సహాయం -మీ భవ్యర్చన

Comments · 266 Views

సహాయం -మీ భవ్యర్చన

సహాయం

హాయం అనేది చేస్తే ఎడమచేతికి తెలియకూడదు అంటారు. అలాగే నాకు కొంత మంది సహాయం చేశారు.చేస్తున్నారు.చేస్తారు కూడా.

నేను అక్షర లిపి పెట్టడానికి కారణం నన్ను అవమానించడం అదెలా జరిగింది అంటే ఒక సమూహం లో వరుసగా పదిహేను కథలు రాయాలి అని అయిదు సీరీస్ లు పెట్టారు.

నేను ప్రతి దానిలో పాల్గొని కష్టపడి రాశాను . అప్పటికి నాకు తెలుగు సరిగ్గా రాదు. పైగా అందులో టైప్ చేస్తుంటే ఏదైనా ఫోన్ వస్తె ఎగిరిపోయేది.మళ్లీ మొదటి నుండి రాయాల్సి వచ్చేది. అయినా సరే కష్టపడి అయిదు సిరీస్ లకు 15 కథల చొప్పున 75 కథలు రాశాను.

ఫలితాలు వచ్చాయి . నాకు రాలేదు. పర్లేదు నా రాతలు నచ్చలేదు అనుకున్నాను .కానీ చివరికి ఎవరెవరికి. వచ్చాయని చూస్తే అయిదు సీరీస్ లో మొదటి మూడు స్థానాల్లో ఒక వ్యక్తి పేరే ఉండటం ఆశ్చర్యం అనిపించింది.

వేరే వాళ్ళు చాలా బాగా రాశారు.వారికి ఇవ్వకుండా ఒకే వ్యక్తికి అది అన్ని సీరీస్ లో. మూడు స్థానాల్లో ఇవ్వడం ఏమిటి అని నేను ఆ ప్రతినిధి కి ఫోన్ చేసి అడిగాను.

నాకు రాకపోయినా పర్లేదు కానీ మిగిలిన వారు బాగానే రాశారు కదా, అన్నందుకు ఆయన సమాధానం మా ఇష్టం , మీరు ఉంటే ఉండండి లేదంటే పొండి అని నిర్లక్ష్యంగా సమాధానం తో నా మనసు విరిగింది.

అదే మాటలను వేరే వారితో అంటే డబ్బులు ఎవరైతే ఇస్తారో వారికే అలా ఇస్తారు అంటూ అసలు రహస్యాన్ని చెప్పడం తో బిత్తర పోయాను.మన కథలు వేయాలంటే మనమే డబ్బులు ఇవ్వాలా అనే ఆలోచన నన్ను నిదుర పోనివ్వలేదు.

తర్వాత ఇంకో దాంట్లో రాశాను కానీ అక్కడ కథకి రూపాయి అన్నారు అది నచ్చలేదు. కథలు పాఠకుడు చదివి బాగుంది అనే మాటకన్న డబ్బులు ఎక్కువ కాదు. మన రచనలతో  మనుషుల్లో మార్పు తేవాలి. కానీ ఎలా పడితే అలా రాసి డబ్బిచ్చి వేయమనడం సబబు కాదు అనిపించింది.

తర్వాత బ్లాగ్ చేసి ఇచ్చాడు మా తమ్ముడు. కానీ అది కూడా మనమే ప్రమోషన్ చేసుకోవాలి. ఇలా కాదు ఇంకేదైనా చేయాలి అనే ఆలోచనతో మా తమ్ముడు తో డిస్కస్ చేశాను. సైట్ పెట్టాలి అంటే దాదాపు లక్ష రూపాయలు కావాలి అని లెక్కలు వేశాం.

నా దగ్గర అంత డబ్బు లేదు ఎలా అని ఆలోచిస్తుంటే ఎందుకు పనికి రాని తాళి బొట్టు కనిపించింది( ఇలా అన్నందుకు మన్నించండి, ఎవరిది అని అడగొద్దు).

అదే సమయం లో అమ్మ పన్ను నొప్పితో బాధ పడుతుంది ఇంట్లో డబ్బు లేదు . ఇoకేమి ఆలోచించకుండా గొలుసు ఇచ్చి డబ్బులు తెమ్మన్నాను. వాడు తెచ్చింది 72 వేలు అంతే వచ్చాయి.

అందులో పది వేలు అమ్మకి పన్ను సర్జరీ చేయించాను. ఇక వెబ్ సైటు కోసం చాలా మంది నీ అడిగాను. కానీ కొందరు సగం చేసి మోసం చేశారు. మరికొందరు డబ్బు తీసుకుని ఇదిగో అదిగో అంటూ జారుకున్నారు.

