మకరందమై భాసిల్లే నా తెలుగు భాష
తేజోమయ ఉదయపు
మహోజ్వల ఉషస్సునై
అలరాడుతున్న అమ్మ భాషను నేను...
సౌగంధిక సుస్వరాల
సుమధుర మకరందమై
భాసిల్లుతున్న అద్భుత
భాండాగారపు పదాల సిరిని నేను..
అణువణువునా అలంకార ప్రాయమైన
ఛందస్సును నింపుకుని జంఝమారుతమై
వీస్తున్న అజంత భాషను నేను...
ఆది కవులచే అర్చింపబడి
అమోఘమైన పదాలతో అల్లబడిన
మల్లెల గుబాళింపు మాలను నేను....
ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ గా
పేరొందిన విశ్వ విఖ్యాతపు
వీనుల విందును నేను .....
ఎన్ని భాషలోచ్చిన వన్నె తరగని
అమృతవర్షిణినై సాగే
అనంత జీవనప్రవాహాన్ని నేను...
లలిత లావణ్యపు సుస్వరమై
అన్నమయ్యచే అల్లబడిన పదకవితను నేను....
పసిపాప బోసి నవ్వంత
స్వచ్ఛమైన గ్రాంధిక భాషను నేను....
ఎన్నటికీ ఎప్పటికీ మరపురాని
మధుర కావ్యమై నిలుస్తున్న
అఖండ ప్రస్థానాన్ని నేను.....
- కొత్త ప్రియాంక ( భానుప్రియ)