పదండి..
అదేమిటో తెలతెలవారుతుంటే
జ్ఞాపకాలు అలుక్కుపోతుంటాయి
కాగితమ్మీద పిచ్చిగీతల్లా
ఉదయం ఓ 'లుక్కే'సిందంటే చాలు
అద్దం మీద మరకను తుడిచేసినట్టు
మనసో తెల్లకాగితమైపోయేది
ఉదయపు వెలుగు స్నానంతో
కాచిన వెన్నలాంటి
కొత్త ఆలోచనలు వికసిస్తుంటాయి
అవి కవితగా మారొచ్చు
కథావతారమెత్తొచ్చు
ఈ నరావతారంలో అవేమీ వద్దనుకుంటే
నడిపే ఇంధనమై ధనప్రాప్తి కలగొచ్చు
కలలు కాలం వాకిటి దగ్గరే ఆగిపోతే
ఉదయం హృదయం తలుపులు తెరుస్తుంది
సంధిగ్ధ మౌనానికి తెరిపిస్తుంది
అసంబద్ధ ఆవేదన కళ్ళు తెరిపిస్తుంది
చీకటిలోంచి వెలుగు ప్రయాణం
చేయాలంటే
వెచ్చని తలపులను దండచేసి
ఉదయపు గుమ్మానికి వేలాడతీద్దాం..పదండి..
- సి.యస్.రాంబాబు