ఎవరు పార్ట్ 12
కనుమూరి “అసలు ఎం జరిగింది? కాస్త వివరంగా చెప్పండి.”
పోతన వివరించటం మొదలు పెట్టారు “నారాయణ భూపతి గారు చనిపోయిన తర్వాత, ఆయన పెద్ద కుమారుడు ముక్తానంద భూపతి ఎస్టేట్ చూసుకోవటానికి వచ్చారు. ఆయన వచ్చి ఇక్కడ పద్ధతులు చాలా మార్చారు. భూపతిగా కాకుండా మాములు మనిషిగా అందరితో కలిసి ఉండటం, అడిగిన వారికీ సాయం చేయటం, అప్పటి వరకు భూపతి సైన్యంగా ఉండే కాపలా జనాలని, తన వాటాలో పొలాలు దానం చేసి రైతులను చేయటం, ఇలా చాలానే చేసారు.. వచ్చిన వారంలోనే ఊరిలో ఉత్సాహం, సంతోషం నింపారు. కానీ ఆయనను, వాళ్ళ తండ్రి గారు ఒక అమ్మాయిని తీస్కుని వచ్చారు అనే అపవాదు తీవ్రంగా కలత చెందేలా చేసింది.
ఒక రోజు కంగారుగా అతిధి గృహం లోకి వచ్చి నాతో....
“పోతన, తండ్రి గారు పెద్ద తప్పే చేసారు. ఆ అడివి జాతి అమూల్యంగా చూసుకునే అమ్మ వారి విగ్రహం తీసుకుని వచ్చేసారు. ఆ నాయకుడు అది తిరిగి ఇచ్చేయమంటూ చాలా ప్రాధేయ పడుతున్నాడు. అది ఎలాగైనా తిరిగి ఇచ్చేయాలి. వారి సహనం నశించి క్రోధంగా మారే లోపే అది తిరిగి ఇచ్చేయాలి. కానీ అది నాన్న గారు ఎక్కడ దాచారో నాకు తెలియదు. భవంతి అంతా వెతికాను. కనిపించలేదు.”
“అయ్య గారు, అందరూ అమ్మాయి అంటున్నారు, మీరు విగ్రహం అంటున్నారేంటి? విగ్రహం అయితే, నాన్నగారు అమ్మాయిని ఎత్తుకువచ్చారు అనే అపనింద ఎందుకు మోస్తారు? ఆ నాయకుడు, నాన్నగారు దీన్ని ఎందుకు గుట్టుగా ఉంచారు?”
“అంతా ఈ లేఖ వల్ల వచ్చింది. వారి బాష అర్ధం కాక, దీన్ని సరిగా చదవటం రాక, అమ్మి అంటే అమ్మాయి అనుకున్నారు, అమ్మ అని, ఆ అమ్మవారు అని అర్ధం కాక ఈ పుకారు వచ్చింది.”
“నాన్న గారు నిజం చెప్పొచ్చు కదా?”
“పోతన, నీకు అర్థం కావట్లేదు. ఆ విగ్రహం చాలా విలువైనది. ఆ అడివి జాతి వారు కూడా కేవలం నాలుగు నెలల్లో ఒకసారే బయటకు తీసి పూజిస్తారు. అలాంటి విగ్రహం ఉంది అని కానీ, అలాంటి పూజ ఒకటి వారు జరుపుతారు అని కానీ బయట ప్రపంచానికి తెలియదు.
ఆ నాయకుడు, నాన్నగారు అది పుకారు అని చెపితే అసలు విషయం బయట పెట్టాలి కాబటి దీని గుట్టుగా ఉంచారు. పోతన, అది వారికి చేరే వరకు ఈ విషయం మన మధ్యే ఉండాలి. తెలిస్తే విగ్రహం కాపాడుకోవటం అతి కష్టం. వచ్చే పూజకి అది వారికి ఎలాగైనా చేరాలి, లేదు అంటే ఊరు ఊరంతా నాశనం అయ్యే ప్రమాదం ఉంది.”
