హాస్టల్ లో పిశాచి ఎపిసోడ్ 2 - భరద్వాజ్

Comments · 188 Views

హాస్టల్ లో పిశాచి ఎపిసోడ్ 2 - భరద్వాజ్

హాస్టల్ లో పిశాచి ఎపిసోడ్ 2

రెండేళ్ల తర్వాత

ఒక పాడుబడ్డ స్మశానం, దూరంగా ఏవో నక్కల అరుపులు. కాలిపోయిన శవాలని కాటికాపరి కర్రతో కొడుతున్నాడు. ఇంత రాత్రి వేళ భయం అరచేతిలో పెట్టుకుని శ్మశానంలో దెయ్యాలు నిజంగా ఉంటాయా, ఉండవా అని చూద్దాం అని రాజు అక్కడికి వెళ్ళాడు. ఒక్కో సమాధిని దాటుకుంటూ ముందుకు వెళ్తున్నాడు కాపరి కళ్ళు కప్పి. ఇంతలో కాళల్లో ఏదో గుచ్చుకుంది. ఏంటా అని కాళ్ళని పైకి లేపి కింద చూస్తె ఏదో శవం ఎముక అది. వెంటనె అది విసిరేసి గట్టిగా అరిచాడు.

ఆ అరుపు విన్న కాపరి, ఎక్కడ నుంచి అరుపు వచ్చిందని వెతుకుతూ-

"ఎవరన్నా కానీ ఇక్కడ ఉంటే ప్రమాదం". అసలే ఈరోజు అమావాస్య, దెయ్యాలు ఇక్కడే విచ్చల విడిగా సంచరిస్తాయ్. వాటి శక్తులు రెట్టింపు అవుతాయి. మానవుడు కనిపిస్తే వాడి రక్తం తాగి చిత్రవద చేసి చంపుతాయ్.

నువ్వు ఎవరో నాకు తెలీదు కానీ ఇక్కడికి ఇంకాసేపట్లో దెయ్యాల శక్తులని వస పరుచుకోవడానికి కొందరు క్షుద్ర మాంత్రికులు ఇక్కడికి వస్తారు. వాళ్ళకి నువ్వు కనపడితే నిన్ను బలి ఇచ్చి వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటారు, వెంటనే ఇక్కడ నుంచి పారిపో, నీకోసం మంత్రించిన నిమ్మకాయ ఒకటి ఇక్కడ పెడుతున్న ఇది నీ చేతిలో వున్నంత వరకు ఏ చెడు శక్తి నిన్ను ఎం చెయ్యలేదు. ఆలస్యం చెయ్యకు, దీన్ని తీసుకుని పరిపో అని కాపరి చెప్పి ఆ నిమ్మకాయని అక్కడ సమాది మీద పెట్టి వెళ్ళిపోయాడు.

కాపరి మాటలకు రాజుకి గుండె ప్యాంట్ లోకి వచ్చేసింది. కానీ నిమ్మకాయ వున్నంత వరకు మనకి ఎం కాదు అన్నాడు కదా, అది పట్టుకుని ఆ క్షుద్ర మాంత్రికులు వచ్చాక వాళ్ళని చూసి వెళ్లిపోదాం అనుకున్నాడు.

సుమారు రాత్రి ఒంటి గంట అవుతుంది ఇంకా రారు ఏంటి ఈ మాంత్రికులు, బొత్తిగా టైం సెన్స్ లేకుండాపోయింది వీళ్ళకి, ఈ గ్యాప్ లో ఉన్న దెయ్యాలు అన్ని నిద్ర పోతాయి. "కొంపదీసి వీడు పడుకున్న దెయ్యాలని లేపుతాడా ఏంటి". "నేనె నిద్దట్లో లేపితే తంత", అలాంటిది దెయ్యాలు అవి ఏం జరుగుతుందో ఏంటో అనుకునేలోపు-

