పేరులేని బంధం
అమ్మానాన్నలను వదిలి ఉండటం అదే మొదటిసారి. నన్ను హాస్టల్ లో చేర్పించి వారం అవుతూవుంది, కానీ నేను మాత్రం ఇంటిని తలచుకుంటూ ఒక్కడినే దిగాలుగా ఉండేవాడిని. రోజూలాగానే స్కూల్ కి వెళ్లి, అక్కడ చెప్పే పాఠాలు అర్థంకాక, ఆడుకోవడానికి స్నేహితులు లేక చాలా విచారంగా చెట్టు కింద కూర్చొన్నాను.
చెట్టు పై నుండి “భూమ్” అంటూ ఉలిక్కిపడేలా క్రిందకు దుమికాడు. భయంతో నివ్వెరపోయి, గట్టిగా అరిచాను. అక్కడ ఆడుకుంటున్న పిల్లలు, ఉపాధ్యాయులు ఏమిటా అని పరుగున వచ్చారు. కానీ వాడు అక్కడ లేడు, నాకు ఏమి చెప్పాలో అర్థంకాలేదు, అంతమంది చుట్టుచేరగానే నోట్లోనుంచి మాటరాలేదు. కానీ అంతమంది నాతో మాట్లాడటం మొదటిసారి.
మరుసటి రోజు సాయంత్రం వాడు హాస్టల్ లో కనిపించాడు, చూడగానే నాకు భయమేసింది. పిల్లలతో గొడవ పడుతూ, స్కూల్ కి రాక, అల్లరిగా తిరిగేవాడు. రానురాను నా గదిలోని వస్తువులను వాడుకునేవాడు, అక్కడే పడుకునేవాడు. కానీ నాతో మాట్లాడేవాడు కాదు. వాడు చేసే అల్లరి పనులు, గొడవల గురించి తన స్నేహితులతో చెప్పుకొనే వాడు, వాడి వల్లే వాడి స్నేహితులు నాకు పరిచయం అయ్యారు. దానితో ఒంటరిననే భావన కలిగేది కాదు.
సెలవులకు ఇంటికెళ్ళి వచ్చాక, తినడానికి తెచ్చుకొన్న పదార్థాలను నా గదిలోనే తినేవారు. వాడు మాత్రం చదువులో తప్ప మిగిలిన విషయాలలో నేర్పుగా ఉండేవాడు. వాడి కోసం వేతికేవారంతా ముందు నా గదికి వచ్చేవారు. అలా మరింత మంది పరిచయమయ్యారు.
- హనుమంత