హనుమంతిని పుట్టినరోజు

Comments · 256 Views

హనుమంతిని పుట్టినరోజు

హనుమంతుని పుట్టినరోజుని చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు జరుపుకుంటారు. ఈ రోజున హనుమద్భక్తులు రోజంతా ఉపవాసముండి, హనుమన్ చాలిసా పఠనం, రామనామ జపం చేస్తారు హనుమంతుని జన్మవృత్తాంతం శివమహాపురాణం, రామాయణం, పరాశిర సంహిత మొదలైన గ్రంథాలలో అనేకానేక గాధలతో వివరించబడి వుంది .హిందూ పురాణ కధల ప్రకారం పుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించెను. కేసరి అనే వానరవీరుడు ఆమెను పెళ్ళాడెను. వారు సంతానము కొరకు భక్తితో శివుని ఆరాధించిరి. అప్పుడు వాయుదేవుడు శివుని తేజమును పండు రూపములో అంజనకొసగెను. అంజనకు జన్మించిన సుతుడే ఆంజనేయుడు. కేసరి నందనుడనీ, వాయుదేవుని అనుగ్రహముతో జన్మించినందున వాయుసుతుడనీ కూడా అంటారు .

ఈ పండుగ ద్వైత సంప్రదాయము ననుసరించి మాధ్యులకు ప్రధానమైనది. వారు హనుమంతుని 'ముఖ్య ప్రాణ దేవరు' అని పిలుస్తారు. హనుమంతుని ఉపాసకులు కూడా ఈ పండుగ జరుపుకుంటారు. శ్రీరామనవమితో పాటు కొందరు ఈ పుట్టినరోజు ను జరుపుటను కూడా ఉంది.పరాశర సంహిత అనే గ్రంథం ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి, శనివారం జన్మించారని తెలిపారు. అదే రోజున కొంతమంది హనుమంతుని పుట్టినరోజు గా జరుపుకుంటారు . అయితే కొన్ని ఐతిహ్యాల ప్రకారం చైత్ర పౌర్ణమి నాడు నికుంభుడు తదిరత రాక్షసులను సంహరించి హనుమంతుడు విజయం సాధించినట్లు కనిపిస్తుంది. ఈ కారణంగా ఆ రోజు హనుమద్‌ విజయోత్సవం చేసుకునే సంప్రదాయం కొన్ని చోట్ల ఉంది. దీన్ని ఉత్తరాదిలో హనుమంతుని పుట్టినరోజుగా చేసుకుంటారు.

ఒకసారి దేవలోకమందు దేవేంద్రుడు కొలువుతీరి యున్న సమయాన పుంజికస్థల అను అప్సరసకాంత బృహస్పతి వద్దకు చేరి హాస్య ప్రసంగము చేయసాగిందట, ఆమె యొక్క హావభావ వికారాలకు బృహస్పతి మిక్కిలి ఆగ్రహించి నీవు భూలోకమందు "వానరస్త్రీ" గా జన్మింతువుగాక! అని శాపము పెట్టినాడు. అంత ఆ పుంజికస్థల తన తప్పిదాన్ని మన్నించి శాపవిమొచనమీయమని పరిపరి విధముల ప్రార్ధించింది. దానికి బృహస్పతి సంతసించి నీవు భూలోకమందు "హనుమంతునికి" జన్మ ఇచ్చిన తరువాత తిరిగి దేవలోకమునకు రాగలవని అనుగ్రహించెను. ఇది కంబరామాయణ గాధలో గల వృత్తాంతము. ఆ శాపకారణంగా "పుంజికస్థల" భూలోకమందు వానరకన్యగా జన్మించి "కేసరి" అను అందమైన వానరాన్ని ప్రేమించి వివాహమాడింది. అంత ఆమె గర్భముదాల్చి శివాంశ సంభూతుడైన "శ్రీ ఆంజనేయస్వామి" కి జన్మ ఇచ్చింది.

హనుమంతుడు సీతా రాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి, మారుతి, అంజనిసుతుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు. దేశవిదేశాల్లో హనుమంతుని గుడి , లేదా విగ్రహం లేని ఊరు అరుదు .