"గడ గడ గడ ఓం బగ బగ కమమోహిని అవహాయమి, ఓం బగ బగ రక్త శాలిని అవహాయమి" అంటూ డమరుకం మోగిస్తూ, తడిగుడ్డలు కట్టుకుని జుత్తు విప్పుకుని, వొళ్ళంతా విభూతి పూసుకుని అక్కడికి కాపరి చెప్పినట్టే ఇద్దరు మాంత్రికులు వచ్చారు. ఇద్దరు ఒకరు తూర్పుకి ఎడముఖం పెట్టి ఒక సమాధి పైన ముగ్గు వేసి దాని పక్కన మంట వెలిగించి మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు. ఇంకొకడు అదే విధంగా వేరే సమాధి దగ్గర కూర్చున్నాడు.

ఇద్దరు మంత్రాలు గట్టిగా చదవడం మొదలుపెటారు. నిప్పు పొగలో, ఆ మంట వెలుగులో ఒక రూపం పైకి రావడం రాజు గమనించాడు. తన చేతిలో నిమ్మకాయని గట్టిగా పట్టుకున్నాడు. ఆ మాంత్రికుడు ఆ దెయ్యాన్ని విభూతితో కొడుతున్నాడు. ఆ దెయ్యం గిల గిల కొట్టుకుంటుంది. వచ్చిన పని పూర్తి అయింది ఇక బయల్దేరాదం అనుకుని రాజు మెల్లగా చప్పుడు చేయకుండా జారుకోవడం మొదలుపెట్టాడు, సమాధి మీద నుంచి ఎక్కి దూకబోయేసరికి కాళ్ళు రాయి మీద పడి చేతిలో నిమ్మకాయ జారీ పడిపోయింది.

అంతే వాసన పసి గట్టిన ఆ దెయ్యాలు అన్ని సమాధుల నుంచి బయటకి వచ్చాయి ఒక్కసారి. రాజు పరుగు తీసాడు. దెయ్యాలన్నీ ఒకేసారి మీద పడిపోయి రక్తం తాగబోతుంటె -

వద్దు, వద్దు నన్ను చంప్పొద్దు అని గట్టిగా కేకలు వేస్తుంటే- రేయ్ రేయ్ రోజు నీ కలలతో మమ్మల్ని భయపెట్టి చంపుతున్నావ్ కదరా నాయనా అని పక్కనే పడుకున్న శ్యామ్ లేపుతాడు.

హమ్మయ్య! ఇదంతా కల. కాస్త ఉంటే ఆ ఎదవ దెయ్యాలు నా రక్తం తాగేసేవి. అర్జంట్ గా ఈ కలని మా ఎదవలకి చెప్పాలి అంటూ ఫోన్ తీస్తాడు.

ముందు ఎవడికి చెప్తామ్ అని ఆలోచించి సూరికి కాల్ చేసాడు, "జై పబ్జీ జై పబ్జీ" అని రింగ్టోన్ మోగింది. (సూరి పబ్జీ పిచ్చోడు. పొద్దున లేస్తూనే పబ్జీ ఆడటం మొదలుపెడతాడు. నిద్దట్లో కూడా "విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్" అని అరుస్తుంటాడు. రాత్రి పగలు తేడా లేదు, తిండి తిప్పలు గుర్తు రావు).

ఇంకా పూర్తిగా నిద్ర వదలలేదు, నిద్దట్లోనే -

"పోచంకి వచ్చేసింది, m416 గన్ తీసుకో కాల్చు దొరికినోడ్ని అంటూ గట్టిగా అరుస్తున్నాడు."

అది విని పక్కన ఫ్రెండ్ రేయ్ తరువాత వాడ్ని కాలుస్తావ్, ముందు మీ ఫ్రెండ్ కాల్ చేస్తున్నాడు లిఫ్ట్ చెయ్ అన్నాడు. వెంటనే సూరి కాల్ లిఫ్ట్ చేసి రేయ్ కొంచెం ఆగితే "పోచంకి" లో మన జెండా ఎగిరేది, అనవసరంగా పొద్దు పొద్దున్నే లేపేసావ్ అని సూరి రాజు మీద విసుకున్నాడు.

