పిల్లలు -భవ్యచారు

Comments · 211 Views

పిల్లలు -భవ్యచారు

పిల్లలు

ఒక కుటుంబం లో భార్యా,భర్త ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ ను తల్లిదండ్రులు ప్రతి విషయం లో పక్కింటి వారి తోనో లేదా ఇంట్లో ఉన్న అన్నతోని పోలుస్తూ ఉంటారు. ఒక తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు అయినా ఒకరు బాగా చదవవచ్చు, మరొకరు ఒక మోస్తరు గా చదవవచ్చు. అలాంటప్పుడు తల్లిదండ్రులు తోడబుట్టిన వారినే చూపిస్తూ మరొకరిని వాడిని చూస్తూ నేర్చుకోరా అంటూ దెప్పి పొడుస్తూ ఉంటారు.

అప్పటి నుండి వారి మనసులో ఒక ఆత్మన్యూనత భావం పెరిగి పోతూ ఉంటుంది. తల్లిదండ్రుల మనసులో కూడా పెద్దోడు బాగా చదువుతాడు.చిన్నోడు వేస్ట్ అనే భావం తో పెద్దొడికి అడిగింది కొనిస్తూ , చిన్నవాడిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అప్పుడా పనల్సి మనసులో నేను ఎందుకు పనికి రానా అంటూ మనసులో బాధ పడుతూ ఉంటారు.

ఒక్కోసారి చిన్నవాడు సరిగ్గా చదవడం లేదని హాస్టల్ లో వేస్తూ ఉంటారు. ఆ సమయం లో కొందరు మెంటల్ గా డిస్ట్ బ్ అయ్యి ఆత్మహత్యా ప్రయత్నాలు చేస్తే , మరొకరు నేరస్తులుగా మారిపోతూ ఉంటారు.

అసలు ఇక్కడ సమస్య అంతా తల్లిదండ్రుల దగ్గరే వస్తుంది. మొదటి బిడ్డ పుట్టాక గారాబంగా చూశాక, రెండో బిడ్డ పుట్టగానే మొదటి బిడ్డను పట్టించుకోవడం మానేస్తారు. అప్పుడు వారిలో తమ్ముడు, లేదా చెల్లి అంటే అసూయా ద్వేషాలు పెరిగి ఎవరూ లేనప్పుడు ఆ పాపను గిల్లడం గిచ్చడం చేస్తూ ఆనందిస్తారు. అలా కాకుండా తల్లిదండ్రులు ఇద్దర్నీ సమానంగా చూసుకుంటే ఎలాంటి సమస్యా ఉండదు.

ఇక పిల్లలు తల్లిదండ్రుల వల్ల బాధ పడితే హాస్టల్ కి వెళ్ళాక అక్కడి పరిస్థితులు ఆకళింపు చేసుకోలేక , ఇమడలేక, ఎవరికీ చెప్పుకోవాలో తెలియక, పాఠాలు అర్థం కాక, సర్ది చెప్పే వారు, ఓదార్చే వారు లేక డిప్రెషన్ లోకి వెళ్లి, తాము చనిపోతే ఈ బాధలన్నీ ఉండవు అనే ఉద్దేశ్యం తో ఆత్మహత్య చేసుకుంటారు. లేదా సైకో లుగా మారి తోటి విద్యార్థులను బాధ పెడుతూ సంతోషిస్తారు.

మరి నివారణ ఎలా :-

1. తల్లిదండ్రులు పిల్లలు ఎలా ఉన్నారు, తాము పిల్లల పట్ల ఎలా బాధ్యతగా ఉండాలి అనేది నేర్చుకోవాలి.
2. పిల్లలని అనుక్షణం గమనిస్తూ వారి ఆలోచన విధానం పర్యవేక్షించాలి.
3. ఉద్యోగులు అయినా సాయంత్రం రాగానే పిల్లలతో నవ్వుతూ కాసేపు గడపాలి.వారి రోజు వారి యాక్టివిటీస్ నీ పరీక్షించాలి.
4. ఎంత సమయం బిజీ గ ఉన్నా వారం లో ఒకసారి పిల్లలను బయటకు తీసుకు వెళ్తూ ఉండాలి.
5. ముఖ్యంగా పిల్లలకు ఇష్టమైన రంగం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేసి, అందులోనే వారికి తర్ఫీదు ఇప్పించాలి. క్రికెట్, చేస్, బ్యాడ్మింటన్,వాలీబాల్ లాంటివి నేర్పించే ప్రయత్నించాలి.
6. కొందరు పేరెంట్స్ ఆ తల్లి చూసుకుంటుంది లే అని వదిలేస్తూ ఉంటారు. నిజమే కానీ తండ్రి తో గడపడం కూడా వారికి ముఖ్యమే కాబట్టి తండ్రి ఎంత బిజీగా ఉన్నా పిల్లలతో గడుపుతూ ఉండాలి.
7. వారికి రోజూ నీతి కథలు, పద్యాలు , దేవుని కీర్తనలు నేర్పించే ప్రయత్నం చేయాలి.
8. హాస్టల్ లో నాకు అర్ధం అవడం లేదు అనే పదం రాగానే వెంటనే ఇంటికి తీసుకుని రావాలి వారికి నచ్చిన పాఠశాల లో చేర్పించాలి.
9. సున్నిత మనస్కులు అయినా పిల్లలతో ఇంకా జాగ్రత్త గా మెలగాలి.
10. మేము దేనికి పనికి రాము,మాకు చదువు రాదు అనే ఆలోచన రాకుండా చదువొక్కటే, ర్యాంకులు ఒక్కటే లక్ష్యం కాదు చదువు కేవలం సంస్కారానికి మాత్రమే అని చెప్తూ, వారికి ధైర్యాన్ని ఇవ్వగలగాలి.

మరొక ముఖ్యమైన విషయం అంటే ఎదురింటి,పక్కింటి ,తోటి విద్యార్థులతో వారినింపోల్చకుండ మీ పిల్లలకు ఏది ఇష్టమో దాన్నే నేర్పించి అందులో నెంబర్ వన్ అయ్యేలా తర్ఫీదు ఇవ్వడం వల్ల పసి పిల్లల ప్రాణాలను కాపాడిన వారు అవుతారు.

కాబట్టి తల్లిదండ్రులు అందరూ ఒక్కసారి మీ మనసును ప్రశ్నించుకొని మీ పిల్లలు ప్రాణాలు తీసుకోకుండా చూసుకోండి. ఒక్క బిడ్డ పోతే మరొకరిని కనవచ్చు అనేది మర్చిపోండి.

తొమ్మిది నెలల కష్టాన్ని మీ చేతులతో నలిపేయకండి. దయచేసి ఆలోచించండి, మీ పిల్లలను కాపాడుకోండి. పిల్లలు లేని వారిని , వారి బాధను అర్దం చేసుకుంటే ఏ ఒక్క పిల్లాడికి ప్రాణాలు తీసుకునేంత దుస్థితి రాదు. అర్థం చేసుకుంటారు అని ఆశిస్తూ..

 

-భవ్యచారు

 

Comments