హనుమంతుడు హిందు మతంలో హనుమంతునికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఆనాడు హనుమంతుడు లేకుంటే రాముడు రావణుడిని జయించడం చాల కష్టం అయ్యేది.హిందువులు ఎలా ఉండాలో ధర్మాన్ని ఎలా రక్షించాలి అని హిందూ ధర్మానికి ప్రతీక హనుమంతుడు ?

హనుమంతునికి బాల్యమున అంజనా దేవి పెట్టిన పేరు ‘సుందర’ .సుందర పేరుకు అర్థము అందమైన.పుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించెను. కేసరి అనే వానరవీరుడు ఆమెను పెళ్ళాడెను. కేసరి అనే అతను చాలా బలవంతుడు. అతను మాల్యవంతమనే పర్వతం మీద ఉండేవాడు. మాల్యవంతం అక్కడ ఉన్న పర్వతాల్లో కెల్లా శ్రేష్టమయినది. శంబసాధనుడనే ఒక రాక్షసుడు యజ్ఞయాగాలుకు భంగం చేస్తూ దేవ ఋషులను హింసించేవాడు. దేవ ఋషులు బలవంతుడిగా పేరుబడ్డ కేసరిని పిలిచి శంబసాధనుణ్ణి చంపమని ఆజ్ఞాపిస్తారు. మునులకోరికపై శంబసాధనుడితో యుద్ధం చేసి అతన్ని నిర్జించి దేవ ఋషులకు పీడ తొలిగిస్తాడు. సజ్జన స్వభావం గల అతనికి అంజని అనే భార్య ఉంది. వారు సంతానము కొరకు భక్తితో శివుని ఆరాధించిరి. అప్పుడు వాయుదేవుడు శివుని తేజమును పండు రూపములో అంజనకొసగెను. అంజనకు జన్మించిన సుతుడే ఆంజనేయుడు. కేసరి నందనుడనీ, వాయుదేవుని అనుగ్రహముతో జన్మించినందున వాయుసుతుడనీ కూడా ప్రసిద్ధుడయ్యెను. పుట్టుకతోనే దివ్యతేజస్సు కలిగిన ఆ బాలుడిని అంజనీ పుత్రుడు కనుక ఆంజనేయుడని పిలిచేవారు.

జన్మతః బలసంపన్నుడు అయిన ఆంజనేయుడు ఒకమారు ఉదయించుచున్న సూర్యబింబమును చూచి పండు అనుకొని తినుటకు ఆకాశమునకెగిరెను. అప్పుడు జరిగిన ఘటనలలో ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆ బాలుని దవడ (హనుమ) పై కొట్టెను. అలా కొట్టడం వల్ల ఆ బాలుని దవడకు చొట్ట పడినది. చొట్ట పడిన దవడ కలిగిన వాడవడం చేత హనుమంతుడనే పేరు వచ్చింది. తన కొడుకు దెబ్బ తిన్నందుకు ఆగ్రహించి, వాయుదేవుడు వీచటం మానివేశాడు. అపుడు బ్రహ్మాది దేవతలు హనుమంతునకి అనేక వరాలిచ్చి వాయుదేవుని శాంతింపజేశారు.

ఆ తరువాత అధికంగా అల్లరి చేసే హనుమంతుని మునులు శపించడం వలన అతని శక్తి అతనికి తెలియకుండా అయింది .

