కనిపించని శిలాఫలకం...!!!
తడిసిన రెప్పలక్రింద స్థావరం
ఎదలోతుల్లో కనిపించని శిలాఫలకం
గడ్డకట్టిన కంటి మీగడలను చిలుకుతు
కఠోర పరిశ్రమలోంచి వచ్చిన మానసిక
శ్రమకు తాలూకే దుఃఖం...
పారదర్శక పదార్థం కాదు
ప్రకృతికి కాచిన చిగురులు కాదు...
కరుణ చేతనో కారుణ్యం చేతనో
మరుపులేక...
మనస్సున అరగని సంబంధాలతో
కరిగిన బరువుగా దిగిపోయే కన్నీటి
ప్రవాహం దుఃఖం...
ఎదలోతుల్లో సంచారం
ఏదరిన గూడుకట్టునో తెలియని వైనం
ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసలతో సహజీవనమై
తటస్థ పడని తన స్పర్శలతో
చెదిరిపోతు తెలియని అలౌకిక చర్యకు
పరిచయమే దుఃఖం...
జీవితసగం నిద్దురకే సంతకం
మిగిలిన సగభాగం పొద్దులతో
నడవడం సుఖ దుఃఖాలు నిర్ణయాలతో
క్రియాశీలకాలే ఆనందమైన దుఃఖమైన
దేహపాలనతో పంచుకొంటు బతుకు
ప్రయాణంలో దుఃఖం ఆహారం కాదు...
సుఖం యొక్క మరో ధృవమే దుఃఖం...
-దేరంగుల భైరవ (కర్నూలు)