దానికి రాజు, పోచంకి మిస్ ఐతే "George pool" లో ఎగరేదం. ముందు ఇది విను, "నాకో అద్భుతమైన కల వచ్చింది". నేను స్మశానంలో దెయ్యాల కోసమని వెళ్తే అని చెప్తున్న రాజు ని సూరి "హోల్డాన్ హోల్డాన్" అని ఆపి మళ్ళీ దెయ్యం కల వచ్చిందా. ఇప్పుడు వినే ఓపిక లేదు సాయంత్రం రూమ్ కి వస్తా అప్పుడు చెప్పు అని ఆవలిస్తూ కాసేపు నన్ను నిద్రపోనీరా అని సూరి చెప్పాడు.

దానికి రాజు సరే సాయంత్రం మంచిగా ఒక షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేద్దాం దెయ్యాలు మీద వచ్చేయి మా హాస్టల్ కి అని చెప్పాడు, వెంటనే సూరి సరే అయిపోయిందా నీ చెప్పడం నేను ఇంక పడుకుంటారా, అని కాల్ కట్ చెయ్యబోతుంటె-

ఆగు ఆగు నీతో పాటు రవి గాడ్ని, నిఖిల్ గాడ్ని కూడా తీసుకురా వచ్చేటప్పుడు అని రాజు చెప్పగా ఏం మాట్లాడకుండా సూరి వింటున్నాడు, ఏరా ఉన్నవా? అని రాజు అడిగాడు. రేయ్ ఇంకేమైనా ఉంటే చెప్పేయరా మళ్ళీ మళ్ళీ నేను వినలేను. తీసుకొస్తారా, కావాలి అంటే మా హాస్టల్ మొత్తం అందర్నీ తీసుకొస్తా ఇప్పుడు నన్ను వదిలేయరా అని బ్రతిమాలాడు సూరి. దానికి రాజు నవ్వుతూ సరే మర్చిపోకుండా వచేయ్యండి సాయంత్రం అంటూ ఫోన్ పెట్టేసాడు.

మెల్లగా సూరి కాసేపు అయ్యాక నిద్ర లేచాడు. వెంటనే ఫోన్ తీసి పబ్జీ స్టార్ట్ చేసాడు. సూరి, రవి, నిఖిల్ ముగ్గురు పబ్జీ ఆడటం మొదలుపెట్టారు. ఆట లొనే- మెల్లగా ల్యాండ్ అవ్వు అని సూరి, అరేయ్ నన్ను కవర్ చెయ్యండిరా చచ్చిపోయేలా ఉన్నా అని రవి, స్కోప్ పెట్టి ప్లేయర్స్ ని ఎటాక్ చేస్తున్న నిఖిల్ చాలా శ్రద్ధ గా ఆడుతున్నారు.

ఇంతలో సూరి గుర్తు తెచ్చుకుని- "అరేయ్ రవి, నిఖిల్" మనం సాయంత్రం రాజు గాడి హాస్టల్ కి వెళ్ళాలి, వాడికి మళ్ళీ ఏదో దెయ్యం కల వచ్చింది అంట, ఏదో కొత్త ఐడియా మనతో పంచుకోవాలి రమ్మన్నాడు. సాయంత్రం కదా వెళదాంలే, అసలే ఎగ్జాంస్ కూడా దగ్గరలో ఉన్నాయి. వాడు ఐతే మంచి స్టడీ ప్లాన్ ఇస్తాడు అని రవి చెప్పగా, ఐతే దానికి నిఖిల్-

నేను బైక్ తో సాయంత్రం మీ హాస్టల్ దగ్గర ఉంటా, తయారయ్యి ఉండండి అని ఆడుతూనే మాట్లడుకున్నారు ముగ్గురు.

