ఎవరో ఒకరు ఎపుడో అపుడు

Comments · 187 Views

ఎవరో ఒకరు ఎపుడో అపుడు

ఎవరో ఒకరు ఎపుడో అపుడు
***___***

నువ్వు ఇండియాలో ఉండి ఏం చేస్తావు.  దేశం ఇప్పుడు విడిపోయింది కదా. నువ్వు పాకిస్తాన్‌ ఆర్మీలోకి వచ్చెయ్‌. నీకు ఆర్మీ చీఫ్‌ పదవిని ఇస్తాను. 

తొలి పాకిస్తానీ ఆర్మీ చీఫ్‌గా చరిత్రలో నిలిచిపోతావు’ ఇదీ మహ్మదలీ జిన్నా నుంచి ఆ సైనికుడికి వచ్చిన ఆహ్వానం.

      అంతకు ముందు ఎందరో ముస్లిం ఆర్మీ ఆఫీసర్లు అతడిని కలిశారు. అధికారులు అతడిని కలిశారు. ఒక ముస్లింగా పాకిస్తాన్‌తో చేతులు కలపమని అడిగారు. 

అతని చిరునవ్వు వాళ్లకి ‘అది జరిగే పని కాదు’ అని చెప్పింది. పదవి కులం వంటివి ఆదేశభక్తున్ని ప్రభావితం చేయలేక పోయాయి.... ఆయన ఎవరో కాదు బ్రిగేడియర్‌ మహ్మద్‌ ఉస్మాన్‌.

బెలూచ్‌ రెజిమెంట్‌లో బ్రిగేడియర్‌గా ఉన్న మహ్మద్‌ ఉస్మాన్‌ భారత సైన్యంలోనే ఉండిపోవాలని నిర్ణయించుకుని, దేశ విభజన తర్వాత బెలూచ్‌ రెజిమెంట్‌ను పాకిస్తాన్‌కు కేటాయించగానే ఆయన భారతదేశం కోసం పాక్‌ ఆర్మీ చీఫ్‌ పదవిని వదులుకుని వచ్చేశారు.

దేశ విభజన తర్వాత పాకిస్తాన్ జమ్మూకశ్మీర్‌ను కబళించేందుకు వచ్చినప్పుడు ఆయనకు, ఆయన బ్రిగేడ్‌కి జమ్మూ ప్రాంతంలోని నౌషేరా, ఝాంగర్‌ ప్రాంతాలను కాపాడే బాధ్యతను అప్పగించారు.

ఆయన వ్యూహ రచన, యుద్ధ కౌశల్యం ఎలాంటిదంటే 1948లో నౌషేరా వద్ద జరిగిన పోరాటంలో దాదాపు వెయ్యి మంది పాకిస్తానీలను ఆయన సైన్యం మట్టు పెట్టింది. మరో వెయ్యి మందికి గాయాలయ్యాయి. 

పాకిస్తాన్‌ తోకముడిచింది. నౌషేరా, ఝాంగర్‌లు శత్రువు గుప్పెట్లో నుంచి విముక్తమయ్యాయి. ఈ మొత్తం పోరాటంలో కేవలం 30 మంది భారతీయ జవాన్లు మాత్రమే చనిపోయారు.

దీనితో పట్టరాని కోపంతో పాక్‌ ప్రభుత్వం నేరుగా సైన్యాన్నే పంపించింది. అది మే 1948. పాక్‌ సైన్యం అత్యంత కీలకమైన ఝాంగర్‌, నౌషేరాలను చేజిక్కించుకునేందుకు చేయని ప్రయత్నం లేదు. 

కానీ బ్రిగేడియర్‌ ఉస్మాన్‌ నాయకత్వం, పోరాట పటిమల ముందు వారి పాచికలు పారలేదు. మే లో మొదలైన దాడి జూలై వరకూ కొనసాగింది. 

జూలై మూడో తేదీ, 1948 న పాకిస్తానీలకు, మన సైన్యానికి నౌషేరాలో భీకరమైన యుద్ధం జరిగింది. ఈ పోరాటంలో ఒక ఫిరంగి గుండు నేరుగా బ్రిగేడియర్‌ ఉస్మాన్‌ను తాకింది.

ఆ క్షణంలో ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు ఇవి : ‘నేను చనిపోతున్నాను. కానీ ఒక్క అంగుళం నేల కూడా శత్రువుకి వదలకూడదు’ ఆఖరి ఊపిరితో ఆయన అన్న ఈ మాటలు బ్రిగేడియర్‌ ఉస్మాన్‌ వ్యక్తిత్వానికి, ధీరోదాత్తతకు నిలువెత్తు నిదర్శనాలు. 

బ్రిగేడియర్‌ మాటలు ఆయన సైనికులకు మంత్రాలయ్యాయి. వారు ప్రాణాలొడ్డి పోరాడారు. శత్రువును తరిమికొట్టారు. నౌషేరా, ఝాంగర్‌లు విముక్తమయ్యాయి. త్రివర్ణపతాకం రెపరెపలు మన విజయాన్ని సూచించాయి.

బ్రిగేడియర్‌ ఉస్మాన్‌కు మహావీరచక్ర ప్రదానం చేశారు. ఆయన అంతిమ సంస్కారం ఢిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీలో జరిగింది. నేటికీ ఆయన సమాధి అక్కడ ఉంది.

Comments
Venkata Bhanu prasad Chalasani 29 w

ప్రేరణ కలిగించే రచన.