పోతన మాతో “ఆయన కలవరం చెందటం నన్ను బాగా బాధించింది. నా దురదృష్టం కొద్దీ అదే నేను ఆయనను ఆఖరి సారి చూడటం. అంత మంచి ఆయన అలా అశాంతిగా మరణించటం నాలో నిరాశ నింపింది. ఈ విషయం నేను, తర్వాత వారసుడుగా వచ్చిన భూపతి రాజు గారితో చెప్పాను. కానీ ఆయన అంత పట్టించుకోలేదు.
కానీ ముక్తానంద భూపతి గారి కోసం, తప్పు దారిలో అయినా ఆ విగ్రహం అడివి జాతి వారికి అందజేయాలని అనుకున్నాను. అప్పుడు భూపతి గారి సైన్యంగా ఇంతక ముందు పని చేసిన వారి సహాయం అడిగాను. వారితో కలిసి రాత్రి వేళ ఆ విగ్రహం కోసం వెతకటం మొదలు పెట్టాను. కానీ కొన్నాళ్లకి భూపతి రాజు గారు నన్ను పనిలో నుండి తీసేసారు.”
అలీ “ఆ రోజు పట్నం ఎందుకు వచ్చారు? రాయుడుని ఎందుకు వెంబడించారు?”
పోతన “ఒక రోజు భూపతి రాజు గారు హడావిడిగా దర్శన్ చిత్రపాటి ఇంటికి వెళ్లారు. ఆ విగ్రహం భూపతి గారి కంట పడి దాన్ని తీసుకుని వారి ఇంటికి వెళ్లారు ఏమో అని అనుమానంతో ఆయనను వెంబడించాము. కానీ భూపతి రాజు గారు ఆ విగ్రహం ఆయనకు ఇచ్చినట్టు మాకు అనిపించలేదు. అదే రోజు చిత్రపాటి గారి కూతురు పట్నం బయల్దేరింది. బహుశా ఆమెకు ఇచ్చారు ఏమో అని మాలో ఒక్కరిని పట్నం పంపాము. కానీ అది ఆమె దగ్గర కూడా లేదు. తిరిగి వస్తుండగా మీరు చూసి ఉంటారు.”
కనుమూరి “మరి రాయుడు పత్రాలు ఎందుకు దాచావు?”
పోతన “రాయుడు విషయంలో నేను తప్పు చేశాను. ఈ భవంతి వదిలి నేను ఎప్పుడు ఉండలేదు. నా ప్రాణం ఇక్కడే పోవాలి అనుకునేవాడిని, అలాంటిది రాయుడికి మహేష్ గారు గనక ఉద్యోగం ఇస్తే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. నేను ఎలా పోయిన పర్వాలేదు, కానీ విగ్రహం గురించి తెలుసుకునే అవకాశం పోతుంది అని భయపడ్డా. పత్రాలు దాచి, ఆ పోలీస్ చేత బెదిరిస్తే ఇక్కడ నుండి రాయుడు వెళ్లిపోతాడు, లేదా మహేష్ గారు పత్రాలు లేవు గనక ఉద్యోగం ఇవ్వరు అనుకున్నా. కానీ రెండు జరగలేదు.”
పోతన “క్షమించు రాయుడు.”
“వద్దు తాత. నువ్వు ఆ మాట అనకూడదు.”
పోతన “నా కోసం, ముక్తానంద భూపతి గారి మీద అభిమానంతో మీకు పట్టుబడిన అతను, ఇక్కడికి వచ్చాడే తప్ప, ఎవరికీ హాని తలపెట్టాలి అని కాదు. అతన్ని దయచేసి వదిలి పెట్టండి. దీనికి కారణం నేను గనక శిక్ష నాకు పడాలి.”
కనుమూరి గారు తాత దగ్గరికి వెళ్లి భుజం మీద చెయ్యి వేసి, “అతని గురించి దిగులు వద్దు. మీరు ఇంటికి వెళ్లే సరికి అతను కూడా క్షేమంగా ఇంటికి చేరతాడు.”
