తృష్ణ

Comments · 42 Views

రవీంద్ర భారతి స్టేజ్ పై జరుగుతున్న నాట్యాన్ని దీక్షగా చూస్తోంది శారద ఎంత దీక్షగా అంటే తన చుట్టూ ఎవరూ లేరు అ?

తృష్ణ


రవీంద్ర భారతి స్టేజ్ పై జరుగుతున్న నాట్యాన్ని దీక్షగా చూస్తోంది శారద ఎంత దీక్షగా అంటే తన చుట్టూ ఎవరూ లేరు అన్నంతగా మర్చిపోయి శారద నాట్యాన్ని దీక్షగా చూస్తూ కూర్చుంది. ఇంతలో లేచి నిలబడింది. గబగబా స్టేజ్ పైకి ఎక్కి చీరను పైకి దోపి నాట్య వాయిద్యాలకు అనుగుణంగా నృత్యం చేయడం మొదలుపెట్టింది చుట్టూ ఉన్న వారంతా ఆశ్చర్యపోయి చూస్తున్నారు అక్కడ నాట్యం చేస్తున్న అమ్మాయి అయితే ఏం జరుగుతుందో కూడా తెలియనంతగా ఆశ్చర్యపోయి పక్కకు జరిగింది వాయిద్యాలకు అనుగుణంగా ముద్రలు వేస్తూ నాట్యం చేయడం మొదలు పెట్టింది కింద సీట్లో కూర్చున్న ఆమె భర్త చక్రధరరావు ఆశ్చర్యపోయి చూస్తున్నాడు అలా ఆమె నాట్యం చేస్తూ స్టేజి చివరికి వచ్చింది అయినా ఆమె నాట్యం చేస్తూనే ఉంది ఆగకుండా అలా నాట్యం చేస్తూ చేస్తూ సొమ్మసిల్లి కింద పడిపోయింది వెంటనే అక్కడ ఉన్న నిర్వాహకులు అంతా గబగబా ఆమె దగ్గరికి వచ్చారు చక్రధర రావు కూడా స్టేజ్ పైకి వచ్చి నిర్వాహకుల సహాయంతో ఆమెను కారు వరకు తీసుకువచ్చారు. కారులో ఎక్కిన తర్వాత దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తీసుకొని వెళ్లారు.

 

 ఆమె నాట్యానికి అక్కడ ఉన్నవాళ్లంతా మంత్రముగ్ధులై చూస్తూ అలా జరగగానే అందరూ ఆమె గురించి మాట్లాడుకోసాగారు... "అబ్బా ఎంత బాగా చేసింది అంత వయసులోనూ చాలా బాగా చేసింది. అమ్మాయి చేసిన దానికన్నా ఆవిడ చేసిన నాట్యం చాలా బాగుంది. అమ్మాయి చేసిన నాట్యంలో చాలా తప్పులున్న ఆమె చేసిన దాంట్లో ఒక్క తప్పు కూడా లేదు", అంటూ నాట్యాచారుల వారు తన శిష్యులతో చెప్తుంది చెప్తున్నారు. 

 

కారు హాస్పిటల్ ముందు ఆగింది చక్రధరరావు కారు దిగి గబగబా లోపలికి వెళ్లి కాంపౌండర్స్ ని పిలిచాడు వాళ్ళు వచ్చి స్ట్రచర్ లో శారదని హాస్పిటల్ లోపలికి తీసుకువెళ్లారు. ఆమెని అడ్మిట్ చేసుకున్న తర్వాత డాక్టర్ ఆమెను పరీక్ష చేసింది.  ఏమైంది డాక్టర్ అన్న చక్రధర రావు ప్రశ్నకు ఆవిడ, "ఆవిడ మానసికంగా చాలా స్ట్రెస్ కి లోనైంది కాబట్టి అలా పడిపోయింది రేపొద్దున వరకు సర్డుకుంటుంది. అంతవరకు తనకు రెస్టు చాలా అవసరం అలాగే ఇంటికి వెళ్ళాక ఆమెను ఎక్కువగా ప్రశ్నలు వేసి విసిగించవచ్చు ప్రశాంతంగా ఉండేలా చూడండి భయం లేదు". అంటూ చక్రధర రావు భుజం తట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. 