సాయంత్రం ఆరు అయింది నిఖిల్ బైక్ పైన ముగ్గురు రాజు వాళ్ళ హాస్టల్ కి బయల్దేరారు. దారిలో టైర్ పంక్చర్. ఇది అయ్యేసరికి సాయంత్రం ఎనిమిది అయింది. అదేంటో వీళ్ళ విధి ఎప్పుడు చీకటి గానే వుంటాది సాయంత్రం ఏడు దాటితే. రాజు ని అడిగితె ఎప్పుడు కూడా ఆ నిజం ఏంటో చెప్పడు అని సూరి, రవి మరియు నిఖిల్ తో అన్నాడు.

ఇదేంట్రా వీళ్ళ హాస్టల్ ఇలా ఉంది. ఎందుకు వీడు ఇక్కడ ఉంటున్నాడు. మన హాస్టల్ లో జాయిన్ అయిపోవచ్చు కదా అని రవి నిఖిల్ ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. దానికి సూరి వాడికి ఈ హాస్టల్ ఏ కలసి వచ్చింది అంట, వాడు ఇక్కడ ఉంటేనే బాగా చదువుకుంటున్నాడు అంట. నేను చాలా సార్లు అడిగి విసిగిపోయాను అన్నాడు.

సరే వచ్చాము కదా, పద వాడికి కాల్ చెయ్ ఒకసారి వచ్చాము కిందకి రమ్మని. మళ్ళీ వాళ్ళ ఓనరమ్మ చూసింది అంటే గోల చేస్తాది అని రవి వెటకారం చేసాడు. సరే అని సూరి, రాజుకి కాల్ చేసాడు. ఫోన్ రింగ్ అవుతుంది కానీ రాజు లిఫ్ట్ చెయ్యట్లే, ఇంకోసారి ప్రయత్నించు అని నిఖిల్ చెప్పాడు. మళ్ళీ చేసిన కాల్ లిఫ్ట్ చేయలేదు రాజు.

వాడి రూం నెంబర్ తెలుసు కదా? అని సూరిని ప్రశ్నించారు ఇద్దరు. అవును 313 అనుకుం రా అని సూరి కొంచెం అనుమానంగానే చెప్పాడు. సరే పద ఇంకెందుకు లేట్ చెయ్యడం అని ముగ్గురు లోపలకి బయల్దేరారు.

హమ్మయ్య వీళ్ళ ఆంటీ లేదు అనుకుంటా, హ్యాపీగా రాత్రంతా ఇక్కడే వుండి తెల్లవారుజామున వెళ్లొచ్చు అని సూరి అన్నాడు. ఇదేంటి హాస్టల్ లో ఎవరు లేరా, అన్ని గదులకి తాళాలు వేసున్నాయ్. సెలవలు కూడా ఇప్ప్పుడు లేవే అని ముగ్గురు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఈ లోపే రాజు పైన నుంచి అక్కడ ఏం చేస్తున్నారు పైకి రండి అని పిలిచాడు. రాజు ని చూసాక కాస్త ధైర్యం వచ్చింది ముగ్గురుకి.

వీళ్ళు మెట్ల పైన నడుస్తున్నారు, వెనక గజ్జల చప్పుడుతో ఎవరో వెళ్లినట్టు అనిపించింది. దానికి సూరి రవితో "అరేయ్, నీకు ఈ పిల్ల చేష్టలు మానుకోమని ఎన్ని సార్లు చెప్పాలి", అసలే భయం వేస్తుంటె. నేను కాదు చేసింది. నిజంగానే గజ్జల చప్పుడు ఎక్కడ నుంచో వచ్చింది అన్నాడు రవి.

నిఖిల్ కి దెయ్యాలు అంటే చాలా భయం. తన చేతికి నాలుగు దేవుడు తాయత్తులు, పడుకునే ముందు హనుమాన్ చాలీసా చదవడం, భయం వేస్తే లైట్ ఆపకుండా పడుకోవడం, ఎవర్ని పడుకోనివ్వకపోవడం ఇలాంటి అలవాట్లు ఉన్నాయ్. ఇంకా విడ్ని పైకి తీసుకువెల్లడం ఎలారా అని సూరి తల పట్టుకున్నాడు. నిఖిల్ కదలడం లేదు, రవి సూరి ఇద్దరు ఏం లేదు, ఏం కాదు అని చెప్పినా కదలడం లేదు. ఇంతలో రాజు పైన నుంచి, ఇంకా ఎంత సేపు పైకి రాడానికి అని గట్టిగా అరిచాడు.