ఆంజనేయుడు చిన్నతనంలో ఉన్నప్పుడు ఒంటరిగా నిద్రపోతున్న ఆంజనేయుడిని ఇంటి వద్ద వదిలి పెట్టి పళ్ళు తీసుకొని రావడానికై అడవికి వెడుతుంది అతని తల్లి. ఆకలి వేసి మెలుకువ వచ్చిన ఆంజనేయుడు కళ్ళు తెరుచేసరికి ఎదురుగా ఎర్రని సూర్య బింబం కనిపిస్తుంది. ఆ ఎర్రని బింబాన్ని చూసి పండుగా భ్రమించి పట్టుకు తినడానికి ఒక్కసారి ఆకాశం పైకి ఎగురుతాడు. రివ్వుమని వాయు మనో వేగాలతో సూర్యుడి వైపు దూసుకుపోతున్న ఆ బాలుడిని దేవతలు, మునులు, రాక్షసులు ఆశ్చర్యంగా చూడసాగారు. మహాశక్తిమంతుడైన ఆంజనేయునికి సూర్యుడి వలన వేడి తగలకుండా వాయువు అతనిచుట్టూ చల్లబరుస్తుంది. సూర్యుడు కూడా ఒక్క సారిగా తనవైపుకు దూసుకొస్తున్న పిల్లవాడిని గమనించి పెద్దవాడయిన తరువాత అనేక ఘనకార్యాలు చేసే మహత్తరవీరుడిగా గుర్తించి అతనికి వేడి తగలకుండా తన తేజస్సును తగ్గించుకొన్నాడు. ఆరోజు సూర్యగ్రహణం కావడం వల్ల సూర్యుడ్ఫి పట్టుకోవడానికి రాహువు వేగంగా సమీపిస్తునాడు. అతనికి అపరిమితమైన వేగంతో బాణంలా దూసుకువస్తున్న హనుమంతుడు కనిపించాడు. ఆ పిల్లవాడి తేజస్సు ముందు రాహువు వెలవెల పోయాడు. ఆంజనేయుడు రాహువుకు మరో రాహువులా కనపడ్డాడు. వెంటనే ఇంద్రుని వద్దకు వెళ్ళి తాను చూసింది చెప్పాడు. ఇంద్రుడు వెంతనే ఐరావతం ఎక్కి వజ్రాయుధం తీసుకొని రాహువుతో వచ్చి నిరుపమాన వేగంతో పోతూన్న ఆంజనేయుడిని చూసాడు. వేగంగా వెడుతున్న ఆంజనేయుడికి ఐరావతం తెల్లగా ఒక పండులా కనిపించింది. దాన్ని చప్పున అందుకోబోయాడు. ఇంద్రుడు ఆగ్రహంతో వజ్రాయుడాన్ని ఎత్తి గట్టిగా ఆంజనేయుడి మొహం పైకి విసిరాడు. ఆ వజ్రాయుధఘాతానికి ఆంజనేయుడి ఎడమ చంపకు బాగా నొప్పికలిగి స్పృహ తప్పి కిందకు జారి ఒక పర్వతం పై పడిపోతాడు. వాయుదేవునకు ఇంద్రుడు చేసిన పనికి ఆగ్రహం కలిగింది. లోకాలలో గాలి లేకుండా ఉపసమ్హరించాడు. సకల ప్రాణులు ప్రాణవాయువులేక దేహాలు స్థంబించిపోయాయి. దేవతలందరూ వెళ్ళి జరుగుతున్న ఘోరం గురించి బ్రహ్మ దేవుడికి వివరించారు. బ్రహ్మ అంజనీ దేవి వద్దకు వారిని వెంట పెట్టుకొని వెళ్ళాడు. ఆమె బాల హనుమంతులు ఒడిలో పెట్టుకొని పెద్దగా ఏడుస్తూ ఉంది. బ్రహ్మను చూసి వాయుదేవుడు పాదాలకు నమస్కరించాడు. బ్రహ్మ అతడిని దీవించి తన హస్తాలతో బాల హనుమను ఒక్క సారి నిమురగానే అతని శరీరం పై గాయాలు మాయమై దేహం ప్రకాశవంతమైంది. బ్రహ్మ స్పర్శలోని మహత్తు వల్ల అతడు నిద్ర లోంచి లేచినవాడి వలె లేచాడు. వాయుదేవుడు సంతోషించి తిరిగి గాలిని లోకాలలోకి పంపించి ప్రాణులను రక్షించాడు. లోకంలో వ్యవస్థ మళ్ళీ సక్రమంగా పని చేయడం జరిగింది.

