మహిళ ఎక్కడ చులకనైపోయింది?
యే పది గంటల పని కోసమో
యే ఓటు హక్కు కోసమో
యే సమానత్వం కోసమో
ఓ జెండా సింధూరపు రంగుని పులుముకొని
ఎన్నో మహిళా పోరాటాలకు
పురుడు పోశాయి!
పోస్తున్నాయి..!!
మరి ఎందుకు?ఈ రాజ్యానికి
మహిళలంటే అంత చులకన
ఏ పాడుబడ్డ పురాణాలలో
దీని పునాదులు దాగి ఉన్నాయో..?
ఏ మనుధర్మ శాస్త్రపు
చెప్పుల కింద మహిళ నలిగిపోతుందో?
బహుశా!
రాముడు సీతని అవమానించినందుకా?
లేక ప్రేమించమని అడిగినందుకు
ఓ స్త్రీ ముక్కు చెవులు కోసినందుకా?
జూదంలో ఓడి పాండవులు
ఆడదాన్ని అమ్ముకున్నందుకా?
లేక
పండును పంచుకున్నట్లు
పాండవులు ఒకే స్త్రీని పంచుకున్నందుకా?
మరి
మహిళ ఎక్కడ చులకన అయిపోయింది ?
ఈ రాజ్యంలో....!
కృష్ణుడు 16,000 మంది గోపికలను
చెలికత్తెలు చేసినందుకా?
పెళ్లి కాకుండా కుంతీ
కర్ణున్ని కన్నందుకా?
లేక
మేరీ కూడా క్రీస్తుని అలాగే కన్నందుకా?
ఎందుకు...???
మహిళ ఇక్కడ చులకనైపోయింది ?
ఓ మహిళా...!
నీకు జరిగిన అన్యాయాన్ని
చదివింది,చూసింది చాలు
ఏ రాజ్యంలోనైనా స్త్రీలు లేని
చరిత్ర లేదని మర్చిపోయావా?
ఆ కాలిపోయిన కాగితాల పగని దాచుకొని
ఆ పురాణపు బూజులను దులిపి
ఇప్పుడు
నీ హక్కుల కోసం
నీపై జరుగుతున్న హత్యలను,
అన్యాయాలను, అవమానాలను,
ఎదురుకోవడానికి ,
మరో మహిళా పోరాటానికి
మరో మైలు రాయి కావాలి..నువ్వు
-విశ్వనరుడు