బాలికా దినోత్సవ అశుభాకాంక్షలతో
అదొక పెద్ద గురుకులం అందులో వెయ్యి కి పైగా ఆడపిల్లలు చదువుకుంటున్నారు. అందులోనే హాస్టల్ వసతి కూడా కల్పించింది ప్రభుత్వం గిరిజన ఆడపిల్లలు ఖచ్చితంగా చదువుకోవాలనే ఉద్దేశ్యంతో.
పేరుకే అది గురుకులం కానీ అక్కడ సరియైన ఉద్యోగులు, వంటవాళ్ళు తక్కువే... వసతులు తక్కువే అయినా తమ పిల్లలు బాగా చదవాలంటే అవన్నీ చూడకుండా సర్డుకొమ్మని తల్లిదండ్రులు చెప్పడం వల్ల ఆ బాలికలకు కూడా చదువంటే ఉన్న ఇష్టంతో ఏమి లేకపోయినా కూడా అన్నిటికీ సర్దుకుపోతూ చదవడమే ధ్యేయంగా ఉంటున్నారు.
ఉడికి ఉడకని అన్నం, పురుగులు పట్టిన పప్పు, మురిగిపోయిన కూరగాయలతో ముద్దగా అయిన అన్నం గొంతు దిగక పోయినా కూడా దిగమింగుతూ చదువుకోవాలనే తపనతో కష్టం అయినా ఇష్టంగానే చదువుతున్నారు.
చలికి గజగజ వణుకుతున్నా, వర్షానికి పై కప్పులు కురుస్తున్నా, చాలి చాలని దుప్పట్లు ఇచ్చినా, ఎలాగో సర్దుకుంటూ, ఇంటి దగ్గర అయితే ఈ మాత్రం తిండి రెండూ పూటలా దొరకని వారు ఎలాగో సర్దుకుంటూ చదువుకునే అవకాశం ఉండడమే ఎక్కువని భావిస్తూ ఉంటున్నారు.
అప్పటికి రెండు మూడు సార్లు అడిగితే అడిగిన వారికి తప్ప మిగిలిన వారందరికీ అన్నం పెట్టారు. ఇక ఆకలికి తాళలేక ఏమి అడగకుండా మిన్నకుండి పోయారు. దొరికిందే ఎక్కువని అనుకుంటూ అన్ని రహస్యాలు తనలోనే దాచుకుంటూ తల్లిదండ్రులు వచ్చినప్పుడు సంతోషంగా ఉన్నట్టు నటించలేక సతమతం అవుతున్నారు.
ఇక ఆడపిల్లలు అందులోనూ గిరిజనులు అయిన వారి పై అక్కడ పని చేసే వారికి ఏ కనికరం లేదు. ఒక్కో రోజు ఒక్కొక్కరు ఒక్కో తరగతి పనులు చేయాలి అంటే ఉడవడం, వంట దగ్గర సహాయం చేయడం, కూరగాయలు కోసి ఇవ్వడం, అవసరమైతే బాత్రూంలు కడగడం, అవసరం లేకపోయినా అక్కడి ఉద్యోగుల పాదాలు వత్తడం. రాత్రులు వారికి సేవ చేయడం వారి నిత్య కృత్యం.
అక్కడ పనిచేసే ఉద్యోగులలో చాలామంది మగవాళ్ళు ఉన్నారు. నిజానికి ఆ గురుకులంలో ఆడవాళ్లు తప్ప మిగిలిన వాళ్ళు ఉండకూడదు కానీ ప్రభుత్వాన్ని నిర్లక్ష్య ధోరణితో సగం సగం మందిని వేశారు అందులోనూ ఆడవాళ్ళకి వాళ్ల సంసారాలు ఉంటాయి కాబట్టి వాళ్లు రాత్రులు ఉండరు పొద్దున వచ్చి పాఠాలు చెప్పి వెళ్లిపోవడం తప్ప మిగిలిన వాటిని పట్టించుకోరు.