మళ్లీ అప్పుడు తమ్ముడే తన స్నేహితులతో కలిసి , గూగుల్ వారితో మాట్లాడి అన్ని కొన్నాడు. లోగో ఎం పెట్టాలి అనేది ఒక యుద్దమే జరిగింది. చివరికి సరస్వతి దేవి బొమ్మ , అక్షరమే ఆయుధం అనే క్యాప్షన్ తో లోగో చేసాము.

సైట్ అయితే రెఢీ అయ్యింది మరి కథలు ఎవరు రాయాలి. ఎవరు చదువుతారు. అన్నాక నాకు తెలిసిన వారికి చెప్పాను. కానీ వాళ్ళు నన్ను నమ్మలేదు. మేము రాయము అన్నారు. వాళ్ళు నేను ఎవరినైతే తిట్టి బయటకు వచ్చానో వారికి చేరవేశారు.

మా పెద్ద తమ్ముడు అందులో అయిదు లక్షల వరకు కథలు ఉన్నాయి నువ్వు ఎలా రాస్తావు అన్నాడు. దాన్ని సవాలుగా తీసుకొని పొద్దున లేవగానే. సిస్టం ముందు కూర్చుని నాకు తెలిసిన కథలు , నా , మా చుట్టూ చూస్తున్న కథలు దాదాపు రెండు వేల కథలు రాశాను.

ఒక రోజు పొద్దున్నే లేచి చూస్తే సైట్ లేదు. ఎందుకని అని తమ్ముడిని అడిగితే వాడు చూసి సైట్ హ్యాక్ అన్నాడు. వామ్మో నా రెండువేల కథలన్నీ పోయాయి.

గూగుల్ వాళ్ళతో వాడే మాట్లాడి మళ్లీ సైట్ రప్పించాడు.కానీ కథలు రాలేదు. అయినా వెనక్కి తగ్గలేదు. కాగితాల పై రాయడం అవి టైప్ చేయడం. పొద్దున, రాత్రి తేడా లేకుండా రాస్తూనే ఉన్నాను. రాస్తూనే ఉన్నాను. చేతులు వేళ్ళు మెడలు అన్ని నొప్పులు అయినా మళ్లీ 2000 కథలు రాశాను.

హమ్మయ్య అని అనుకునే లోపు మళ్లీ చిన్న పొరపాటు వల్ల కథలన్నీ బ్యాకప్ తీస్తుంటే ఎక్కడో మర్చిపోయాడు మా తమ్ముడు. ఇక ఈ సారి కుదరదు అనుకున్నా ,సైట్ నీ ఏడు వేల కి అమ్మేద్ధాం మన వల్ల కాదు అనుకున్నా , అప్పుడు అమ్మ ఇప్పటికీ నాలుగు వేల కథలు రాశవు.

మళ్లీ రాయలేవా అంటూ తిట్టింది.ఆ తిట్లు దివెనగ భావించి మళ్లీ రాశాను. ఈ లోపు కొందరు మిత్రులు నా లక్ష్యం గమనించి చాలా కవితలు పంపారు. కానీ అవన్నీ అంతకు ముందే నన్ను అవమానించిన వాటిల్లో ఉన్నాయి. వాటిని పక్కన పెట్టాను. నేనే రాశాను, ఇంకొందరు మిత్రులు కూడా ఒకటి ఆరా పంపారు.

వాటికి మంచి చిత్రాన్ని జోడించి ఈ సారి అమ్మ సాయం తో అన్ని మళ్లీ కొన్నాను. ఇలా రెండు సార్లు హ్యక్ అయినా నిజాయితీ గా ఉండడం వల్ల వాళ్ళు ఏమీ చేయలేదు. ఆ తర్వాత గో. తెలుగు లో రాశాను. కరోనా సమయం లో అవి ప్రచురితం అయ్యి, నా సైట్ గురించి కొందరికి తెలిసి వచ్చారు.

అప్పుడు మా తమ్ముడు ట్విట్టర్ లో ఉంటారు.ట్విట్టర్  తెరవండి అని అనడం తో అక్కడ కొందరు సాయం చేశారు.సాయం అంటే డబ్బే కాదు. రచనలు కూడా అలా మన అక్షర లిపి ఒక వేదిక అయ్యింది. దాంతో టెలిగ్రాం సమూహం చేసాము.కానీ అక్కడ కూడా వేరే లింక్స్ రావడం వల్ల అది తీసేసి వాట్స్ అప్ సమూహాన్ని మొదలుపెట్టాను.

దాని వల్ల మంచి రచయితలు, మిత్రులు కలిశారు. సాయం అడగగానే లేదు, కాదు, ఎందుకు చేయాలి అని కాకుండా, కవుల కులం ఒక్కటే ,ఒకరికొకరం సాయమంటూ కదిలి వచ్చారు. నేను డబ్బులు ఇవ్వక పోయినా వారు నా పై చూపించే ఆదరాభిమానాలకు పాధాభివందనాలు చేస్తూ...

