యోధ ఎపిసోడ్ 15 - భరద్వాజ్

Comments · 286 Views

యోధ ఎపిసోడ్ 15 - భరద్వాజ్

యోధ ఎపిసోడ్ 15

అలా తనలో తానే అనేక ప్రశ్నలు సంధించుకుంటున్న పార్ధు, తేరుకుని

"ఛీ.. ఛీ... అయినా నేనిలా ఆలోచిస్తున్నాను ఏంటి..!" అని అనుకుంటూ

తన ఫ్రెండ్స్ లో ఒకరైనా అవేశ్ కి కాల్ చేసి

"తను ఒకప్పుడు ప్రేమించిన ఆ అమ్మాయి గురించి, వారి లవ్ బ్రేకప్ టాపిక్ తీస్తూ... కాస్త జాగ్రత్తగా ఉండరా? " అంటూ హెచ్చరిస్తాడు పార్ధు...

"అసలేమైంది రా నీకు ..? ఎందుకిలా మాట్లాడుతున్నావ్..?" అంటూ అవేష్ అడగగా.

రాత్రి తనకొచ్చిన ఆ కల గురించి వివరించి చెప్తాడు పార్ధు..! పార్ధు చెప్పినదానికి పగల బడి నవ్వుతాడు అవేశ్...

"నేనింత సీరియస్ గా చెప్తుంటే, నీకు జోక్ గా ఉందా..?" అంటూ కోపంగా కసురుకుంటాడు పార్ధు.

"జోక్ కాకపోతే ఏంటి మరి! పద్మను నేను మోసం చేయడం ఏంటి? తను చనిపోవడం ఏంటి? ఆత్మగా మారి నన్ను చంపడమేంటి..? అసలు పద్మతో లవ్ ట్రాక్ గురించి నేను చెప్తేనే కదా! నీకు మా గురించి తెలిసింది. ఇద్దరం ఒక అండర్ స్టాండ్ కి వచ్చే విడిపోయామని కూడా నీకు తెలుసు! ఇప్పటికీ తను నా కాంటాక్ట్ లో కూడా ఉంది..! మార్నింగ్ యే మెసేజ్ కూడా చేసింది. 

ఆ రోజు అలా విడిపోయినందుకు ఇప్పటివరకూ మా మధ్య ఎలాంటి విద్వేషాలు రాలేదు. అయినా నిన్నటి నుండి నువ్వేవో అతిగా ఆలోచిస్తూ పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నట్లు ఉన్నవ్, కాసేపు రెస్ట్ తీసుకో...! తర్వాత మాట్లాడదాం!" అంటూ అవేశ్... పార్ధుకి సర్ది చెప్పి ఆ కాల్ కట్ చేసాడు.

మిగిలిన వారందరికీ కూడా వరుసగా గోపాల్, విశాల్, ప్రియ, కృతి, గౌతమి ఒక్కొక్కరికి కాల్ చేసి జరిగిందంతా చెప్పి, వాళ్ళు గతంలో ప్రేమించిన వాళ్ల గురించి ఆరాతీస్తే, వాళ్ల దగ్గర నుండి కూడా అవేశ్ నుండి వచ్చిన రియాక్షనే.. 

"అసలు వాళ్ళు చనిపోవడం ఏంటి?, వాళ్లంతా ఇప్పుడు బాగానే ఉన్నారు, పైగా తమతో కాంటాక్ట్ లో కూడా ఉన్నారంటూ.... మేమలా విడిపోయింది కూడా ఒకరికొకరి అంగీకారంతోనే, అయినా నీకీ పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏంటి..? అసలు మాకు మేమే నీకు ఈ స్టోరీస్ అన్ని చెప్పాం..!" అంటూ పార్ధుని తిడతారు వారంతా..

వాళ్ళందరి మాటలు విన్న పార్ధుకి, నిజంగానే పిచ్చి పట్టినంత పనైంది. అసలేం జరుగుతుందో, తనకి అర్ధం కావడం లేదు. కలలో తనకొచ్చిన ఆ క్రైమ్స్ గురించి, ఆ న్యూస్ ల గురించి తను అలా గూగుల్ మరియు యూ ట్యూబ్ లలో సెర్చ్ చేస్తూనే ఉంటాడు. ఇదిలా ఉండగా సరిగ్గా రెండ్రోజుల తర్వాత, ఆ అన్నా చెల్లెళ్ళ మిస్టరీ వీడిందనే న్యూస్ పార్ధుకి తెలుస్తుంది. అది చేధించిన ఆఫీసర్ పేరు సీపీ మణి చందన్ మరియు అతని బృందం. దాంతో మళ్ళీ ఆ కేసు గురించి ఇంటర్నెట్ లో వెతికిన పార్ధుకి విస్తుపోయే నిజాలు తెలుస్తాయి.

అవి ఏంటంటే..?

