తోడు నీడని నడుచుకో...!!! ఏడవకే ఏడవకే ఎర్రి నాతల్లీ... ఏడ్చినా కన్నీటితో నీ పుట్టింటి గడపను తడుపకే ఎర్రి నాతల్లీ... ఇంపుగా కట్టిన ఇసుక గూళ్ళలో చిరుదీపాలు వెలిగించావు... పాలకంకుల పసరును పచ్చిగానే తాగావు అమ్మచేతి బువ్వలను కమ్మగానే తిన్నా పరిణయ వేడుకతో పిల్లివై తల వంచక తప్పదే ఎర్రి నాతల్లీ... ఆడపిల్లంటే అత్తారింటికి దారని తెలిసి రాసిండేమో ఆ మొండిబ్రహ్మ... ఆటలాడే ఆరోజుల మమకారాన్ని వెన్నెల పైటేసి పాడినా ఈడొచ్చేవరకే నీతల్లి ఆదరణే ఎర్రి నాతల్లీ... కర్మగాలిన ఆడబతుకులు ఆడితోనే అంత మొందాలని... తోడబుట్టిన దూరమయ్యే బంధమని నీటంచున నాచుకింద నీడగ దాగాలని గోటితో గీసిన దుమ్ము పొడితో ఆ దేవుడు రాత రాసిండే ఎర్రి నాతల్లీ... జరిగిన కథలతో పొద్దును పొగిడినా ఏమున్నదే గర్వకారణం... సుడిగుండాన మునిగేటి సూత్రానికి దారవడం తప్పా... వెన్నదట్టని వేకువలు కరుణ జూపక పోయినా కలత చెందక పోయి... తాళి గట్టినోడే నీకు తోడు నీడని నడుచుకోయే ఎర్రి నాతల్లీ..
Search
Popular Posts