయ్యి..." అన్నట్టు.

"విశాల్... విశాల్... అంటూ పిలుచుకుంటూ తన మెయిన్ డోర్ ఓపెన్ చేసాడు పార్ధు. అలా డోర్ ఓపెన్ చేయగానే ఒక్కసారిగా అకారణంగా బయట నుండి వచ్చిన పొగ, ఆ రూం అంతా ఆవరించింది. ఆ పొగ లో తనకేం కనిపించడం లేదు. ఊపిరి సలపక స్పృహ కోల్పోయాడు పార్ధు కూడా...

************

"విశ్శూ.. విశ్శూ...! విశ్శూ.. విశ్శూ...!! " అంటూ ఒక ఆడ గొంతుకతో వినిపిస్తున్న శబ్దాల దాటికి అప్పుడే ఉలిక్కిపడి లేచాడు విశాల్...

చుట్టూ చూస్తుంటే, అంతా చీకటిమయం. తన కళ్ళు తనకి సరిగా కనిపించడం లేదనుకుని, వాటిని తన చేతులతో నలుపుకుంటూ మరొక్కసారి చుట్టూ చూసాడు. అలా ఎంత చూసినా, తన చుట్టూ ఆ చీకటి వాతావరణమే తప్ప మరేం కనిపించడం లేదు. మరొకపక్క...

"విశ్శూ.. విశ్శూ...! లే విశ్శూ.. లే...!!" అంటూ ఆ అజ్ఞాత స్వరం ఇంకా తనని పిలుస్తూనే ఉంది. తేరుకున్న విశాల్...

"ఎవరు నువ్వు..? నీకేం కావాలి..? నేనెక్కడున్నాను..?" అంటూ ప్రశ్నిస్తూ ... 

"పార్ధు...! పార్ధు..!! కృతి...! కృతి...!!" అంటూ తన స్నేహితులను పిలుస్తున్నాడు కొంచెం భయం భయంతో కూడిన స్వరంతో... 

"కంగారు పడకు విశ్శూ... నువ్వెంత పిలిచినా, మరింతగా అరిచినా వాళ్లేం రారులే! అంటుంది ఆ అజ్ఞాత స్వరంతో కూడిన వ్యక్తి.

"అసలేవరే నువ్వు..! నీకేం కావాలి...! నా ప్రాణాలా... ఇవిగో తీసుకో ..! ఇంకెందుకు ఆలస్యం!" అంటూ కోపోద్రిక్తుడైయ్యాడు విశాల్...

"ఎందుకంత కోపం విశ్శూ... నీ ప్రాణాలు అంత తేలిగ్గా ఎలా పోనిస్తాను? నువు చచ్చే ముందు, కనీసం నువ్ చేసిన తప్పేంటో తెలుసుకోవాలిగా?" అంటూ ఆ అజ్ఞాత స్వరం అంటుంటే

"నేనేం తప్పు చేశానే..? ఎవరే నువ్వు...? బయటకి వస్తావా..? రావా ? నీకు దైర్యముంటే నా ముందుకి రావే? ఇంతమందిని బలితీసుకున్న నీ అంతు తేలుస్తాను!" అంటూ నిలదీస్తూ తనపైనున్న ఆ కోపాన్ని బయటపెడతాడు విశాల్.

"నన్ను నువ్వు ఇంకా గుర్తుపట్టలేదా? నేను ఎదురుగా నిలబడితే, నా అంతు నువు తేల్చడం కాదు, నా వంక చూడడానికి కూడా భయపడతావ్ నువ్వు? అంటూ విశాల్ సహనాన్ని పరీక్షిస్తుంది ఆ కనిపించని ఆత్మ.

విస్తుపోయిన విశాల్...

"హేయ్... నీ గాంభీర్యాన్ని పక్కన బెట్టి ముందు నా ముందుకు రా..?" అంటూ తనని రెచ్చగొడతాడు విశాల్.

