రంగులు మారుతున్నావు...!!!
రాత రాసేది బ్రహ్మదేవుడైనా...
నువు సృష్టి చేసిన నేను నేనుగానే
ఉన్నాను ఎప్పటికి మారలేదు...
ఆశల వ్యామోహాలతో కొట్టుమిట్టాడుతు
నీలోని అనంత రూపాలకు
నన్ను రుద్దుతు గూడు కట్టని క్షణాలతో
రంగులు మారుతున్నావు...
ఆగని కాలంతో నాకు పోటీలేదు
అవకాశాల పాదుల్లో ఆంక్షగా నిలువను
మనస్సుల మధ్యన సంబంధమై
పెరుగుతు మనిషి స్థానాన్ని గుర్తిస్తు...
నా స్పర్శ నీకొక అనుభూతై అనుభవ
జ్ఞానాన్ని నేర్పుతు స్తబ్ధుగానే
చేతులు మారే నిశ్శబ్ద ప్రయాణం...
కులం కాదు తలం లేదు...
కంటి పొరలలో నిండే అందాన్ని
అందరి దృష్టిని ఆకర్షించే ఆనందాన్ని
కొందరి కోసం కాను అందరిలో నేస్తం...
కలగన్న స్వప్నం కాదు పొరబడితే
తిరిగిరాను లోకానికి అవసరం
మితిమీరితే హానికరం...
దాచిన ధనంగా నల్లబడి పోయినా
నీ అత్మను తట్టి చెప్పే అంతరాత్మను...
కష్టించేవాడి చెమటతో స్నానమాడుతు
కష్టానికి ఫలితమవుతు...
అనుకూలిస్తే ఔషదంగాను శృతిమించితే
పాషాణంగాను ఆదిలోను అంతంలోను
ఒకే అనుభూతిని కలిగిన నిజరూప
తత్త్వాన్ని డబ్బును నేను...
దేరంగుల భైరవ (కర్నూలు)