పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం

Comments · 241 Views

పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం

పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం

 

సుప్రీం కోర్టును ఆశ్రయించడం ద్వారా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడాన్నిఅడ్డుకునేందుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కనిపించడం లేదు. సుప్రీం కోర్టు ఆదేశాలు ఏంటి?... ఫిరాయింపుల చట్టం ఏం చెబుతోంది అనే అంశం ప్రస్తుతం చర్చనియాంశంగా మారింది. కాంగ్రెస్ లో చేరిన స్వంత పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించేందుకు ఓవైపు అసెంబ్లీ స్పీకర్‌కు వినతి పత్రాలు ఇస్తూనే.. మరోవైపు, హైకోర్టును, సుప్రీం కోర్టును ఆశ్రయించి ఫిరాయింపులను అడ్డుకోవాలని మాజీ సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నారు.

ఎమ్మెల్యేలపై వచ్చిన అనర్హత పిటిషన్‌పై మూడు నెలల్లోపు స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునే అస్త్రంగా చేసుకోవాలని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. ఎమ్మెల్యే దానం నాగేందర్‌ కాంగ్రెస్ లో చేరి మూడు నెలలు పూర్తకావడంతోఈ విషయంలో నాగేందర్ అనర్హత పిటిషన్‌పై స్పీకర్‌ ఏ నిర్ణయమూ తీసుకోలేదంటూ సుప్రీంకోర్టు ముందుకు తీసుకెళ్లాలనేది కేసీఆర్ ఆలోచణగా తెలుస్తోంది. 

ఫిరాయింపు చట్టాల్లో ఏముంది?

1985లో 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగానికి 10వ షెడ్యూల్‌ను చేర్చి, దానిలో ‘పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఆర్టికల్స్‌ 101, 102 190, 191ల్లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి వివిధ అంశాలను చేర్చారు. ఈ చట్టం ప్రకారం సింగిల్ గా ఎవరైనా ఎమ్మెల్యేలు స్వంత పార్టీని వీడి మరో పార్టీలో చేరినప్పుడు అతనిపై అనర్హత వేటు వేసే అధికారం స్పీకర్ కు ఉంటుంది. కానీ వాజ్‌పేయీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం తెచ్చిన 91వ రాజ్యాంగసవరణ చట్టం-2003 ద్వారా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోని ఆర్టికల్‌ 164(IA) ప్రకారం ఎవరైనా ఎంఎల్‌ఏ/ఎంఎల్‌సీని అనర్హుడిగా ప్రకటిస్తే, ఆ సభ్యుడు ఆ సభా కాలంలో మంత్రి పదవిని చేపట్టడానికి అనర్హుడు.

అయితే ఒక రాజకీయ పార్టీ మరో పార్టీలో విలీనమైనప్పుడు ఆ పార్టీకి చెందిన సభ్యులకు ఈ చట్టం ప్రకారం అనర్హత వర్తించదు. ఓ రాజకీయ పార్టీకి చెందిన మొత్తం సభ్యుల్లో 2/3వ వంతు సభ్యులు వేరే పార్టీలోకి మారినప్పుడు వారికి కూడా ఈ చట్టం వర్తించదు. ఈ చట్టం గురించి అవగాహన ఉండే గతంలో కేసీఆర్ కాంగ్రెస్ నుండి 19 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే వారిలో12 మందిని పార్టీలో చేర్చుకోవడం జరిగింది. 19లో 12 మంది అంటే 2/3 వ వంతు. సీఎల్పీని బీఆర్ఎస్ లో విలీనం చేశారు కాబట్టి ఆయా ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడలేదు. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఒక్కరొక్కరుగా చేరుతుండటంతో వారిపై అనర్హత వేటు వేయించడం ద్వారా మిగిలిన వారిని పార్టీ మారకుండా అడ్డుకోవాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. కానీ... పార్లమెంటు ఎన్నికల తరువాత బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని సీఎం రేవంత్ రెడ్డితో పాటు... మంత్రులు.. కాంగ్రెస్ నేతలు ప్రకటిస్తూ వచ్చారు. 

అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోవడంతో పాటు పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్కస్థానాన్ని కూడా గెలుచుకోకపోవడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు.. నేతల్లో నైరాశ్యం నెలకొంది. ఈ నేపథ్యంలో జూలై మొదటివారంలో మంత్రివర్గాన్ని విస్తరించాలని భావిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అంతలోపు బీఆర్ఎస్ నుండి 2/3వ వంతు మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మొన్నటి ఉప ఎన్నికలో కంటోన్మెంట్ ను కాంగ్రెస్ కైవసం చేసుకోవడంతో కాంగ్రెస్ స్వంత బలం 64 సీట్లకు పెరిగింది. దీనికి తోడు సీపీఐ నుండి ఒక సభ్యుడు... ఇటీవల కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 72కి చేరింది.  బీఆర్ఎస్ కు 38 మంది సభ్యులు ఉండగా ఇందులో 26 మందిని చేర్చుకుంటే ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసుకోవచ్చు. 

దీంతో సుప్రీం కోర్టు ఆదేశాల నుండి మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది. మంత్రివర్గ విస్తరణ లోపు లేదా అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లోపు మరో 20 మందిని పార్టీలో చేర్చుకునే దిశగా ప్రయత్నాలు సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఇతర జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలతో టచ్ లో ఉన్నారు. వీరంతా త్వరలోనే కాంగ్రెస్ గడప తొక్కే అవకాశం ఉంది. దీంతో బీఆర్ఎస్ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేయడం లేదా బీఆర్ఎస్ఎల్పీ పేరిట ప్రత్యేక గ్రూప్ గా పరిగణించే అవకాశం ఉంది. అదే జరిగితే బీఆర్ఎస్ లో కేసీఆర్ ఆయన తనయుడు.. అల్లుడితోపాటు మరికొందరు మాత్రమే మిగిలే అవకాశం ఉంది. 
మీరు నేర్పిన విద్యే కదా?

అధికారంలో ఉన్నామని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎక్స్ ద్వారా చేసిన హెచ్చరికలను కూడా ఈ సందర్భంగా చర్చించుకోవలసిన అవసరం ఉంది. మా పార్టీ ఎమ్మెల్యేలు ఫిరాయించేందుకు ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్కు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెబుతారు’’అని కేటీఆర్ అంటున్నారు. మరి మీరు కాంగ్రెస్ సభ్యులను చేర్చుకున్నప్పుడు ఈ నీతి సూత్రాలు ఏమయ్యాయనేది అధికార పార్టీల నేతల ప్రశ్న. పార్టీల విలీనం ప్రక్రియలను రాష్ట్రంలో మొదలు పెట్టిందే మీరు... మీరు చేస్తే ఒప్పు...మేము చేస్తే తప్పు ఎట్ల అవుతుందో చెప్పాలంటున్న కాంగ్రెస్ నేతల ప్రశ్నకు కేటీఆర్ ఏం సమాధానం చెప్తారో మరి. 

     -జంగిటి వెంకటేష్, తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఉపాధ్యక్షుడు

Comments