అశ్వినీ దేవతలు

Comments · 167 Views

అశ్వినీ దేవతలు

అశ్వినీ దేవతలు

 

 

అశ్వినీ దేవతలు సూర్యపుత్రులు. వీరు కవలలు. వీరిసోదరి ఉష. ఆమె ప్రతిరోజూ వీరిని బ్రహ్మ ముహూర్తంలో మేల్కొల్పుతుందట.

ఆ తరువాత వారు రథాన్ని అధిరోహించి తమ సోదరి ఉషను ముందు కూర్చోబెట్టుకుని తూర్పుదిక్కు నుండి పడమటి దిక్కుకు ప్రయాణిస్తారని పురాణ వర్ణన.

వీరు ప్రయాణించే రథం పేరు హిరణ్యవర్తం. అది హిరణ్యయానమనే దోవలో వాయువేగ మనోవేగాలతో ప్రయాణిస్తుంది.

ఆ రథం చాలా బృహత్తరమైనది. అది హిరణ్యంతో నిర్మించబడింది. ఆ రథానిని మూడు గుర్రాలు నడుపుతుంటాయి. అద్వరాశ్వాలనే ఆగుర్రాలు తెల్లగా నున్నగా ఎల్లప్పుడూ యవ్వనంతో అత్యంత ఉత్సాహంతో ఉంటాయి.

చిత్రమైన ఈ రథానికి చక్రాలూ మూడే. సారథి కూర్చోవడానికి త్రిఫలకాలు, త్రిబంధురాలు అనే పేర్లు కలిగిన మూడు ఆసనాలు ఉంటాయి.

ఆరథంలో ఒకవైపు ధనం మరొకవైపు తేనె, సోమరసం మరొకవైపు ఆయుధాలు ఉంటాయి. రథం పైభాగంలో వేయిపతాకాలు సుందరంగా రెపరెపలాడుతూ ఉంటాయి.

ఈ దేవతలు దయార్ధ హృదయులు, ధర్మపరులు, సత్యసంధులు. వీరి ఆయుధాలలో అత్యంత ప్రభావితమైన మహా ఔషధాలు ఉంటాయి.

వీరు ఆరోగ్యసమస్యలు ఉన్నవాళ్ళను అనేక సమయాలలో ఆహ్వానంపై వచ్చి శస్త్రచికిత్సలు సైతం చేసినట్లు పురాణ వర్ణన.

వైద్యశాస్త్రానికి అధిపతులైన ఈ దేవతలు కుడిచేతిలో అభయముద్ర ఎడమచేతిలో ఆయుర్వేద గ్రంథం కుడిపక్కన మృతసంజీవిని విశల్యకరణి లాంటి ఔషధీ లతలు ఎడమవైపు అమృతకలశాన్ని పట్టుకున్న ధన్వంతరీ కలిగి ఉంటారని పురాణాలలో వర్ణించబడింది.

Comments