వీళ్ళు ఏరా ప్రాణాలు పోతున్నాయి పైకి రాడనికి నువ్వే కిందకి రావొచ్చు కదా అని అనగానే, వెంటనే వీళ్ళు చూస్తే మూడవ అంతస్తులో వున్నారు. ఎదురుగా రాజు. వెంటనే ఉలిక్కిపడి ముగ్గురు వెనక్కి పడ్డారు. రేయ్, ఏమన్నా మంత్రాలు నేర్చుకున్నవా మా మీద ప్రయోగిస్తున్నావ్, చాలా భయం వేస్తుంది రా. నిఖిల్ గాడ్ని చూడు, నాకు తెలిసి ఈపాటికే వాడికి నవ రందరాలు తడిసిపోయుంటాయ్. కాస్త మాములుగా ఉండరా అని సూరి ఏడుస్తూ చెప్పాడు.

రాజు- సరే, పదండి రూమ్ కి వెళ్లి మాట్లాడుకుందాం అన్నాడు. పోనీలే ఇప్పటికీ కాస్త ఊపిరి పీల్చుకునే టైం ఇచ్చావ్. అందరూ చుట్టూ కూర్చున్నారు ఏదో బంతి భోజనం కోసం కూర్చుకున్నట్టు, రాజు వాళ్ళ కోసం కావాల్సిన తిండి వస్తువులు మధ్యలో పెట్టాడు. అందరికి గ్లాస్ లో కూల్ డ్రింక్ పోసాడు.

అందరూ కాస్త విశ్రాంతి తీసుకుంటూ, కూల్ డ్రింక్ ని ఆస్వాదిస్తూ, చేగోడీలు నములుతూ సరదాగా నవ్వుకుంటున్నారు. ఇంతలో సూరి రాజుతో ఇలా అన్నాడు. అవును రాజు -హాస్టల్ అంతా ఖాళీగా ఉంది, ఎక్కడికి వెళ్లారు అంత మంది అని నోట్లో చేగోడీలు నములుతూ కరకర్ మని అలజడి చేస్తూ అడిగాడు.

దానికి రాజు, అందర్నీ నేనె చంపేసి వాళ్ల గదులకి తాళం వేశా అన్నాడు. అంతే సూరి పలవరి పోయి నోట్లో ఉన్న చేగోడీలు కక్కేసి గడ గడ నీళ్లు తాగడం మొదలుపెట్టాడు. రవికి చెమటలు పట్టాయి, చేతులు కాళ్ళు వణుకుతున్నాయి. నిఖిల్ ఆక్కడికక్కడే కళ్ళు తిరిగి పడిపోయాడు. వెంటనే వాడి మొఖం మీద నీళ్లు జల్లి రాజు, కావాలనే జోక్ చేశా. అందరూ ఏదో కొత్త సినిమా రిలీజ్ అయింది అని వెళ్లారు.

హమ్మయ్య! భయపెట్టావ్ కదరా బాబు, సరే ఏదో షార్ట్ ఫిల్మ్ అన్నావ్ దాని సంగతి చెప్పవు ఏంటి అని సూరి ఇంకా అసలు మ్యాటర్ కి వచ్చేసాడు.

సరే వినండి మనం ఒక హారర్ షార్ట్ ఫిల్మ్ చెయ్యబోతున్నాం.

హారర్ షార్ట్ ఫిల్ల్మా! అని ముగ్గురూ షాక్ తిన్నారు....

రాజు ఎలాంటి షార్ట్ ఫిల్మ్ చెప్పబోతున్నాడు, ఏం జరగబోతుంది?

నిఖిల్ భయంతో ఇక్కడ ఉంటాడా, ఉరుకుతాడా?

ఇవన్నీ తెలియాలి అంటే మూడవ భాగం కోసం ఎదురుచూడలి

- భరద్వాజ్

Comments