డాక్టర్ వెళ్లిపోయాక చక్రధర రావు కూతురికి, అల్లుడికి, కొడుకుకి, కోడలికి ఫోన్ చేసి విషయం చెప్పాడు దాంతో గంటలో అందరూ హాస్పిటల్ ముందు ఉన్నారు. అమ్మకి ఏమైంది అంటూ చక్రధర రావు జరిగిన విషయం అంతా వారికి చెప్పాడు దాంతో అందరూ ఆశ్చర్యపోయారు తల్లి ఇలా చేసిందంటే ఎవరు అసలు నమ్మలేకపోయారు నిజమా నిజమా అంటూ ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు. 

తెల్లారింది 10 గంటలకు శారద కళ్ళు తెరిచింది తాను ఎక్కడ ఉన్నది గ్రహించి నీరసపడుతుంది డాక్టర్ వచ్చి పరీక్ష చేసి అంతా నార్మల్ గా ఉంది ఈ మందులు వాడమని కొన్ని మెడిసిన్స్ రాసిచ్చి డిశ్చార్జ్ చేశారు. 
శారదను భర్త ఇంటికి తీసుకొచ్చాడు పిల్లలు కూడా అందరూ వచ్చారు ఇంట్లోకి వచ్చాక శారదను విశ్రాంతిగా గదిలో పడుకోబెట్టి చక్రధర్ బయటికి వెళ్లాడు డాక్టర్లు ఇచ్చిన మందుల వల్ల నిద్రలోకి జారుకుంది శారద.

కోడలు వంటింట్లో వంట చేస్తుంటే కూతురు సహాయం చేసింది ఇద్దరు వంట పూర్తి చేసి వచ్చి అందరూ హాల్లో కూర్చున్నారు తండ్రిని చూస్తే కూతురు ఏంటి నాన్న అమ్మ అలా చేయడమేంటి ఇన్నేళ్లుగా అమ్మ ఎప్పుడు ఇలా చేయలేదు మా చిన్నప్పుడు కూడా అమ్మ చిన్న డాన్స్ చేసినట్టు కూడా మాకు గుర్తులేదు ఏంటి నాన్న ఇదంతా అంటూ అడిగింది. అప్పుడు నోరు విప్పాడు చక్రధరరావు.

నేను శారదాన్ని పెళ్లి చేసుకునే నాటికి ఆమె వయసు 17 సంవత్సరాలు అప్పటికి ఆమె నాట్యం నేర్చుకుంటుంది అని తెలుసు అంతే తప్ప నాకు ఇంకేం తెలియదు నాకు అమ్మాయి నచ్చడంతో నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పడం వెంట వెంటనే ముహూర్తాలు పెట్టించడం పెళ్లి జరిగిపోవడం జరిగింది. 
పెళ్లి తర్వాత శారద రెండు మూడు సార్లు నన్ను నేను నాట్యం నేర్చుకుంటాను అని అడిగింది కానీ ఇంట్లో ఉన్న బాధ్యతల వలన నేను తనని వారించాను.

 అంతే అప్పటినుంచి శారద నన్ను ఆ మాట ఇంకెప్పుడూ అడగలేదు ఆ తర్వాత మీరు పుట్టడం మీ చదువులు పెళ్లిళ్లు బాధ్యతల్లో పడిపోయింది నువ్వు పుట్టిన తర్వాత కూడా నీకు నాత్యాన్ని నేర్పించాలని అనుకుంది కానీ నీకు ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల నువ్వు నేర్చుకోలేదు అంతే ఇప్పుడు బాధ్యతలన్నీ తీరిపోయిన తర్వాత రవీంద్రభారతిలో ప్రోగ్రాం ఉందని ఇన్విటేషన్ రావడంతో మేము అక్కడికి వెళ్ళాము.

