పెంకుటిల్లు

Comments · 145 Views

పెంకుటిల్లు  -ఉమాదేవి ఎర్రం

పెంకుటిల్లు

 

మా అమ్మ వాల్లది పెంకుటిల్లు కానీ
ఎంతో బాగుంటుంది..
వెనుకకు ముందుకు సైడులకు  పెద్ద జాగా ముందటికి గేటు ..గేటులోంచి లోపలకు వస్తుంటేనే స్వాగతం పలుకుతుంటాయి కొబ్బరి చెట్లు వాటి పక్కనే ఓ జామ చెట్టు,దాని పక్కనే మునగ చెట్టు ఇక కొంచం నడిస్తే ఇంటి గుమ్మం అదీ రెండు పోర్షన్లుగా మెుత్తం తొమ్మిది రూంలతో ఇల్లు అవన్నీ దాటాక వెనుకకు వంట ఇల్లు దానికి ఎదురుగా బావి ఆ తరువాత అంతా ఖాళీ జాగా మళ్లీ జామ చెట్టు,దానిమ్మ చెట్టు, గులాబీ,మల్లె,మందారం,కనకాంబరాలు,చేమంతులలాంటి పూల చెట్లు ఎంతో ఆహ్లాదంగా బృందావనాన్ని తలపించే అందమైన పెంకుటిల్లు..
నేను ఆ ఇంట్లోనే పుట్టి పెరిగాను..
మా అమ్మ చేసి పెట్టే వంటలు ఆ జామ చెట్టు కింద కూచుని తినే వాల్లం వెన్నెల్లో ఇంటి ముందు చాపలు పరుచుకుని భోజనం చేస్తుంటే ఉండేది మజా! 
ఆ ఇంటికి తగ్గట్టే పది మందిమీ ఉండే వాల్లం ఇంకా మాకు ఆరు రూములుంచుకుని మిగతా మూడు రూములు కిరాయకిచ్చేది అమ్మ..మేము మాతో పాటు కిరాయి వాల్ల పిల్లలతో ,వచ్చీ పోయే బంధువులతో
ఇక ఆ ఇంట్లో ఎప్పుడూ సందడే!
అసలు ఇళ్లు ఇరుకు అని ఎప్పుడూ అనిపించలేదు..
ఎంత మంది వచ్చినా,బహుశ మనసులు విశాలంగా ఉండేమెా ఇళ్లు ఇరుకు అనిపించ లేదు..
భలే ఉండేదండి మా పెంకుటిల్లు..


  -ఉమాదేవి ఎర్రం..
ఇది నా స్వంత రచన..

Comments