దాంతో తనకి తానే ఒక వెలుగుని సృష్టించి, ఆ వెలుగులో ప్రత్యక్షమవుతుంది ఆ ఆత్మ హాఫ్ శారీలో, సిగ్గుపడుతూ, నెల చూపులు చూస్తూ లక్షణమైన కట్టూ బొట్టు తో పద్ధతిగా నిండైన రూపంలో, పదహారణాల అచ్చతెలుగమ్మాయిలా, మహాలక్ష్మిలా దర్శనమిస్తూ... 

"ఇప్పటికైనా గుర్తుపట్టావా విశ్శూ..!" అంటూ విశాల్ వంక చూస్తూ తనలా అడుగుతుంటే, తనని అలా చూస్తూన్న విశాల్ కి కాళ్ళు చేతులు ఆడడం లేదు. అలానే చూస్తూ ...

"ను... ను... నువు..." అంటుంటే 

"నేనే .. నేనే... నీ రాధని విశ్శూ..!" అంటూ దించిన తన తలను పైకెత్తి,

"చెప్పాగా... నా రూపం చూస్తే నీకు మాట కూడా రాదని" విశాల్ వంక చూస్తూ బదులిచ్చింది ఆ రాధ రూపంలోనున్న ఆత్మ!.

"ను... ను... నువు... ఇక్కడికెలా వచ్చావ్!" అంటూ భయంతో కూడిన స్వరంతో విశాల్ ప్రశ్నిస్తుంటే,

"నేనెప్పుడో మాటిచ్చాను కదా ! నీకోసం ఏడు సముద్రాలు దాటైనా వస్తానని... అలాగే ఇంట్లో వాళ్ళని కాదని నీకోసం వస్తే, నువ్వే మీ ఇంటి గడప కూడా దాటి రాలేకపోయావ్..!" అంటూ బదులిచ్చి గతాన్ని వివరిస్తుంది రాధ (అదే ఆ ఆత్మ)

***********

విశాల్, రాధ ఇద్దరూ ఆ మెడికల్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం మొదటి నుండి ప్రేమలో ఉంటారు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి అమితమైన ఇష్టం. వాళ్ళదొక మూగ ప్రేమ. అందుకే, వాళ్ల విషయం కాలేజిలో ఎవరికి తెలీదు. విశాల్ క్లోజ్ ఫ్రెండ్స్ కి కూడా వాళ్ల విషయం తెలీదు. అలా వాళ్ల ప్రేమ రెండు సంవత్సరాలు ఏ గొడవలు, కొట్లాటలు లేకుండా సాఫీగానే సాగింది. సరిగా అప్పుడే వచ్చింది కృతి, విశాల్ లైఫ్ లోకి. అప్పటికే కృతి, విశాల్ కి ఒక మంచి ఫ్రండ్ మాత్రమే. (ఆల్రెడీ మొదటి పార్ట్లో చెప్పాగా పార్ధు.. అవేష్... గోపాల్... విశాల్... గౌతమి...ప్రియ... కృతి అందరూ మంచి ఫ్రెండ్స్ అని.)

కృతి కూడా విశాల్ ని ఇష్టపడుతుంది. అదే విషయం విశాల్ కి కూడా ఒకానొక సందర్భంలో చెప్పింది కృతి. ఒకపక్క రాధతో ప్రేమాయణం కొనసాగిస్తూనే, కృతి కూడా ప్రేమకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు విశాల్. ఇందులో కొసమెరుపు ఏంటంటే, విశాల్.., రాధ ప్రేమలో ఉన్నట్టు కృతికి ముందే తెలుసు... అది తెలిసి కూడా విశాల్ తనకే దక్కాలన్న స్వార్థం కృతిది.  మరొకవైపు, విశాల్ రెండేళ్లుగా రాధతో ప్రేమను సాగిస్తూ... కృతి కి ఒకే చెప్పడానికి కారణం...