అప్పుడు బ్రహ్మ దేవతలందరినీ ఆంజనేయునికి వరాలు ఇవ్వాల్సిందిగా కోరాడు. ఇంద్రుడు పద్మమాలికనిచ్చి తన వజ్రాయుధం వల్ల హనువు గాయపడ్డదికావున హనుమంతుడిగా పిలువబడతాడని, వజ్రాయుధం వల్ల కూడా అతనికి మరణం ఉండదని చెప్పాడు. సూర్యుడు తన తేజస్సులో నూరోవంతు భాగాన్ని ఇచ్చి సకల శాస్త్రాలూ నేర్పిస్తానన్నాడు. వరుణుడు నీటి వల్ల మరణం సంభవించదన్నాడు. యముడు తన కాలదండం ఇతనిని ఏమీ చేయదని, మృత్యువు లేదని వరం ఇవ్వగా కుబేరుడూ, ఈశానుడూ, విశ్వకర్మ కూడా వరాలిచ్చారు. బ్రహ్మ చిరాయువునిచ్చి బ్రహ్మాస్త్రం ఇతనిని కట్టిపడవేయలేదని మాటిచ్చాడు. శత్రువులకు భయాన్ని, మిత్రులకు సంతోషాన్ని ఇస్తాడని చెప్పి కామ రూపం ధరించగలవాడని అని దీవించి దేవతలని వెంటపెట్టుకొని తిరిగి బ్రహ్మలోకం వెళ్ళిపోయాడు.

రామ లక్ష్మణులు అడవిలో ఉంటుండగా సీతను రావణుడు అపహరించుకొని లంకకు తీసుకొనిపోతాడు. ఆమె జాడకై వెతుకుతూ వారి ఆ పర్వతాన్ని చేరుకొంటారు. వారిని చూసి వాలి తనకోసం ఇద్దరు వీరులను పంపించాడని భావించి సుగ్రీవుడు హనుమంతుడిని వెళ్ళి సంగతి కనుక్కోమని కోరాడు.

హనుమంతుడు బిక్షువుగా రూపం మార్చుకొని రామలక్ష్మణులకు అతిథి పూజ చేసి " అయ్యా! మీరు మహాపురుషులని చూస్తేనే తెలుస్తూంది ధనుర్ధారులై ఇక్కడ సంచరించడానికి కారణం ఏమిటి? నేను సుగ్రీవుడి మంత్రిని. వానరుడిని. కామరూప విద్య తెలిసినవాడిని కావటాన ఈ రూపంలోకి మారాను." అందుకు రాముడు ప్రేమతో హనుమా అని పిలిచాడు వెంటనే హనుమ రాముడికి పాదాభివందనం చేసి నిజ రూపం ధరిస్తాడు. అప్పుడు రాముడు " చూసావా లక్ష్మణా! మనమే సుగ్రీవుని కలవాలని భావించాం. అతని దూత మన వద్దకు వచ్చాడు. ఇతడి సంభాషణలో ఒక్క అపశ్రుతీ లేదు. మహా వ్యాకరణ పండితుడని తెలుస్తూంది. ఎవరినైనా ఇట్టే మాటలతో ఆకట్టుకోగలడు. " అని మెచ్చుకొని తన వృత్తాంతం అంతా చెప్పాడు. అలాగే హనుమంతుడు కూడా సుగ్రీవుని గురించి చెప్పి వారిద్దరినీ తీసుకొని సుగ్రీవునికి పరిచయం చేసాడు. సీతాన్వేషణలో తాము సాయం అందించటానికి అలాగే వాలిని వధించి సుగ్రీవుడిని రాజును చేసే విషయంలో రాముడు సహకరించడానికి ఒప్పందం చేసుకొని అగ్ని సాక్షిగా సుగ్రీవుడు రాముడు స్నేహితులయ్యారు. అనతి కాలంలోనే రాముడు వాలిని వధించి సుగ్రీవుడిని రాజును చేసాడు. రాజయిన తరువాత సుగ్రీవుడు భోగాలను రుచి చూసి రాముడికిచ్చిన మాటను మరచిపోగా లక్ష్మణుడు కిష్కింధకు వచ్చి హెచ్చరించాడు. అప్పుడు సుగ్రీవుడు వానర వీరులను చేరపిలిచి ఒకొక్కరినీ ఒకొక్క గుంపుకు నాయకుడిని చేసి ఒకొక్క దిక్కుకు పంపుతూ కొందరు వానర వీరులతో హనుమంతుడిని దక్షిణ దిక్కుకు పంపాడు. నెల రోజుల గడువులో సీత జాడ కనుగొనాలని షరతు విధిస్తాడు.

