కువకువలు
అమ్మా నాన్నకు అనురాగాల దివ్యలు
పసితనపు గూటిలోని గువ్వలు.
ఇరువురి హృదయాల
ప్రేమ కుసుమాలు ఈ గూటిలోని గువ్వలు.
కువకువల గుసగుసలతో హృదయాన్ని
అమృత పలుకులతో చిలికే
ఆనందాల పసికోనలే ఈ గూటిలోని గువ్వలు..!
మమకారాలను పంచుతూ
అనుదినము వారి వృద్ధికై శ్రమిస్తూ
ఇరువురు ఎంతో కష్టపడేను
గూటిలో ఉండే పసి కూనలకై.
అహర్నిశలు కష్టపడుతూ పైసా పైసా
కూడబెట్టి గువ్వల కడుపు నింపుతూ!
వారికి విద్యాబుద్ధులు నేర్పుతూ
అనురాగాలను హృదయంలో నింపుకొని !
వారి ఇష్టాలను పక్కన పెట్టేసి
పసి కూనల బాధ్యతలకై అనునిత్యం
సమస్యలతో పోరాడుతూ!
వారి ఎదుగుదలే వీరి ధ్యేయంగా
భావించి గొప్ప స్థాయిలో చూడాలని
వారిని చూసి మురిసిపోవాలని
కలలగనే అందమైన జంటల గూడు.
మమతను పంచే అమ్మానాన్నలను
పసితనపు మధుర సంగతులను
మరచి రెక్కలొచ్చిన గువ్వలై ఎగిరిపోతున్నారు
జీవిత సాఫల్యాల కోసం కొందరు .
గూటిలోని గువ్వలను గుండెలో
పెట్టుకున్న ఆ ప్రేమానురాగాలను
మరువలేని తల్లిదండ్రులు..
గుండె భారమై గుబులు చెందుతూ
చింతను నలుగురితో పంచుకోలేక
ఆ మమత పెట్టే బాధను తట్టుకోలేక
సతమతమతం చేసే అనురాగాల
ప్రేమ బంధాలు ఈ గూటిలోని గువ్వలు..
ఈ గూటిని ఎప్పుడూ మరువక
వీలైనప్పుడల్లా ఆనందాల వసంతం
చల్లుతూ అమ్మానాన్న హృదయాలు మైమరిపిస్తూ ,
గుసగుసలు ఎప్పుడూ ఆ ఇంటిని
వీడిపోవని ధైర్యం ఇస్తూ సాగాలి
ఈ గూటిలోని గువ్వలు
-ఆలపాటి వారి అమ్మాయి సత్యవతి