కృతి తన క్యాస్ట్ అమ్మాయి, పైగా సంపన్న కుటుంబం నుండి వచ్చినమ్మాయి. దానికి తోడు రాధ వేరే కులానికి సంబంధించిన అమ్మాయి కావడం, ఇంట్లో ఒప్పుకోరనే భయం. అందులో తానొక మధ్య తరగతి అమ్మాయి అవ్వడం. విశాల్ స్వార్థ పూరిత ఆలోచనలకు తెరలేపింది. ఇంకోపక్క కృతి, విశాల్ ప్రేమలో ఉన్నట్టు కాలేజ్ అంతా కోడై కూస్తుంది. అది కాస్తా రాధ చెవిన పడడంతో రాధ కొంచెం కంగారు పడినప్పటికీ, వాటిని పెద్దగా నమ్మలేదు. కారణం విశాల్ మీద, అంతకు మించి తన ప్రేమ మీద తనకున్న నమ్మకం. పైగా ఎవరైనా ఇద్దరూ ఆడ మగ క్లోజ్ గా ఉంటే కాలేజ్ లో ఇలాంటి రూమర్స్ సహజమని తనకి తెలుసు..

ఈ మాత్రం దానికి, విశాల్ ని దీని గురించి అడిగితే తను తప్పుగా అనుకుంటాడనే భయం రాధలో... అందుకే వాటిని పెద్దగా పట్టించుకోలేదు రాధ. ఇదిలా ఉండగా, రోజు రోజుకీ వారి (విశాల్, కృతి) గురించి కాలేజ్ అంతా ఎక్కువగా టాక్ వినిపిస్తుంది. దానికి తోడు విశాల్, కృతి మధ్య చనువు మరింత పెరిగింది. రాధకు విశాల్ కి మధ్య దూరం పెరుగుతుంది.

ఇంత జరుగుతుంటే ఉండబట్టలేని రాధ, తన ప్రేమ వ్యవహారం గురించి, తనతో పెళ్లి గురించి, కృతితో చనువు గురించి... ఒకరోజు విశాల్ ని అడిగేసింది. దాంతో విశాల్

"కృతి జస్ట్ ఫ్రండ్ మాత్రమేనని బుఖాయించాడు... రాధతో పెళ్లి గురించి తడబడుతూ... తను(రాధ) వేరే కులానికి సంబంచినది కావడంతో ఇప్పుడే ఈ ప్రేమ వ్యవహారం గురించి ఇంట్లో చెప్తే ఒప్పుకోరని, ఇద్దరం చదువు పూర్తి చేసి, మంచి ఉద్యోగాల్లో స్థిర పడ్డాక చూద్దాం"

అనేసరికి, ఆ రెండేళ్ల తమ పరిచయంలో ఎప్పుడూ కులం గురించి లేవనెత్తని విశాల్... దాని గురించి సడెన్ గా లేవనెత్తుతూ... వాళ్ల ప్రేమ, పెళ్లి గురించి దాటవేస్తూ వచ్చేసరికి రాధలో భయం, అనుమానం స్టార్ట్ అయ్యాయి.

"అదేం కుదరదు... ఇప్పటికే నేను ఇంట్లో మన విషయం చెప్పేశాను... వాళ్లు ఒప్పుకోలేదు... రేపటి నుండి కాలేజ్ కూడా వెళ్లొద్దు అంటున్నారు... నువ్వుకూడా మీ ఇంట్లో చెప్పు! ఒప్పుకోకపోతే ఇద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోయి ప్రశాంతంగా బ్రతుకుదాం!" అంటూ విశాల్ నీ ఒప్పించే ప్రయత్నం చేసింది.

"అది కాదు.. ఇది కాదు" అంటూ విశాల్ రాధ కెంత నచ్ఛ చెప్పే ప్రయత్నం చేసినా రాధ వినలేదు సరికదా!

"నువ్వు లేకపోతే, నా చావుకి నువ్వే కారణం అంటూ ఓ లేఖ రాసి చచ్చిపోతానంటూ" బెదిరించింది విశాల్ ని.

దీంతో తన బెదిరింపులకు భయపడిన విశాల్, తనకి లొంగినట్టు నటించి, తనని ఎలాగైనా వదిలించుకోవాలనే కుయుక్తులు పన్నాడు విశాల్...

