నిద్ర
నిద్దురా నిద్దుర, ఉన్నోడే రా-దొర
నిద్దురా నిద్దుర, లేనోడే నిరు-పేదరా
తీయరా తీయరా, నీ-ఆశల లిస్టు ఎంతరా
సోదరా సోదరా, నీ కలలో నిజమౌతాయిరా...
అన్నాతమ్ముల్ల అక్కాచెల్లెళ్ళ వాటాలు లేని ఆస్తిరా
అవని పై అన్ని జీవ రాశుల ఆజన్మాంతపు సొత్తురా
నిద్దురా నిద్దుర, ఉన్నోడే రా-దొర
నిద్దురా నిద్దుర, లేనోడే నిరు-పేదరా
చేపలా కనులు తెరిచినా
తాబేలై తలను దాచినా
గబ్బిలపు భంగిమ లోనా
పక్షిలా నిలబడి అయినా
చెట్టులా రాత్రిళ్ళు ఐనా
చిరుతలా పగల్లు ఐనా
అలసిన తనువును పరుగెత్తించే ఔషధ లక్షణమే ఉందిరా
మందేదైనా మితిమీరి తాగిన, విషమౌతుంది జాగ్రత్తరా
నిద్దురా నిద్దుర, ఉన్నోడే రా-దొర
నిద్దురా నిద్దుర, లేనోడే నిరు-పేదరా
ఆడీ పాడీ అలసీ సొలసిన పాపాయి కన్నుల నిద్దుర
ఆస్తులన్ని తాకట్టు పెట్టినా, పొందలేవు దాన్ని గుర్తించరా...
స్కూలులో సోషలు టీచరు పాఠాలు ఇచ్చే నిద్దుర
కొలవలేం క్వింటాలులెన్నో బాటులన్ని కుప్ప పోగేసినా
బస్సులో కిటికీ సీటుకు, ఏ-మత్తు మందు సరి-తూగురా
ఆవలింత అను అంటువ్యాధికి గమ్మత్తే, మందు రాలేదురా
పండించె రైతుకు, పనిచేసె కూలికి సుఖంతోన పని ఏముందిరా
పడుకున్న "చోటే" పూల-పానుపౌ వరమున్న విలువైన దేహాలురా
అమ్మ ఒడికన్న మెత్తగా ఉన్న పరుపు నీకు ఏడ దొరుకేనురా
వెతికి వెతికి వేచారి చివరికి చేరేది నేలమ్మ ఒడికేరా...
నిద్దురా నిద్దుర, ఉన్నోడే రా-దొర
నిద్దురా నిద్దుర, లేనోడే నిరు-పేదరా
-శ్రీ రాత