ఇక రాత్రి అయ్యాక అందులోని ఉద్యోగులు ఒక్కొక్కరు ఒక్కోరకంగా ప్రవర్తించేవారు. వయసుకు వచ్చిన ఆడపిల్లలతో చేయరాని పనులు చేయిస్తూ, తగలరానిచోట తగులుతూ, వింత వింత వికృత చేష్టలు చేయిస్తూ వికృతానందం పొందుతున్నారు. బయటకు చెప్తే చంపేస్తామంటూ బెదిరిస్తూ తమ రాక్షసక్రీడను కొనసాగిస్తుంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆ పసి మనసులు అల్లాడుతున్నాయి.
అలా వారి రాక్షస క్రీడలో బలైపోయిన తొమ్మిదో తరగతి చదువుతున్న 14 ఏళ్ల వెన్నెల తొమ్మిది నెలల కడుపు, రోజూ ప్రొద్దున వచ్చే టీచర్లకు కానీ అప్పుడప్పుడు వచ్చిపోయే తల్లిదండ్రులకు కానీ కనిపించలేదు ఎందుకంటే తమ కూతురు రెండుపూటలా తింటూ లావెక్కింది అనుకున్నారు తల్లిదండ్రులు.
ఆడ టీచర్లకు ఏదో చెప్పామా వెళ్లిపోయామా అన్నట్లుగా ఉండడం తప్ప ప్రతి వారిని గమనించడం తమ పని కాదనుకున్నారు. ఆ అమ్మాయిని ఎవరూ గమనించలేదు ఎవరూ పట్టించుకోలేదు.
ఆరోజు బాలిక దినోత్సవం సందర్భంగా గురుకులంలో ఏవో ఉత్సవాలు జరపిస్తున్నారు. అందరూ ఆ హడావిడిలో ఉంటే వెన్నెల మాత్రం కడుపు నొప్పితో బాధపడుతూ అవి పురిటి నొప్పులు అని తెలియక, బయటకు రాలేక ఎవరికి చెప్పుకోవాలో తెలియక అందరూ వెళ్లి కార్యక్రమం దగ్గర ఉంటే, అక్కడి అధికారులు బాలికల గురించి, వారి అభివృద్ధి గురించి ఉపన్యాసాలు ఇస్తుంటే, ఇక్కడ నొప్పులు తాళలేని ఆ పసికూన గట్టిగట్టిగా అరవ సాగింది. ఆ అరుపులు విన్న కొంతమంది అమ్మాయిలు వెన్నెలను దగ్గరకు వెళ్లి చూసి భయపడి టీచర్ల వద్దకు వెళ్లి చెప్పారు.
ఆ మాట విన్న టీచర్లు గబగబా హడావిడిగా వెన్నెల వద్దకు వచ్చారు వారిని చూసి అధికారులు కూడా వారి వెనకే వచ్చారు. అక్కడ ఆ బాత్రూం లో కాళ్ళ కింద నుంచి రక్తం కారిపోతుంటే నొప్పులతో విలవిలలాడిపోతున్న వెన్నెల అందరికీ అగుపించింది. విషయం అర్థమైన అధికారులు నెమ్మదిగా వెనక నుండి వెనకకే జారుకున్నారు.
వచ్చిన వాళ్ళు వచ్చినట్టే తమ కార్లల్లో వెళ్లిపోయారు హడావిడిగా, టీచర్లు వెన్నెలని అక్కడ ఉన్న గవర్నమెంట్ ఆసుపత్రికి చేర్చి, తల్లిదండ్రులకు సమాచారం అందజేసి చేతులు దులుపుకున్నారు.
హడావిడిగా వచ్చిన తల్లిదండ్రులు తమ కూతురికి జరిగింది తెలుసుకొని గుండెలు పగిలేలా ఏడ్చారు. అసలు ఏమైంది ఎవరు ఇలా చేశారు అంటూ టీచర్ లను నిలదీయడంతో మాకు ఏమీ తెలియదు మా దగ్గర ఉన్నప్పుడు బాగానే ఉంది అప్పుడప్పుడు మీ ఇంటికి వచ్చినప్పుడు ఏం జరిగిందో అంటూ నిందలు మొత్తం తల్లిదండ్రులు వాళ్ళ తాతల అమ్మమ్మల మీద వేసి బయటపడ్డారు. అందుకు ఉన్నత అధికారుల చేయూత కూడా అందింది.