"ఇద్దరం నువ్వున్నట్టు ఎక్కడికైనా వెళ్లి సుఖంగా బ్రతుకుదామని, రేపు నైట్ ఎవరికి తెలీకుండా రైల్వే స్టేషన్ లో మీట్ అవుదామని, అక్కడి నుండి దూరంగా ఎక్కడికైనా వెల్లిపోదామని, లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని రమ్మని చెప్పాడు" విశాల్ రాధతో....

అదంతా పిచ్చిదానిలా నమ్మిన రాధ, విశాల్ చెప్పినట్టుగానే తన ఇంట్లో వాళ్ళని కాదని, స్టేషన్ కి వచ్చింది. అలా ఆ నైట్ అంతా విశాల్ కోసం ఎదురుచూసిన రాధకి, విశాల్ నుండి కనీసం రెస్పాన్స్ కూడా లేదు. పొద్దెక్కినా ఇంకా ఆ స్టేషన్ లోనే ఉండిపోయిన రాధ, అప్పటికే వెతుక్కుంటూ వచ్చిన వాళ్ల తండ్రి కంట పడింది. అసలే పరువు, ప్రతిష్టలకు విలువలనిస్తూ, కులానికి పెద్ద పీట వేస్తూ... రాక్షస బుద్ధి కలిగిన రాధ తండ్రి, కూతురు అలా లేచిపోయి తన కుటుంబ పరువు తీసిందనే పట్టరాని కోపంతో తనని అక్కడి నుండి ఈడ్చుకుంటూ, తన్నుకుంటూ ఇంటికి తీసుకెళ్ళాడు. చదువు మాన్పించి, మరుసటి రోజే తనకి ఇష్టం లేని పెళ్లి చెయ్యాలని చూసాడు.

మరొక పక్క విశాల్ చేసిన మోసానికి అప్పటికే మనసు ముక్కలైన రాధ, ఈ ఘటనలతో సూసైడ్ చేసుకుని చనిపోయింది.

***********

"ఇప్పుడు తెలిసిందా నీ తప్పు..?" అంటూ ఆ ఆత్మ విశాల్ ని హెచ్చరిస్తుంది.

"తప్పైంది...! తప్పైంది...!! నన్ను క్షమించు...! నన్ను వదిలేయ్....!!"అంటూ విశాల్ రాధని ఎంత మొత్తుకున్నా రాధ కనికరించలేదు...

"తప్పైందా..? అలా మోసం చేయడం తప్పుకదూ..! నీలాంటి మృగాన్ని ఊరికే వదలకూడదు"

అంటూ అప్పటి వరకూ ఉన్న తన సౌందర్యవంత రూపాన్ని మార్చుకుంటూ... విరబూసిన కురులతో, కళ్ళు పెద్దవి చేసి, ఎరుపెక్కిన కళ్ళతో, నములుతున్న పళ్ళతో, బూడిద రంగులోకి మారిన మొహంతో పగల బడి నవ్వుతూ... 

"నీలాంటి నీచులని ఊరికే వదలదు రా..! ఈ యోధ...!! మరణదండనే నీకు ఈ యోధ విధించే అసలైన శిక్షా..!" అంటూ విశాల్ గొంతు నులిమి దారుణంగా చంపేస్తుంది ఆ ఆత్మ.

ఇంకా ఆ మిగిలిన ఇద్దరిని కూడా ఆ దెయ్యం బలితీసుకుంటుందా?

లేక వాళ్లు బయట పడే మార్గమేమైనా ఉంటుందా?

అసలు ఈ యోధ కథేంటి?

యోగికి సంబంధమేమిటి?

చనిపోయిన వారి శరీరాలన్నీ ఏమైనట్టు?

లాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే, మిగిలిన భాగాలు అసలు మిస్ కాకండి. "యోధ (ఓ ఆత్మ ఘోష)" ఇంకా కొనసాగుతోంది. తర్వాతి భాగం

"యోధ (ఓ ఆత్మ ఘోష)-11" లో కొనసాగిస్తాను..

- భరద్వాజ్

Comments