పోతన మెల్లగా లేచి, కనుమూరి గారికి నమస్కరించి గదిలో నుంచి వెళిపోతుండగా
“తాత, నువ్వు ఇక్కడే ఉండొచ్చు. లక్ష్మి గారితో నేను మాట్లాడతాను.”
“వద్దు రాయుడు, తప్పు చేసినవారికి ఇక్కడ స్థానం ఉండకూడదు. నీకు వీలైతే ఆ విగ్రహం త్వరగా కనిపెట్టి, ఆ నాయుడికి అప్పగించు. అది చాలు నాకు.”
కనుమూరి గారు ఆయన వెనక వెళ్తూ “అలీ, నీతో కాస్త పని ఉంది నాతో రా” అంటూ పిలిచారు. నా వైపు చూస్తూ కనురెప్పలు ఎగరేస్తూ అలీ కనుమూరి వెనక వెళ్ళాడు. నేను తాత నడుచుకుంటూ వెళ్ళటం చూస్తూ ఉండిపోయాను.
**********
నల్లని చీకటిలో చిన్న వెలుతురు. దగ్గరికి వెళ్తున్నా. అది అమ్మవారి విగ్రహంలా అనిపించింది. అలాగే ముందుకు వెళ్ళాను. చాల దగ్గరగా వెళ్ళాను. దాని వెనక నుండి పెద్ద పెద్ద మంటలు. మంటల్లో కాలిపోతూ ఒక గొంతు “ఈ గజ్జలు మహేష్ గారి గదిలో కనిపించాయి. అది లక్ష్మి గారే”. ఉలికిపడి లేచాను. ఒళ్ళు అంతా చెమటలు. తర్వాత అంతా నిద్ర లేదు. లేచి అలా గుమ్మం దగ్గర కూర్చున్నా. ఎప్పుడు పడుకున్నానో తెలియదు పొద్దునే అలీ నిద్ర లేపాడు.
అలీ “ఏమి భాయ్, అంత మధన పడ్తున్నావ్?”
ఆ కనుమూరి గారి మాటలు గుర్తుకు వచ్చి.
అలీ “ఏవి?”
గజ్జలు చూపించి, ఆస్తి కోసం లక్ష్మి గారు అని మాట్లాడాడు కదా.
“ఏమి భాయ్ నువ్వు కూడానా! అతను పోలీసు, అలానే ఆలోచిస్తారు. అతను అని కోణాలలోను ఆలోచిస్తున్నాడు. ఆమెను ఇష్టపడ్తున్న నువ్వే అనుమానిస్తే ఎలా?”
“అనుమానం కాదు, అదో రకమైన భయం. ఎలా చెప్పాలో నాకు తెలియదు.”
“సరే నాకు చెప్పొద్దు, ఆమెను నువ్వే అడగొచ్చు కదా!”
“ఆలోచిస్తాను. అవును నిన్న నిన్ను ఎక్కడికి తీస్కుని వెళ్లారు?”
“ఏముంది, భూపతి రాజు ఆక్సిడెంట్ అయ్యాక అక్కడ విచారణ చేసిన పోలీసులును కనుమూరి గారు కొన్ని ప్రశ్నలు అడిగారు.”
“ఏమి తెలిసింది?”
“ఏమీ తెలియలేదు. విగ్రహం ఆ కారులో ఉంది ఏమో అని కనుమూరి అనుమానం అనుకుంట. రేపు కారు లోయల్లో నుండి తీయటానికి మనుషులను పురమాయించారు.”
**********
సూర్యుడు అలిసిపోయి వెళిపోతున్న సమయంలో పెరటి లో కూర్చున్నాను. గజ్జల శబ్ధం వినిపించింది. కానీ వెనక్కి తిరగలేదు. లక్ష్మి గారు వెనక నుండి వచ్చి నా పక్కన కూర్చున్నారు. నేను ఏమి మాట్లాడలేదు.
“పొద్దు అంత అందంగా ఉందా! మనసు మాట విననంత!” లక్ష్మి గారు.