వాలి, సుగ్రీవుల మధ్య ఏర్పడిన వైరము కారణముగా సుగ్రీవుడు తన ఆంతరంగికులైన హనుమదాదులతో సహా ఋష్యమూక పర్వతముపై తలదాచుకొనెను. రావణాసురుడు అపహరించిన సీతను వెదకుచు రామ లక్ష్మణులు ఆ ప్రాంతమునకు వచ్చిరి. హనుమంతుడు వారివద్దకు వెళ్ళి పరిచయము చేసుకొని, వారిని తన భుజములపై ఎక్కించుకొని సుగ్రీవుని వద్దకు తీసికొని వెళ్ళి వారికి మైత్రి కూర్చెను.

రాముని చేత వాలి హతుడవగా సుగ్రీవుడు వానర రాజయ్యెను. సీతను వెదకడానికి సుగ్రీవుడు నలుదెసలకు వానర వీరులను పంపెను. అలా వెళ్లినవారిలో, దక్షిణ దిశగా వెళ్లిన అంగదుని నాయకత్వంలోని బృందంలో హనుమంతుడు, జాంబవంతుడు, నలుడు, నీలుడు వంటి మహావీరులున్నారు.

వారు దక్షిణ దిశలో అనేక శ్రమలకోర్చి వెళ్ళినా సీత జాడ తెలియరాలేదు. చివరకు స్వయంప్రభ అనే తపస్విని సహాయంతో దక్షిణ సముద్రతీరం చేరుకొన్నారు. ఆ తరువాత ఏమి చేయాలో పాలుపోక హతాశులై ఉన్న వారికి సంపాతి అనే గృధ్రరాజు (జటాయువు అన్న) సీతను రావణాసురుడు లంకలో బంధించి ఉంచాడని చెప్పాడు.

ఇక నూరు యోజనాల విస్తారమున్న సముద్రాన్ని ఎలా దాటాలన్న ప్రశ్న తలెత్తతింది. చివరకు జాంబవంతుడు హనుమంతుడే ఈ పనికి తగినవాడనీ, తన శక్తి తనకు తెలియదు గనుక హనుమంతుడు మౌనంగా ఉన్నాడనీ చెప్పాడు. ఆ ఆపదనుండి అందరినీ కాపాడడానికి హనుమంతునకే సాధ్యమని చెప్పాడు.

హనుమంతుడు పర్వకాల సముద్రం లా పొంగిపోయాడు. వంద ఆమడల వారాశిని గోష్పదంలా దాటేస్తాననీ, సీతను చూచి వస్తాననీ అందరికీ ధైర్యం చెప్పి మహేంద్రగిరి పైకెక్కాడు.

హనుమంతుని కార్య దీక్ష, సాఫల్యతలు సుందరకాండలో పొందుపరచబడినాయి. సుందరకాండ పారాయణ చేస్తే విఘ్నములు తొలగి కార్యములు చక్కబడతాయని, విజయాలు చేకూరుతాయనీ విస్తారమైన విశ్వాసం చాలామందిలో ఉంది. సుందరకాండలో అనేక శ్లోకాలు ప్రార్థనా శ్లోకాలుగా వాడుతారు.

హనుమంతుడు సన్నద్ధుడై, దేవతలకు మ్రొక్కి, మహేంద్రగిరిపైనుండి లంఘించాడు. దారిలో మైనాకుని ఆతిథ్యాన్ని వినయంతో తిరస్కరించి, సురస అనే నాగమాత పరీక్షను దాటి, సింహిక అనే ఛాయాగ్రాహక రాక్షసిని సంహరించి, రామబాణములా లంకలో వ్రాలాడు. చీకటి పడిన తరువాత లంకిణిని దండించి, మయుని అపూర్వ సృష్టియైన లంకలో ప్రవేశించి, సీతను వెదుకసాగాడు.