రెక్కాడితే గానీ డొక్కాడని జీవితాలు కాబట్టి ఆ గిరిజన తల్లిదండ్రులు ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు ఆ బాలిక పరిస్థితి ఏమిటి? అటు చదువుకోవాలా లేకపోతే ఇటు బిడ్డను సాకడానికి పనిచేయాలా? ఆ పిల్ల రేపు పొద్దున తండ్రి ఎవరు అని ఎవరైనా అడిగితే ఏం సమాధానం చెప్పాలి? ఆ బిడ్డను ఎక్కడ వదిలేయాలి? అసలు దీనికి కారణమైన వారు ఎవరని చెప్తుంది వెన్నెల.
అమ్మా, నాన్న ఎవరు అని రేపొద్దున ఆ పసిపాప పెరిగి పెద్దయిన తర్వాత అడిగితే ఎవరిని చూపిస్తుంది ఆ వెన్నెల? ఇక వెన్నెలకు బతుకంతా చీకటి అంధకార బంధనమేనా? ఎవడో దగ్గర బంధువే ఇలా చేశాడట అంటూ పుకారు పుట్టించి చేతులు దులుపుకున్న ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది? మహిళలకు ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అంటూ ప్రగల్బాలు పలికి ఓట్లు వేయించుకుంటున్న రాజకీయ నాయకులు ఈ ప్రశ్నకు ఏం సమాధానం చెబుతారు? అసలు సమాధానం చెప్పే అవకాశం సమయం రాజకీయ నాయకులకు ప్రభుత్వానికి ఉందా?
ఇప్పుడు ఆ వెన్నెల పరిస్థితి ఏమిటి? ఆమె జీవితం నాశనం చేసిన వారు హాయిగా ఉత్సాహంగా వేరేచోట గడుపుతుంటే ఆమె మాత్రం నిత్యం ఏడుస్తూ తనకు జరిగిన మోసానికి అవమానానికి తన ఆత్మాభిమానం చంపుకొని బ్రతుకుతుందా లేదా చనిపోతుందా లేదా బిడ్డను అనాధ శరణాలయంలో వేస్తుందా ఈ ప్రశ్నకు బదులేది?
ఇలాంటి సంఘటనలు రోజులో ఎన్నో చూస్తుంటాం, ఎన్నో వింటుంటాం కానీ, విని వదిలేయడం కాకుండా వాటికి పరిష్కారం అనేది ఆలోచించాలి ఎక్కడ స్త్రీ పూజింపబడుతుందో అక్కడ సంతోషాలు వెళ్లి విరుస్తాయని అనుకున్న మన భారత దేశంలోనే నిమిషానికో అత్యాచారం, మానభంగం, పసిపిల్లలపై ఆకృత్యాలు జరుగుతుంటే ఇంకెక్కడ బాలిక దినోత్సవం జరుపుకుంటాం?
ఇంకెక్కడ మహిళా దినోత్సవాలు జరుపుకుంటాము ఇదే నా స్వతంత్రం ఇదేనా మన భారతదేశం గొప్పదనం. ఈ ప్రశ్నలన్నిటికీ కళ్ళ గంతలు కట్టుకున్న నోరులేని న్యాయదేవత సమాధానమిస్తుందా? ఇవ్వలేదు మరెవరివ్వాలి అంటే మనమే ఇవ్వాలి యువత మేలుకోవాలి జరిగిన అన్యాయాన్ని బయటకు తీసి ప్రశ్నించగలిగే సత్తా, శక్తి మనకి రావాలి.
అంటే మనలో చైతన్యం పెరగాలి, ప్రశ్నించే తత్వం పెరగాలి, ఇదేంటి అని గట్టిగా న్యాయానికి న్యాయం జరిగేంత వరకు పోరాడగలిగే శక్తి మనందరికీ కలగాలి. అప్పుడే మనకు సర్వ స్వతంత్రం వచ్చినట్లు.... అప్పుడే మనం బాలిక దినోత్సవాలు, మహిళా దినోత్సవాలు జరుపుకుంటున్నట్లు ....
నిజంగా జరిగిన సంఘటనకు అక్షర రూపం నా ఈ కథ.
- భవ్యచారు