రాస్తున్నా లేఖని...!!!
పదకోశాలకు గుచ్చుకొంటు...
పంక్తినై ఎదచాటున భావాలను
ఏవగింపు చేయక గాయపడని స్పర్శతో
హృదయ స్పందనని తలుపుగా
తెరుచుకొని పొడిచే పోద్దోలే...
నీ ముఖార విందాన్ని మదిలో
తలుచుకొంటు రాస్తున్నా లేఖని...
విచ్చుకొన్న మొగలి రేకులపై
నిలిచిన నీటి బిందువులను విదల్చుతు
తడిసిన ఆనందాన్ని నుదిటికి తిలకంగా
దిద్దుకొని ఎడబాటులో ఎన్నో లౌకికాలకు
సాక్ష్యం లేదో ప్రత్యక్షత తెలిపిన
విన్నపంతో రాస్తున్నా లేఖని...
ప్రతి క్షణానికి పరిచయమవుతు...
నీకోసం శ్వాసల బిగువులతో
రాసుకొన్న సంగతిని ఊహల రెక్కలకు
కట్టి పంపుతున్నా...
చదివిన ప్రతి అక్షరం నీ మనస్సు
అద్దంలో నా ప్రతిబింబాన్ని చూపాలని
కోరుకొంటు రాస్తున్నా లేఖని...
మర్మం రూపం కాదని...
కాలం ఎవరికి తీర్పు చెప్పదని
మహిలో ప్రతి మనిషి ప్రేమకు స్థానమని
ఆకారాన్ని కోల్పోక విషయం తెలుసుకొని
వగచని సందేశం పిలిచిన పేరంటం
కావాలని రాస్తున్నా లేఖని...
-దేరంగుల భైరవ (కర్నూలు)