చిన్నశరీరము ధరించి, హనుమంతుడు రావణుని మందిరములోనూ, పానశాలలోనూ, పుష్పక విమానములోనూ అన్నిచోట్లా సీతను వెదకినాడు. నిద్రించుచున్న స్త్రీలలో మండోదరిని చూచి సీత అని భ్రమించాడు. మరల తప్పు తెలుసుకొని అన్వేషణ కొనసాగించాడు. సీతమ్మ జాడ కానక చింతించాడు. ఏమిచేయాలో తోచలేదు. ఊరకే వెనుకకు మరలి అందరినీ నిరాశపరచడానికి సిద్ధంగాలేడు.

రామలక్ష్మణులకు, జానకికి, రుద్రునకు, ఇంద్రునకు, యమునకూ, వాయువునకూ, సూర్య చంద్రులకూ, మరుద్గణములకూ, బ్రహ్మకూ, అగ్నికీ, సకల దేవతలకూ నమస్కరించి అశోకవనంలో సీతను వెదకడానికి బయలుదేరాడు. అక్కడ శింశుపా వృక్షము క్రింద, రాక్షసకాంతలచే పీడింపబడుతూ, సింహముల మధ్యనున్న లేడివలే భీతయై కృశించిన సీతను చూచాడు. జాడలెరిగి ఈమె సీతయే అని నిర్ధారించుకొన్నాడు.

అక్కడికి కామాతురుడైన రావణుడు వచ్చి ఆమెను బెదరించి, తనకు వశముకావలెనని ఆదేశించాడు. శ్రీరాముని బాణాగ్నితో లంక భస్మము అగుట తథ్యమని సీత రావణునకు గట్టిగా చెప్పినది. రెండు నెలలు మాత్రము గడువు పెట్టి రావణుడు వెళ్ళిపోయాడు. రాక్షసకాంతలు సీతను నయానా, భయానా అంగీకరింపచేయాలి అని ప్రయత్నిస్తూ ఉండటం వల్ల ప్రాణత్యాగం చేయాలని సీత నిశ్చయించుకొన్నది.

వారిలో సహృదయయైన త్రిజట అనే రాక్షసకాంతకు ఒక కల వచ్చింది. తెల్లని ఏనుగునెక్కి వచ్చి రామ లక్ష్మణులు సీతను తీసికొని పోయినట్లూ, లంక నాశనమైనట్లూ, రావణాదులంతా హతమైనట్లూ వచ్చిన ఆ కల విని రాక్షసకాంతలు భీతిల్లారు. సీతకు శుభ శకునములు కనిపించసాగాయి.

ఇంక ఆలస్యము చేయరాదని, హనుమంతుడు సీతకు కనిపించి మెల్లగా తన వృత్తాంతమునూ, రాముని దుఃఖమునూ వివరించి, రాముడిచ్చిన ఉంగరాన్ని ఆమెకు అందించాడు. సీత దుఃఖించి, అందరి క్షేమసమాచారములు అడిగి, ఆపై రాముని వర్ణించమని కోరింది.

హనుమంతుడు భక్తితో ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు, శుభలక్షణములు గలవాడు, అనన్య సుందరుడు అయిన రాముని, అతని సోదరుడైన లక్ష్మణుని వర్ణించగా విని సీత ఊరడిల్లినది. హనుమంతుని ఆశీర్వదించి, తన చూడామణిని ఆనవాలుగా ఇచ్చింది. రెండు నెలలలో రాముడు తనను కాపాడకున్న తాను బ్రతుకనని చెప్పినది.