యోధ పార్ధు కలలో కనిపించి, ఏదైతే తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పిందో... సరిగ్గా అదే యోధ నిజ జీవితంలో కూడా జరిగి, యోధ మరియు యోగి అతి దారుణంగా హత్య చేయబడడంతో పాటు, వాళ్ళు ఏమయ్యారో తెలియక వాళ్ల తల్లిదండ్రులు కూడా నిజంగానే ఆత్మహత్య చేసుకున్నారు. నిజానికి ఏం జరిగిందంటే,

ఆ అన్నా చెల్లెళ్ళు (యోధ, యోగి) కనిపించకుండా పోయిన కొద్ది రోజులకే... సీపీ మణి చందన్ నేతృత్వంలోని బృందం ఆ కేసుని టేక్ అప్ చేసింది. ఒక్కొక్క అంశాన్ని చాలా లోతుగా పరిశీలిస్తూ, ఆ కేసుని చేధిస్తూ... వారి బృందం వాళ్ళు హత్య చేయబడ్డారని, దానికి కారణం ఓ ఎమ్మెల్యే (అదే విక్కి ఫ్రండ్ రాహుల్ వాళ్ల నాన్న), అతని కొడుకు మరియు స్నేహితులనీ, వివరణ ఇవ్వడానికి ప్రయత్నించింది..

అలాగే, వాళ్ల చావుకు కారణమైన ఘటనలు పోలీసులు అణువణువునా అన్వేషించడం, వాటిని కళ్ళకు కట్టినట్లు ఆ న్యూస్ చానల్స్ లో పదే పదే చూపిస్తారు... (ఇదంతా పార్ధు కు యూట్యూబ్ లో దొరికిన కంటెంట్) ఇక దాంతో, ఎక్కడ తన పేరు ప్రఖ్యాతలు దెబ్బలు తింటాయోనని భయపడి, అప్పటికే అధికారంలో ఉన్న తన పార్టీ బలాన్ని అడ్డుపెట్టుకుని ఆ సీపీ మణి చందన్ ని వేరొక చోటుకి ట్రాన్స్ఫర్ చేయించాడు ఆ ఎమ్మెల్యే.

కానీ, తప్పు చేసినోడు తప్పించుకోగలుగుతాడా...? ఎప్పటికైనా శిక్షార్హుడే..! ఆ తర్వాత వచ్చిన ఎలక్షన్స్ లో ఆ ఎమ్మెల్యే గెలిచినప్పటికి, ప్రభుత్వాన్ని ఏర్పరచడంలో తమ పార్టీ ఓడిపోవడంతో... ఈ సారి అధికార పక్షంలోకొచ్చిన అప్పటి ప్రతిపక్ష పార్టీ, బదిలీ అయిన ఆ సీపీ మణి చందన్ ను మళ్ళీ రప్పించి, అతనికే ఆ కేసు నీ అప్పగించి దాని మూలాలు వెలికితీయించింది.

అలా మళ్ళీ బయట పడింది ఈ కేసు. అప్పుడే దీని గురించి చర్చలు, సమావేశాలు న్యూస్ చానల్స్ లో మళ్ళీ నడవడం మొదలయ్యాయి. కొన్ని రోజులకు... ఆ అన్నాచెల్లెళ్ల మర్డర్ మిస్టరీని చేధించడం మాత్రమే కాకుండా, ఆ ఎమ్మెల్యే అతని కొడుకులు ఆ గెస్ట్ హౌజ్ లో పాల్పడిన దురాగతాలను అన్నింటిని ఒక్కొక్కటిగా బయట పెట్టాడు ఆ సీపీ మణి చందన్.

దీంతో ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు కట్టెలు తెంచుకున్నాయి. ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలకు, అన్యాయాలకు నిరసనగా ప్రజల నుండి బంద్ లు, రాస్తారోకోలు, నిరాహార దీక్షలు మిన్నంటాయి. ఆ ఎమ్మెల్యేకి మరణ శిక్ష పడాలని ప్రజలందరూ ముక్త కంఠంతో రోడ్ల పైకి వచ్చి తమ తమ వ్యతిరేకతను, తమ తమ ఆవేశాన్ని చూపుతున్నారు.

చేసేదేమీ లేక, ఆ ఎమ్మెల్యే నీ బర్త్ రఫ్ చేసి, అరెస్ట్ చేయించి కోర్టులో హాజరు పరిచింది ప్రభుత్వం. కోర్టు ఆ ఎమ్మెల్యే, అతని కొడుకు మరియు ఆ దారుణాలకు ఒడిగట్టిన అతని స్నేహితులకి జీవిత ఖైదు విధించింది. అయినా ప్రజల్లో కోపం చల్లారలేదు. అతనికి ఈ శిక్ష సరిపోదు, ఉరిశిక్ష విధించాలని అన్ని రంగాల నుండి ప్రజలందరూ ఏకమై రోడ్లపైకి వచ్చి తమ నిరసనలు తెలియచేశారు.

ఎంతో మంది అభాగ్యులను, అమాయుకులైన వాళ్ల కుటుంబాలను (అందులో యోధ, యోగి కుటుంబంతో పాటు మరెందరివో జీవితాలు) బలితీసుకున్న ఆ ఎమ్మెల్యే, అతని కొడుకు మరియు అతని స్నేహితులను ఇలా వదిలేయడం కరెక్ట్ కాదు అనుకున్నాడో ఏమో? వాళ్లందరినీ ఎన్కౌంటర్ పేరుతో పిట్టల్ని కాల్చినట్టు కాల్చిపడేసాడు ఆ సీపీ మణి చందన్. దీంతో ఆ ప్రజలతో పాటు, యోధ కుటుంబ మరియు ఆ నీచులు వల్ల బలైపోయిన ఎందరో ఆత్మలు శాంతించి ఉంటాయి.

"తప్పు చేసిన వాడు ఎప్పటికీ తప్పించుకోలేడు."

ఇక్కడితో ఈ కథకి ముగింపు. 

- భరద్వాజ్

Comments