అద్భుత అంతర్జాలం
నా పేరు చారులత కొద్దిరోజుల క్రితం పదవ తరగతి పరీక్షలు రాశాను.హమ్మయ్య ఇంకా చదవాల్సిన పనిలేదు అనుకోని పుస్తకాలన్నింటినీ కట్టకట్టేసి,ఇంటిలో ఉండే అటకపై ఎక్కించేసా.
ఎప్పుడో వారంలో ఒకరోజు వచ్చే ఆదివారం సెలవుకే ఇంటి పట్టున ఉండలేను,అలాంటిది పరీక్షలు కూడా అయిపోయాయి ఇంకెలా ఉంటాం.
సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఎంచక్కా ఆడుతూ పాడుతూ కాలం గడిపేస్తున్నా.
ఒకరోజు పొద్దున్నే మా నాన్నగారు బిగ్గరగా అరుస్తూ, సమయం ఏడవుతుంది. ఇంకా ఏంటా మద్దు నిద్ర, ఈరోజు నీ పరీక్ష ఫలితాలు, కొంచమైన భయం కూడా లేదా అని గట్టిగా అరిచారు.
బాగా నిద్రలో ఉండే నాకు 'పరీక్ష ఫలితాలు' అనే మాట తప్ప ఇంకేం వినిపించలేదు, ఆ ఒక్క మాటతో నా జీవితంలో ఎప్పుడూ అంత తొందరగా నిద్ర నుంచి లేవలేదేమో.
చకచకా లేచి ఫలితాలు వచ్చే వార్త పేపర్ ఎక్కడ ఉందో అని ఊరంతా తిరిగాను కానీ ఎక్కడా కనిపించలేదు, ఇలా గందరగోళంలో తిరుగుతున్న నాకు, మా ఊర్లో ఒక పెద్దాయన చూసి ఏమమ్మా నీ ఫలితాలు చూసుకున్నావా అని అడిగారు,
ఈ ముసలాడికి ఏం పని లేదేమో నా ఫలితాల గురించిఅడుగుతున్నాడు. అని మనసులో గొనుకుకుంటూ,,,
లేదు తాతయ్య ఇంకా చూసుకోలేదు అని సమాధానం చెప్పా, అదేంటమ్మా ఈసారి పరీక్ష ఫలితాలు ఇంటర్నెట్లో ఉంచారు అంట కదా నువ్వు వెళ్లి చూసుకోలేదా అని చెప్పి వెళ్ళిపోయాడు.
టీవీ గురించి కూడా సరిగ్గా తెలియని నాకు ఈ ఇంటర్నెట్,కంప్యూటర్ గురించి ఏం తెలుస్తుంది,ఎలాగోలా కొంతమందిని అడిగి తెలుసుకుని, మా ఊరికి 5 కిలోమీటర్ల దూరంలో ఉండే పట్నం వైపు సైకిల్ తొక్కుకుంటూ వెళ్లాను.
'కోమలి ఇంటర్నెట్' అనే ఒక షాప్ దగ్గరికి వెళ్లి నిల్చున్నా, కొద్దిసేపటికి ఒక వ్యక్తి వచ్చి ఏం కావాలమ్మా అని అడిగారు, పదవ తరగతి ఫలితాలు అని చెప్పగానే, ఆ వరుసలో నిలబడమని చెప్పారు,
అప్పటికే 15 మందికి పైగా ఉన్నారు,కొంత సమయమయ్యాక నీ నెంబర్ చెప్పమ్మా అంటే రాసుకున్న చీటీ తీసి ఇచ్చా,అది తీసుకుని కంప్యూటర్ లో చూస్తూ ఆఖరిగా పాస్ అయిపోయావమ్మ అని చెప్పి,ఒక పేపర్ చేతులు పెట్టి పది రూపాయలు తీసుకున్నాడు.
ఆ సమయంలో నాకేమీ అర్థం కాలేదు పాస్ అయిపోయావ్ అనే మాట తప్ప, ఆ ఇచ్చిన పేపర్ ని తీసుకొని నాలో నేను పొంగిపోతూ ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యాను.
ఇంకా చదువు పూర్తి అయిపోయింది అనుకున్న నాకు, ఇంకా చదవాల్సింది చాలా ఉంది అని అనుకున్నా.
అక్కడెక్కడో వదిలిన ఫలితాలు ఇంటర్నెట్ లోకి ఎలా వచ్చాయి? ఈ ప్రశ్న ఫలితంగా ఈ మెయిల్, చాటింగ్ బ్రౌజింగ్, సెర్చింగ్, మనకు కావలసిన సమాచారం అంతా ఇంటర్నెట్ ఉంటే ప్రపంచం అంతా మన దగ్గరే ఉంటుంది. అని అర్థమైంది.
ప్రపంచంలో ఎక్కడెక్కడో జరిగిన సంఘటనలు, వార్తలు క్షణాల్లోనే తెలిసిపోవడం చూసి ఆశ్చర్యం వేసింది, ఇలా అన్నీ తెలుసుకున్న నాకు, ఆ రోజు నా ఫలితాల కోసం ఇచ్చిన పది రూపాయలు గుర్తొచ్చాయి,
ఏంటి ఈ మాత్రం దానికి అంత డబ్బులు తీసుకున్నాడా, అని తిట్టుకుంటూ, మనం ఎందుకు ఒక ఇంటర్నెట్ షాప్ పెట్టుకోకూడదు అనుకుంటూ కొద్ది రోజుల్లోనే ఒక షాపు ఓపెన్ చేశా,ఈసారి ఆశ్చర్య పోవడం మా ఊరి ప్రజలు వంతు అయింది.
అలా నేను తెలుసుకోవడమే కాకుండా ఊళ్లో ఉన్న వాళ్ళందరికీ వివరించడం మొదలుపెట్టా,ఈ ప్రక్రియలో నా సంపాదన కూడా చాలా ఎక్కువ అయింది అనుకోండి అది వేరే విషయం హహా.
మానవుడు కనిపెట్టిన అద్భుతాలలో అంతర్జాలం అనేది మహా అద్భుతం అని చెప్పొచ్చు, వేల మైళ్ళ దూరంలో ఏం జరిగినా క్షణాల్లోనే తెలిసిపోతుంది.
ఎక్కడో జరుగుతున్న సంఘటనను అరచేతిలోనే చూస్తున్నాం, ఈ కాలంలో అంతర్జాలం అనేది లేకపోతే ప్రపంచమే స్తంభించిపోతుంది అనడంలో ఎటువంటి సందేహంలేదు.
-కోటేశ్వరరావు