ఇక హనుమంతుడు పనిలో పనిగా రావణునితో భాషింపవలెననీ, లంకను పరిశీలింపవలెననీ నిశ్చయించుకొన్నాడు. వెంటనే ఉగ్రాకారుడై వనమునూ, అడ్డు వచ్చిన వేలాది రాక్షసులనూ, రావణుడు పంపిన మహా వీరులనూ హతముచేసి, కాలునివలె మకరతోరణాన్ని అధిష్ఠించి కూర్చున్నాడు. చివరకు ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి వివశుడైనట్లు నటించి రావణుని వద్దకు వెళ్ళాడు. సీతమ్మను అప్పజెప్పి రాముని శరణువేడి, లంకను కాపాడుకోమనీ, ప్రాణాలు దక్కించుకోమనీ హితవు చెప్పాడు. రావణుడు ఉగ్రుడై హనుమంతుడిని చంపమని ఆజ్ఞపించగా విభీషణుడు అన్న అతిథిగా వచ్చిన వానరుడిని చంపితే పాపం తగుల్తుంది అని చెప్పగా రావణాసురుడు తోకకు నిప్పు పెట్టమని ఆదేశించాడు. కాలిన తోకతో హనుమంతుడు లంకను దహించి, మరొక్కమారు సీతను దర్శించి, మరల వెనుకకు ప్రయాణమై మహేంద్రగిరి పై వ్రాలాడు.

"చూచాను సీతను" అని జరిగిన సంగతులన్నీ సహచరులకు వివరించాడు. ఆపై అంతా కలసి సుగ్రీవుడు, రామలక్ష్మణులు ఉన్నచోటకు వచ్చి సీత జాడను, ఆమె సందేశమును వివరించారు. ఆపై చేయవలసినది ఆలోచించమని కోరారు.

హనుమంతుడు చేసిన మహోపకారానికి రాముడు "ఇంతటి క్లిష్టకార్యమును మరెవ్వరు సాధింపలేరు. మా అందరి ప్రాణములను నిలిపిన ఆప్తుడవు నీవు. నీవంటి దూత మరొకరు లేరు. గాఢాలింగనము కంటె నీకు నేనేమి బహుమానము ఇవ్వగలను" అని హనుమను కౌగిలించుకొనెను . తరువాత అందరూ తర్కించి యుద్ధమునకు నిశ్చయించారు. లంకానగరం స్వరూపాన్ని, భద్రత ఏర్పాట్లను వివరంగా రాముడికి హనుమంతుడు చెప్పాడు.

శరణు జొచ్చిన విభీషణుని మిత్రునిగా ఆదరించమని హనుమంతుడు సలహా ఇచ్చాడు. సరైన సమయము చూసి, నీలుని నాయకత్వములో బ్రహ్మాండమైన కపిసేన దక్షిణమునకు పయనమై సాగరతీరము చేరుకొన్నది.

వానరవీరులకు, రాక్షస సేనకు మధ్య మహాభీకరమైన యుద్ధం ఆరంభమైంది. ఆ యుద్ధంలో అనేకమంది రాక్షసులు హనుమంతుని చేతిలో మరణించారు. అలా హనుమ చేత నిహతులైన రాక్షసులలో ధూమ్రాక్షుడు, అకంపనుడు, దేవాంతకుడు, త్రిశిరుడు, నికుంభుడు వంటి మహావీరులున్నారు.