ఆమె వైపు చూసి “ఈ ప్రాంతమే ఒక విచిత్రం. ఉదయం మనకి ఏవైతే అందంగా అనిపిస్తాయో, ఈ పొగ మంచు, పక్షుల సందడి, పచ్చని కొండలు, ఎప్పుడూ పడే వర్షం, అప్పుడప్పుడు వెచ్చగా తగిలే సూర్యకాంతి ఇవన్నీ కూడా రాత్రికి అంతే భయాన్ని కలిగిస్తాయి.”
“వాటిలో తేడా లేదు. మన మనసులో తప్ప. నువ్వు భయంతో చూస్తే భయపెడతాయి, ఉత్సాహంగా పలకరిస్తే సంతోషం నింపుతాయి. అనుమానిస్తే ఆందోళన పెంచుతాయి.”
ఆమె మాటలు విని, మళ్ళీ సూర్యాస్తమయం చూస్తూ ఉండిపోయాను.
“ఏమైంది మీకు? ఎందుకు అలా ఉంటున్నారు? పోతనను అనుమానించాను అని బాధపడ్తున్నారా? లేక నేను లక్ష్మి భూపతి, లక్ష్మి కాదు అని దూరం పెడుతున్నారా?”
ఏమి సమాధానం చెప్పాలో తెలియలేదు. ధైర్యం చేసి అడిగాను “మీరు ఆరోజు భవంతిలో లేరా?” అంతవరకూ ప్రేమగా పలకరించిన కళ్ళలో బాధ, కోపం, అసహ్యం. ఆమె కంట తడి నాకు కనిపించకుండా తుడుచుకుని వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. ఆమె మొహం చాటేసిన నిముషం తప్పు చేసానేమో అనే భావన నన్ను కుదిపేసింది. పిలవాలి అనిపించింది కానీ గొంతు పూడుకుపోయింది.
వెళుతున్న ఆమె మీదకు ముగ్గురు అడివి జాతి వారు అమాంతం దాడి చేసారు. నేను ఆమె వైపుకి పరిగెత్తాను. ఆమెపై ముసుగు వేసి తాడుతో కట్టడానికి ప్రయ్నత్నిస్తున్నారు. అందులో ఒకడిని తోసేసి ఆమెను నా వైపు లాగే ప్రయత్నం చేస్తుండగా. నా వెనక నుండి ఇద్దరు వచ్చి నన్ను వెనక్కి లాగారు.
నేను వారిని బలంగా విసిరి ముందుకు వచ్చాను. అంతలో ఒక అతను, తన కత్తిని లక్ష్మి గారికి గురి పెట్టాడు. నేను ఆగిపోయాను. నన్ను వెనక్కి జరగమని సైగ చేసాడు. నా వెనక ఉన్న వారు కూడా, ముందు ఉన్న ముగ్గురితో కలిసి, లక్ష్మి గారిని తాడుతో కట్టేస్తున్నారు.
నాకు ఏమి చేయాలో తెలియలేదు. వాళ్ళతో “నన్ను కూడా మీతో తీస్కుని వెళ్ళండి.”
కానీ వారికీ అర్థం కాలేదు. మళ్ళీ అరిచాను “నన్ను కూడా తీస్కుని వెళ్ళండి.”
అంతలో భవంతిలో పని వారు వచ్చారు. పనివారిని చూసి వారు లక్ష్మిగారికి అపాయం తలపెడతారేమో అని వారిని ముందుకు రావద్దు అని సైగ చేశాను. నేను వంగి చేతులు పైకి పెట్టి, వారి దగ్గరికి వెళ్లి. నాకు నేనే తాడు చేతులకి కట్టుకుని చూపించాను. వారు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. అందులో ఒక అతను వేరే వాడికి వారి భాషలో ఏదో చెప్పాడు. విన్న వాడు ముసుగు ఒకటి తెచ్చి నా మొహం మీద వేసాడు.
*******
- భరద్వాజ్ ( BJ Writings )