మేమే కార్మికులం  - కోట

Comments · 245 Views

 మేమే కార్మికులం  - కోట

 మేమే కార్మికులం  

 

తే.గీ.
మే ఒకటిన సెలవు మేలు మీకనుచును 
ఉబుక జేతురు ఈనాడు ఉన్నతముగ 
శ్రమను దోచెదరు పగలు రేయి యనక 
పనికి రాకున్న కూలిచ్చు బాధ్యతనుచు 
2 ఆ.వె.
ఎండ వాన యనక ఏవిరామము లేక 
రక్తము చెమటయ్యి రాలుతుండ 
అలసి సొలసి యైన ఆరాటపడు కూలి 
శ్రమకు విలువ కట్టు రోజు యెపుడు? 
3 ఆ.వె.
కార్మికులకు తగిన కూలి యివ్వని నాడు 
అలిగి పిడికిలెత్తి అడుగు నపుడు 
చిచ్చు రేగినపుడు వచ్చునా లాభాలు 
తగిన కూలి ఇవ్వ దగిన వారు 
4ఆ వె.
శ్రమను యాజమాన్య లాభాలు అనుకుంటు 
స్వార్థ లాభ మనసు స్వారి చేయ 
ఆశకంతు లేక అన్యాయమును చేయు 
పాప పంట పండి పాతరేయు 
5 తే గీ.
శ్రమకు ఫలితము పొందని శ్రామికుడవు 
తిండి లేకున్న పనులు సాధించినావు 
" మర" ల యంత్రాల వేడిలో మగ్గినావు 
త్యాగ జీవిగ నీజన్మ ధన్యమాయె 
6 .తే.గీ.
శ్రమను దోచెడి వారికి సద్దిమూట 
కష్ట పడుచున్న వారికి గంజినీళ్ళు 
న్యాయ దేవత కళ్ళకు నల్లగుడ్డ 
తిరుగ బడితె నీ జాతకం తిరుగ బడును 

                 ..........కోట

Comments