రావణుని శక్తి అనే అస్త్రాన్ని ఉపయోగించగా దానిని అడ్డుకోడానికి ప్రయత్నించి మూర్ఛిల్లిన లక్ష్మణుడుని చూసి రావణుడు రథం దిగి లక్షణుడిని లేపడానికి వస్తాడు విష్ణు అవతారం అయిన లక్ష్మణుడు భూమికి అతుక్కుపోయి బరువుగా అవుతాడు రావణుడు లేపడానికి వంగినప్పుడు అప్పుడే స్పృహలోకి వచ్చిన హనుమంతుడు వేగంగా వచ్చి కడుపులో ఒక గుద్దు గుద్దాడు అక్కడే మోకాళ్ళ మీద కూర్చున్నాడు రావణుడు. వెంటనే హనుమంతుడు లక్షణున్ని జాగ్రత్తగా ప్రక్కకు తీసికొని వచ్చాడు. తరువాత రాముడు హనుమంతుని భుజాలమీద ఎక్కి రావణునితో యుద్ధం చేశాడు. కుంభకర్ణుడు కూడా హతమైన తరువాత ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రం వల్ల చాలా మంది వానరులు హతులయ్యారు. రామ లక్ష్మణులు, మిగిలిన వానరసేన వివశులయ్యారు. వారిని విభీషణుడు, హనుమంతుడు వెదుకసాగారు. అప్పుడు జాంబవంతుడు కొద్దిగా తెలివి తెచ్చుకొని "అంజనాకుమారుడు ఆంజనేయుడు చిరంజీవిగానే ఉన్నాడు గదా?" అని అడిగాడు. అలా అడిగినందుకు విభీషణుడు ఆశ్చర్యపడగా జాంబవంతుడు ఇలా అన్నాడు "హనుమంతుడు సజీవుడుగా ఉంటే వానరసేన చచ్చినా బతికి తీరుతుందన్నమాటే. దీనికి వ్యతిరేకంగా జరిగితే మేము బ్రతికియున్నా మృతులమే! వేగంలో వాయువుతోనూ, పరాక్రమములో అగ్నితోనూ సరిసమానుడయిన హనుమంతుడుంటేనే మాకు ప్రాణాలపై ఆశ ఉంటుంది" అని జాంబవంతుడు హిమాలయపర్వతం మధ్యలో ఉన్న ఓషధీ పర్వతము మీది సంజీవని ఓషధులను తీసుకు రమ్మని హనుమను కోరాడు .
జాంబవంతుని కోరికపై హనుమంతుడు రామ చంద్రునికీ, సాగరునికీ నమస్కరించి, తానే ఒక పర్వతంలా పెరిగి సుదర్శనంలా ఆకాశంలోకి దూసుకుపోయాడు. ఆకాశమార్గాన సంజీవని పర్వతం మీదికి వెళ్లి ఓషధులకోసం వెదకసాగాడు. ఓషధులు కనిపించనందున హనుమ ఆ పర్వతాన్ని సమూలంగా ఎత్తిపట్టుకొని, నింగిలో మరో సూర్యునిలా, యుద్ధరంగానికి వచ్చాడు. రామ లక్ష్మణులూ, మిగిలిన వానరులూ సృహలోకి వచ్చారు. విగతులైన వానరులు కూడా పునరుజ్జీవితులైనారు. తరువాత మళ్ళీ పర్వతాన్ని తీసికొని వెళ్ళి హనుమంతుడు యథాస్థానంలో ఉంచి వచ్చాడు.

తరువాతి యుద్ధంలో లక్ష్మణుని చేతిలో ఇంద్రజిత్తు మరణించాడు. మరునాటి యుద్ధంలో రావణుని శక్తికి లక్ష్మణుడు మూర్ఛిల్లాడు. రాముడు దుఃఖితుడయ్యాడు. సుషేణుని కోరికపై హనుమంతుడు మరలా హిమాలయాలలో ఉన్న ఓషధుల పర్వతం సంజీవనిని తీసుకొని రాగా ఆ ఓషధులను ప్రయోగించి సుషేణుడు లక్ష్మణుని స్వస్థునిగా చేశాడు.

మరుసటి రోజు రాముడు,రావణుడుల మధ్య పోటాపోటీగా అస్త్రాలు విడిచిన రావణుడు మరణించడం లేదని రాముడు ఆశ్చర్యానికి గురైనప్పుడు రావణుడి సోదరుడు విభీషణుడు రావణుడి మరణం అతని నాభిలో ఉందని చెప్పగా రాముడు అస్త్రాన్ని వదిలినప్పుడు హనుమంతుడు వాయుదేవుడికి స్మరిస్తూ అస్త్రం నాభికి పోవాలని వేడుకుంటాడు అలాగే జరిగి రావణాసురుడు మరణించాడు. యుద్ధానంతరం రాజ్యాభిషిక్తుడైన విభీషణుని ఆజ్ఞతో హనుమంతుడు లంకలో ప్రవేశించి సీతకు విజయ వార్త చెప్పాడు. సీత అగ్ని ప్రవేశానంతరం సీతారామలక్ష్మణులు అయోధ్యకు వచ్చారు. వైభవంగా పట్టాభిషేకం జరిగింది

Comments
Venkata Bhanu prasad Chalasani 29 w

ఆంజనేయ స్వామి కధను చక్కగా వివరించారు.