ఇక మొదటి నుండి నేను ఏది అడిగినా నాకు క్షుణ్ణంగా అన్ని వివరిస్తూ మర్చిపోతే మళ్లీ మళ్లీ గుర్తు చేస్తూ నన్ను ప్రోత్సహిస్తూ, సాయం చేస్తున్నా నా కుటుంబం. కాదు మన కుటుంబం వెన్నుదన్నుగా నిలిచారు.

నన్ను అవమానించిన వారు కూడా నాకు సాయం చేసినట్టే ఎందుకంటే వారు అలా అనకపోతే నేను ఇలా చేసేదాన్ని కాదు కదా, అందులో ఇంకా నా కథలు అలాగే ఉన్నాయి.

కొన్ని తీసేసి మన లిపి లో పెట్టాను.కొన్ని అలాగే ఉంచాను. అవన్నీ కాకుండా ఇప్పుడు నా చేతిలో రాయడానికి పది సీరియల్స్ ఉన్నాయి.

రోజూ రాసేవి కాకుండా అవన్నీ సమయం కుదిరినప్పుడు రాస్తున్నాను. మా అమ్మగారు కూడా కొన్ని కథలు రాయడం నాకెంతో సంతోషంగా అనిపించింది.

మా అమ్మ కథ రాసి ఆట పోటీలకు పంపాను. కానీ నాకు తెలియదు నవల అంటే 50 పెజీలకన్నా ఎక్కువ ఉండాలని. అది తిరిగి వచ్చింది.

దాన్ని మన లిపి లో పెట్టను. దాన్నొక సినిమా లేదా వెబ్ సిరీస్ లాగా తీయాలని చూస్తున్న, అలాగే సావిత్రీ జీవించి ఉంటే అనేది కూడా ,నేను రాసే సీరియల్స్ అన్ని ప్రముఖుల వే కాబట్టి ఆలోచిస్తూ రాస్తున్నా.

ఉన్నది ఉన్నట్టు రాయాలంటే మామూలు విషయం కాదు. పైగా ఈ మధ్య ఇబ్బందుల్లో ఉన్నాను కాబట్టి రాయలేక పోయాను.

సహాయం అనే పదానికి అర్ధం పేద వారికి చేస్తేనే కాదు. తోటి రచయితలకు , తోటి మనుషులకు చేసేదే సాయం.మొన్నటికి మొన్న మీరంతా చేసిన సాయం ఎంతో గొప్పది. ఒక్క మాట అడిగానో లేదో పంపారు.

అది నా పై మీరుంచిన నమ్మకం కాబట్టి ఇదంతా మీకు చెప్తున్నా. మొన్న కూడా హ్యాక్ అయితే అప్పటి కప్పుడు 20 వేలు కట్టి మళ్లీ బ్యాకప్ తెచ్చాము.

ఇది మా కాదు మనందరి బాధ్యత గా తీసుకుని చేస్తున్నాం. మున్ముందు అక్షర లిపి రచయితలు అంటే వారికి ఒక రేంజ్ ఉండాలి.

అందుకే ఐడీ కార్డు లు కూడా చేయాలి అనే ఆలోచన ఉంది. మీరంతా నా వాళ్ళు , నాకు దీంట్లో దమ్మిడీ ఆదాయం లేదు.

కానీ ఒక్కటే ఏ ఒక్క రచయిత నాలాగా అవమాన పడకూడదు. అందరూ సమానులే అని తెలియాలి.అందరికీ. రచయిత అనే గుర్తింపు రావాలి.

కవి కోరేది బాగుంది మీ రచన అనే ఒకే ఒక్క మాట. ఆ మాట నేనీస్తున్నా , మీ అందరి సహకారం పొందిన నేను నా ఊపిరి ఉన్నంత వరకు మిమల్ని మర్చిపోను, వదలను.

అలాగని నాకే రాయండి అనడం లేదు. మీ ఇష్టం , కానీ నా ఉద్దేశ్యం రచయితలు అంటే అక్షరలిపి రచయితలే, వారి సాహిత్యం అమోఘం అనే పేరు తరతరాలు చెప్పుకోవాలి అనే ఆశయం తో ముందుకు వెళ్తున్నా మొండిగా. 

ఆ పేరు, ఆశయం సార్థకం చేసుకుంటాము అని ఆశిస్తూ... నాకు ప్రత్యేక్షంగా,పరోక్షంగా సాయంచేసిన ప్రతి ఒక్కరికీ నా అక్షర సుమాoజలులు సమర్పిస్తూ...

-మీ భవ్యర్చన

Comments