 నేను శారద నాట్యాన్ని చూస్తుంది అని అనుకున్నాను కానీ ఇలా చేస్తుందని అసలు అనుకోలేదు అంటూ వివరించాడు నేను తన మనసును గుర్తించలేకపోయాను తనలో ఉన్న కళ ను కప్పి పెట్టాను. అది ఆమె మనసునీ ఎంతగా బాధించిందో గమనించలేదు. అప్పుడే నేను తను నాట్యం నేర్చుకుంటా అన్నప్పుడు నేర్పిస్తే శారద ఇప్పటికి గొప్ప నాట్యకారిణి అయి ఉండేదేమో తనలో ఉన్న తపనను, ఆవేదనను,ఆర్తి గుర్తించలేక పోయాను. ఒక విధంగా నేను చాలా తప్పు చేశాను ఆ తప్పుకు శిక్షగా ఇప్పుడు శారద ఇలా బెడ్ మీద.... అంటూ కళ్ళల్లోకి నీళ్లు తీసుకున్నాడు ఏవండీ అంటూ చక్రధరరావు దగ్గరికి వచ్చి కూర్చుంది శారద. ఎప్పుడు వచ్చిందో కానీ అంతా విన్నట్లు ఉంది. 

ఇందులో మీ తప్పేం లేదండి అప్పటి పరిస్థితుల ప్రభావం వలన నేను నాట్యం నేర్చుకుంటా అంటే నాన్నగారు ఒప్పుకోలేదు. కానీ నాన్నకు తెలియకుండా నేను పాఠశాలలో నాట్యాన్ని నేర్చుకున్నాను ఇంకా కాస్త నాట్యం చేయాలని ఉన్నప్పుడే మీతో పెళ్లి జరిగింది. నేను మీరు నాట్యం నేర్పిస్తారేమో అందులో చేర్పిస్తారేమో అని అనుకొని అడిగాను కానీ నా ఆశ తీరలేదు మీరు వద్దన్నారు.

 కానీ ఇన్ని రోజులు తర్వాత ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఆ నాట్యం చూస్తున్నప్పుడు అక్కడ అమ్మాయి చేసే తప్పుల్ని భరించలేక పోయాను. అందువల్లే లేచి వెళ్లి నాట్యం చేశాను అంటూ స్పృహ తప్పి పడిపోతున్న తల్లిని అమ్మ అంటూ వచ్చి పట్టుకుంది కూతురు వైష్ణవి. ఆమెను ప్రశాంతంగా ఉంచండి అని డాక్టర్ అన్న మాటలు గుర్తు చేసుకుని చాలా తప్పు చేశాను. నన్ను క్షమించు శారద అప్పుడే నువ్వు అడిగినప్పుడు నీకు నాట్యం నేర్పించి ఉంటే ఇప్పుడు నేను నిన్ను ఈ స్థితిలో చూసేవాన్ని కాదు తప్పు నాదే అంటూ మౌనంగా రోదిస్తున్నాడు చక్రధరరావు. 
**

కొన్నాళ్ల తర్వాత ఆ ఇంటి ముందు ఒక కొత్త బోర్డు వెలసింది అదే శారద నృత్య  శిక్షణా కేంద్రం అని ,ఇప్పుడు శారద విద్యార్థులకు నాట్యం నేర్పిస్తూ ప్రశాంతంగా ఉంది ఇన్నాళ్లు తనలో ఉన్న కళ ను మరుగున పరుచుకొని,కుటుంబం కోసం బాధ్యతల కోసం, తన ఇష్టాన్ని చంపుకున్న శారద ఇప్పుడు ఆనందంగా భర్త పిల్లల సహకారంతో తనలోని కళాతృష్ణను తన విద్యార్థుల ద్వారా తీర్చుకుంటుంది.

ఈ రచన నా సొంతమే అని హామీ ఇస్తున్నాను 
భవ్యచారు

Comments